- త్వరలోనే ఖాళీలన్నీ భర్తీ చేస్తం
- నిరుద్యోగులు ఏ పార్టీ చేతుల్లో ఆయుధాలుగా మారొద్దు: సీఎం రేవంత్
- కోర్టు కేసులతో అడ్డుకున్నా.. కొట్లాడి మరీ ఉద్యోగాలిస్తున్నం
- 2034 దాకా నేనే సీఎంగా ఉంటా.. 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యం
- శిల్పారామంలో గ్రూప్-3 విజేతలకు నియామక పత్రాలు అందజేత
హైదరాబాద్, వెలుగు: రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను భర్తీ చేస్తామని, నిరుద్యోగులు ఆందోళన చెందవద్దని, ఏ రాజకీయ పార్టీల చేతుల్లో ఆయుధాలుగా మారొద్దని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ‘‘ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై మాకు ఎవ్వరూ చెప్పాల్సిన అవసరం లేదు. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంటీన్‌లో, అశోక్ నగర్ చౌరస్తాలో నిరుద్యోగులు ఏం మాట్లాడుకుంటున్నారో.. ఏం ఆశిస్తున్నారో నాకు బాగా తెలుసు. దీనిపై నాకు సంపూర్ణమైన అవగాహన ఉంది. మీ భవిష్యత్తు కోసమే ప్రభుత్వం పనిచేస్తున్నది” అని స్పష్టం చేశారు. శుక్రవారం శిల్పకళా వేదికలో జరిగిన ‘కొలువుల పండుగ’లో భాగంగా 1,370 మంది గ్రూప్–3 విజేతలకు సీఎం రేవంత్‌రెడ్డి నియామక పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత పాలకులు పదేండ్లలో ఉద్యోగాల భర్తీపై దృష్టి సారించలేదని మండిపడ్డారు. కేవలం కుటుంబం, పార్టీ, రాజకీయ ప్రయోజనాల కోసమే పనిచేశారని, తెలంగాణ యువత కోసం ఆలోచించలేదని విమర్శించారు. వాళ్లకు కుటుంబం ఫస్ట్.. పార్టీ సెకండ్.. పాలిటిక్స్ థర్డ్ ప్రయారిటీగా మారిందని పేర్కొన్నారు. వాళ్ల ఉద్యోగాలు పోతేనే మనకు ఉద్యోగాలు వస్తాయని యువత నడుం బిగించారని, కాబట్టే ఇయ్యాల ప్రజా ప్రభుత్వం వచ్చిందని తెలిపారు.
తాము అధికారంలోకి రాగానే యూపీఎస్సీ తరహాలో టీజీపీఎస్సీని ప్రక్షాళన చేశామని, క్వాలిఫైడ్ అధికారులను టీజీపీఎస్సీ సభ్యులుగా, చైర్మన్‌గా నియమించామని చెప్పారు. డీఎస్సీ ద్వారా టీచర్ పోస్టులను 55 రోజుల్లోనే పరీక్షలు పెట్టి, ఫలితాలు ఇచ్చామని అన్నారు. గ్రూప్స్ పరీక్షల్లోనూ ఎలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తగా భర్తీ చేశామని వివరించారు. నియామక పత్రాలు ఇవొద్దని కుట్రలు చేసినా.. కోర్టుల్లో కొట్లాడి పోస్టులను నింపామని తెలిపారు. రెండేండ్లలో దాదాపు 70 వేల ఉద్యోగాలు ఇచ్చామని, ఎల్బీ స్టేడియం, శిల్పారామం, ఇరిగేషన్ ఆఫీస్, అంబేద్కర్ విగ్రహం సాక్షిగా నియామక పత్రాలు అందించామని వెల్లడించారు.
2034 దాకా నేనే సీఎం..
2034 దాకా తానే సీఎంగా ఉంటానని రేవంత్ రెడ్డి తెలిపారు. ‘‘2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తీర్చిదిద్దడమే మన లక్ష్యం. అప్పటిదాకా మిమ్మల్ని చూస్తూనే ఉంటా. వన్ ట్రిలి యన్ డాలర్ల మార్కును చేరేదాకా అందరం కృషి చేద్దాం” అని పేర్కొన్నారు. ‘‘ప్రస్తుతం తెలంగాణలో 26 వేల సర్కారు బడుల్లో 16 లక్షల మందే చదువుతున్నారు. కానీ, 11 వేల ప్రైవేట్ స్కూల్స్‌లో 33 లక్షల మంది ఉన్నారు. ప్రభుత్వ బడులపై విశ్వాసం ఎందుకు తగ్గుతుందో ఆలోచించాలి.
క్వాలిటీ ఎడ్యుకేషన్, ఫుడ్, స్కిల్స్ లేకపోతే అంతర్జాతీయంగా పోటీ పడలేం. పేదలకు నాణ్యమైన విద్య అందిస్తే ప్రపంచంతో పోటీపడగలం. ఇప్పటికే 2 కోట్ల 85 లక్షల మెట్రిక్ టన్నుల వరి పండించి దేశానికి ఆదర్శంగా నిలిచాం” అని వివరించారు. ఉద్యోగం వచ్చాక తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఊరుకోబోమని సీఎం రేవంత్ అన్నారు. మీ జీతంలో 10 నుంచి 15 శాతం కోత విధించి నేరుగా మీ తల్లిదండ్రులకే పంపిస్తామని తెలిపారు.
ఆర్టీసీలో 3,030 పోస్టులు భర్తీ చేస్తున్నం: మంత్రి పొన్నం
2012 తర్వాత ఆర్టీసీలో నియామకాలే జరగలేదనీ, తాము ఆ సంస్థలో 3,030 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గత పదేండ్లలో ఉద్యోగ నియామకాలను ప్రకటించి, మధ్యలోనే ఆపేసేవారని, ఆ ఆటంకాలన్నింటినీ ప్రజా ప్రభుత్వం అధిగమించిందని చెప్పారు. 4 కోట్ల జనాభాలో 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని, ఉద్యోగాల కోసం పోటీ ఎలా ఉంటుందో సీఎం రేవంత్‌కు బాగా తెలుసని చెప్పారు.
ఏయే శాఖల్లో ఖాళీలు ఉన్నాయో స్వయంగా వివరాలు తెప్పించుకొని జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ చేస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అజారుద్దీన్, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్‌రెడ్డి, షబ్బీర్ అలీ, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు అరెకపూడి గాంధీ, కాలే యాదయ్య, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, సీఎస్ రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
