కేసీఆర్కు రేవంత్ పరామర్శ.. యశోద ఆస్పత్రికి వెళ్లిన సీఎం

కేసీఆర్కు రేవంత్ పరామర్శ.. యశోద ఆస్పత్రికి వెళ్లిన సీఎం
  • కేసీఆర్కు రేవంత్ పరామర్శ
  • యశోద ఆస్పత్రికి వెళ్లిన సీఎం
  • కేసీఆర్ త్వరగా కోలుకుని అసెంబ్లీకి రావాలి.. ప్రజల తరఫున మాట్లాడాలి 
  • తమ ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాలని సీఎం రేవంత్ ఆకాంక్ష 

హైదరాబాద్, వెలుగు : హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ పొందుతున్న మాజీ సీఎం కేసీఆర్ ను సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఆదివారం మంత్రి సీతక్క, షబ్బీర్ అలీతో కలిసి రేవంత్ యశోద ఆస్పత్రికి వెళ్లారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ త్వరగా కోలుకుని అసెంబ్లీకి రావాలని ఆయన ఆకాంక్షించారు. ‘‘కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ప్రజల తరఫున మాట్లాడాలి. మా ప్రభుత్వానికి అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వాలి” అని కోరారు. ‘‘కేసీఆర్ కోలుకుంటున్నారని డాక్టర్లు చెప్పారు. ఆయన ఆరోగ్యంపై మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించాను. ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తం” అని తెలిపారు. అంతకుముందు యశోద ఆస్పత్రిలో ఉన్న కేటీఆర్, బీఆర్ఎస్ నేతలతోనూ రేవంత్ మాట్లాడారు. కేసీఆర్ ను చూసేందుకు లోపలికి వెళ్తున్న టైమ్ లో కేటీఆర్ భుజం తట్టి సీఎం ధైర్యం చెప్పారు. 

కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో జారిపడగా తుంటి ఎముక విరగడంతో హిప్ రీప్లేస్ మెంట్ సర్జరీ చేశారు. కేసీఆర్ హాస్పిటల్ లో అడ్మిట్ అయిన రోజునే దగ్గరుండి అన్ని చూసుకోవాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెల్త్ సెక్రటరీ రిజ్వీని రేవంత్ ఆదేశించారు. ఇక ఆపరేషన్ తర్వాత కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉంది. శనివారం ఆయన వాకర్ సాయంతో డాక్టర్ల పర్యవేక్షణలో కాసేపు నడిచారు. కేసీఆర్ వాకర్ సాయంతో నడుస్తున్న వీడియోను డాక్టర్లు రిలీజ్ చేశారు.