
- పార్టీ గెలుపే లక్ష్యంగా కలిసి పని చేయండి
- ప్రభుత్వ పథకాలనుప్రజల్లోకి తీసుకెళ్లాలి
- సర్వేల ఆధారంగానే అభ్యర్థి ఎంపిక
- హైకమాండ్‌దే తుదినిర్ణయమని వెల్లడి
- ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూల దృక్పథం: మంత్రి వివేక్
హైదరాబాద్, వెలుగు:జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ సమన్వయంతో పని చేయాలని కాంగ్రెస్ నేతలకు సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ‘‘బైపోల్‌లో విజయం కోసం పోలింగ్ బూత్‌ల వారీగా సమగ్ర ప్రచార ప్రణాళికను సిద్ధం చేసుకోండి. ప్రతి పోలింగ్ బూత్‌కు ఇన్‌చార్జులను నియమించుకోండి. అక్కడి పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించండి” అని దిశానిర్దేశం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గ పరిధిలోని డివిజన్ల ఇన్‌చార్జులతో ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఇప్పటి వరకు చేపట్టిన అభివృద్ధి పనులపై ప్రచారం చేయాలన్నారు. ‘‘అభ్యర్థి ఎంపిక హైకమాండ్ చూసుకుంటుంది. దీని గురించి ఎవరూ ఎక్కువగా ఆలోచించాల్సినఅవసరం లేదు. సర్వేల ఆధారంగానే అభ్యర్థి ఎంపిక ఉంటుంది” అని స్పష్టం చేశారు. ‘‘పార్టీ గెలుపే లక్ష్యంగా అందరూ సమన్వయంతో పని చేయాలి. డివిజన్ల ఇన్‌చార్జులు చురుగ్గా ఉండాలి. ఏమైనా ఇబ్బందులుంటే చర్చించుకోని పరిష్కరించుకోవాలి. కార్యకర్తల పనితీరు, క్షేత్రస్థాయి పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తాను. పార్టీ గెలుపే లక్ష్యంగా అందరూ పని చేయాలి” అని దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.
‘‘నియోజకవర్గంలోని సమస్యలను గుర్తించి, వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలి. దీనివల్ల ప్రజలకు ప్రభుత్వంపై మరింత నమ్మకం పెరుగుతుంది. నియోజకవర్గంలో కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రజలకు భరోసా కల్పించాలి” అని అన్నారు. ‘‘జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మన పార్టీనే గెలుస్తుందని ఇప్పటికే పలు సర్వేలు స్పష్టం చేశాయి. గత సర్వేల కంటే ప్రస్తుతం మనం చాలా మెరుగయ్యాం. సానుభూతి ఎజెండాగానే బీఆర్ఎస్ ప్రచారానికి వెళ్తున్నది. కానీ మనం మాత్రం అభివృద్ధి, సంక్షేమమే ఎజెండాగా ఎన్నికల ప్రచారం చేయాల్సి ఉంది” అని అన్నారు. ఈ సమావేశంలో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఇన్‌చార్జ్‌లు, మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్ రావు, వివేక్ వెంకటస్వామితో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఏఐసీసీ సెక్రటరీ విశ్వనాథన్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, వివిధ డివిజన్ల ఇన్‌చార్జులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు.
సర్కార్‌పై ప్రజల్లో నమ్మకం పెరుగుతున్నది: మంత్రి వివేక్
ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూల దృక్పథం ఉన్నదని జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఇన్‌చార్జ్, మంత్రి వివేక్‌వెంకటస్వామి అన్నారు. ‘‘నేను స్థానికంగా విస్తృతంగా పర్యటిస్తున్నాను.. ప్రజలను కలుస్తున్నాను. ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూల దృక్పథం ఉంది. అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలతో సర్కార్‌పై ప్రజల్లో నమ్మకం పెరుగుతున్నది. ఈ సానుకూల వాతావరణం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలుపుకు దోహదం చేస్తుంది” అని ఆశాభావం వ్యక్తం చేశారు. అక్టోబర్ చివర్లో లేదా నవంబర్మొదటి వారంలో ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.
సీఎం రేవంత్‌ను కలిసిన బండారు దత్తాత్రేయ
హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ శనివారం సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అక్టోబర్ 3న హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో నిర్వహించనున్న ‘‘అలయ్ బలయ్’’ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డిని దత్తాత్రేయ ఆహ్వానించారు. ప్రతి సంవత్సరం విజయదశమి పండుగ సందర్భంగా అలయ్ బలయ్ కార్యక్రమాన్ని బండారు దత్తాత్రేయ నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, రాజకీయ నాయకులు, కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.