మోడీ మెడలు వంచేందుకే ఢిల్లీలో ధర్నా.. బీసీ బిల్లులకు ఆమోదం తెలపకపోతే గద్దె దింపుతం: సీఎం రేవంత్

మోడీ మెడలు వంచేందుకే ఢిల్లీలో ధర్నా.. బీసీ బిల్లులకు ఆమోదం తెలపకపోతే గద్దె దింపుతం: సీఎం రేవంత్

న్యూఢిల్లీ: బీసీ రిజర్వేషన్ల బిల్లులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపకపోతే.. ప్రధాని మోడీని గద్దె దించి, రాహుల్ గాంధీని ప్రధానిని చేసుకుని బీసీ రిజర్వేషన్లు సాధించుకుంటామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రధాని మోడీ మెడలు వంచేందుకే ఢిల్లీలో మహాధర్నా చేపట్టామని.. కేంద్ర ప్రభుత్వం బీసీ బిల్లులకు ఆమోదం తెలకపపోతే ప్రధాని మోడీని గద్దె దింపుతామని హెచ్చరించారు. బీజేపీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ చెప్పిన మోడీ ప్రధాని పదవి వదులుకోవడం లేదని.. 75 ఏళ్ల నిబంధన ఆయనకి వర్తించదా అని ప్రశ్నించారు. 

మోడీ గద్దె దిగినా.. దిగకపోయినా.. 2029లో మేమే ఆయనను గద్దె దింపి.. రాహల్ గాంధీని ప్రధానిని చేసుకుంటామని.. ఇదే మా శపథమని హాట్ కామెంట్స్ చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని 150 సీట్లకే పరిమితం చేస్తామని సవాల్ విసిరారు.  బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని డిమాండ్ చేస్తూ టీపీసీసీ ఆధ్వర్యంలో బుధవారం (ఆగస్ట్ 6) ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర మహాధర్నా చేపట్టారు. 

ఈ ధర్నాలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ‘‘రిజర్వేషన్లు 42 శాతం ఇవ్వాలని రెండు బిల్లులను ఆమోదించాం. ఆనాటి సీఎం కేసీఆర్ బీసీలపై కక్ష్య గట్టి తెలంగాణలో 50 శాతం మించకుండా చట్టం చేశారు. బలహీన వర్గాలకు అన్యాయం చేసే చట్టాన్ని తొలగించేందుకు ఆర్డినెన్స్ తీసుకొచ్చాం. విద్యా, ఉద్యోగాలు, రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్ల బిల్లును చట్టం చేసి గవర్నర్ రాష్ట్రపతికి పంపించారు. 50 శాతం క్యాప్‎ను తొలగించే ఆర్డినెన్స్ కూడా రాష్ట్రపతి దగ్గరకు వచ్చింది. నాలుగు నెలలు గడిచినా ఆమోదం లేదు. బీసీలకు అన్యాయం చేస్తుంటే గల్లీ నుంచి ఢిల్లీకి వచ్చి ధర్నా చేపట్టాం.

హైదరాబాద్ లో, తెలంగాణలో చేస్తే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పార్టీల మద్దతు మాత్రమే ఉంటుంది. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద చేస్తే దేశ వ్యాప్తంగా ఉన్న పార్టీల మద్దతు ఇస్తున్నారు. అదే విధంగా ఇండియా కూటమి పార్టీలు, నేతలు కూడా మద్ధతు ఇస్తున్నారు. తెలంగాణ కోసం పార్లమెంటులో మోదీ సర్కార్‎తో కొట్లాడుతామని ధర్నాకు వచ్చి అండగా నిలిచారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జోడో యాత్ర చేసి దేశానికి హామీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో కులగణన చేస్తామని తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చారు. 

కామారెడ్డిలో 42 శాతం బీసీ డిక్లరేషన్ ఇచ్చాం. రాహుల్ గాంధీ, సిద్ధరామయ్య కామారెడ్డిలో హామీ ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం 17 మంది సీఎంలు.. దేశంలో 300 కు పైగా ఏ ఒక్క ముఖ్యమంత్రి చేయని సాహసం మేము చేశాం. కేబినెట్ మంత్రులు నాకు అండగా నిలిచి 300 మంది సీఎంలు చేయలేని పనిని చేసే అవకాశం నాకు కల్పించారు. దేశానికే ఆదర్శంగా నిలబడటానికి తెలంగాణ సీఎంగా నాకు అవకాశం వచ్చింది. రాహుల్ గాంధీ సందేశాన్ని అందిపుచ్చుకుని.. జనగణనలో కులగణన చేయాలని నిర్ణయించాం’’ అని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల బిల్లులకు ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు. మోడీ సర్కార్ బిల్లులకు ఆమోదం తెలిపే వరకు  పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.