- ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యే బాలునాయక్
దేవరకొండ, వెలుగు: ఈ నెల 6న నల్గొండ జిల్లా దేవరకొండలో ప్రజా పాలన.. ప్రజా విజయోత్సవాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన చేయనున్నారని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు.
గురువారం దేవరకొండలో స్థానిక ఎమ్మెల్యే బాలు నాయక్ తో కలిసి బహిరంగ సభ ప్రాంగణాన్ని ,హెలిప్యాడ్ నిర్మాణంతో పాటు, ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో అత్యంత వెనుకబడిన ప్రాంతం దేవరకొండ అని మంత్రి పేర్కొన్నారు.
ఈ నెల 6న సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో తండాల్లో అభివృద్ధి కుంటుపడిందని కనీసం మంచినీళ్లు ఇవ్వలేదని మండిపడ్డారు. కమిషన్ల కోసం కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పై పెట్టిన శ్రద్ధలో సగం పెట్టినా ఎస్ఎల్బిసీ పూర్తయ్యేదని విమర్శించారు.
ఎస్‌ఎల్బీసీ పూర్తి చేసి నల్గొండకు నీళ్లు తెస్తాం
సీఎం రేవంత్ రెడ్డి చొరవతో ఎస్ఎల్బీసీ పనులు తిరిగి ప్రారంభించామని తెలిపారు. అత్యంత అధునాతన టెక్నాలజీతో ఎస్ఎల్బీసీ సొరంగం నిర్మాణ పనులు పూర్తి చేసి నిర్ణీత గడువులోగా గ్రావిటీ ద్వారా నల్గొండకు నీటికి తీసుకువస్తామన్నారు. నక్కలగండి, డిండి ప్రాజెక్టులు పూర్తిచేసి కృష్ణా నీటిని నింపుతామన్నారు. భూగర్భ జలాలు పెంచుతామన్నారు. గత ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ లేకున్నా కోటి 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించామన్నారు. సుందిల్ల, అన్నారం, మేడిగడ్డలో నీటిని నిల్వచేస్తే కూలిపోయే ప్రమాదం ఉందని ఎన్డీఎస్ఏ తెలిపిందని మంత్రి గుర్తు చేశారు.
కొడంగల్ మాదిరిగా దేవరకొండను దత్తత తీసుకోవాలని ఎమ్మెల్యే బాలు నాయక్, తాను సీఎంను కోరతామన్నారు. అంతకుముందు చింతపల్లి మండల కేంద్రంలోని సాయిబాబా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి కోమటిరెడ్డిని సాయిబాబా దేవాలయ కమిటీ చైర్మన్ మంచిగంటి ధనుంజయ, ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. మంత్రి వెంట మాజీ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నరసింహ, పార్లమెంట్ కో ఆర్డినేటర్ సిరాజ్ ఖాన్, ముక్కమల్ల వెంకటయ్య గౌడ్, జాల నరసింహారెడ్డి, ఏవీ రెడ్డి, ఎండీ యూనుస్, వెంకటేశ్వర్లు, పొన్నబోయిన సైదులు తదితరులు ఉన్నారు.
