
హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు అతిపెద్ద సెంటిమెంట్ నీళ్లు అని.. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని ప్రాజెక్టులను మొదటి ప్రాధాన్యత కింద పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కొలువుల పండుగలో భాగంగా నీటి పారుదల శాఖలో కొత్తగా ఎంపికైన 244 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, (AEE), 199 జూనియర్ టెక్నికల్ ఆఫీసర్స్ (JTO)లకు జలసౌధ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం రేవంత్ నియామక పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములవుతున్న ఉద్యోగులకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. తెలంగాణలో తరతరాలుగా వాయిదాలు పడుతున్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలన్న చిత్తశుద్ధితో పని చేయాలని నీటి పారుదల శాఖలో కొత్తగా నియామక పత్రాలు అందుకున్న ఉద్యోగులకు సూచించారు. తెలంగాణ రైతులు ఆత్మగౌరవంతో బతకడానికి అవసరమైన నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో భాగస్వాములై ప్రజల భావోద్వేగానికి ప్రతీకలుగా నిలబడాలని పిలుపునిచ్చారు.
గత నలభై యాభై ఏళ్లుగా రావలసిన నీళ్లు రాకపోగా, పూర్తి కావలసిన ప్రాజెక్టులు పూర్తి కాని కారణంగా తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్ది వాయిదా పడుతున్న ప్రాజెక్టులను పూర్తి చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు. నీళ్లు ఎంత అవసరమో అందుకు ఎంతగా పరితపించామో, ఏ నీటి కోసమైతే పోరాటం మొదలైందో ఆ నీళ్లే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టాయని గుర్తు చేశారు. అందుకే నీటి పారుదల శాఖకు మా ప్రభుత్వం అంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నాలుగైదు దశాబ్దాలు వాయిదా పడిన ప్రాజెక్టులు.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో పదేళ్లలో కూడా పూర్తి కాలేదని అసహనం వ్యక్తం చేశారు.
జలయజ్ఞంలో భాగంగా ప్రారంభమైన ప్రాజెక్టులు తెలంగాణ వచ్చిన తర్వాత పదేళ్లలో ఏదీ పూర్తి కాలేదని.. ఈనాటికీ వాయిదాలు పడుతూనే ఉన్నాయన్నారు. ఇంజనీర్లుగా మీరు చేపట్టే ప్రాజెక్టులు భవిష్యత్తు తరాలకు అందించాల్సిన భాధ్యత ఉందని.. ఇది నెలనెలా జీతం తీసుకునే ఉద్యోగంగా కాకుండా ఒక బాధ్యతగా, ప్రజల భావోద్వేగంగా తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములై రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు.
ఇక, గత పదేళ్లుగా రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు చేపట్టలేదని విమర్శించారు. గత సెప్టెంబర్లో ఇదే వేదిక నుంచి 738 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లను, జూనియర్ అసిస్టెంట్లకు నియామాక పత్రాలు అందించి భుజం తట్టామని.. మళ్లీ ఇవాళ 443 ఉద్యోగాలను నియమించామన్నారు.14 నెలల కాలంలో ఒక్క నీటి పారుదల శాఖలోనే 1121 మందిని నియమించామంటే ఈ శాఖకు ఇస్తున్న ప్రాధాన్యతను అర్థం చేసుకోవాలని సూచించారు. ఉమ్మడి రాష్ట్రంలో పదేళ్లు, ప్రత్యేక తెలంగాణలో పదేళ్లు నోటిఫికేషన్ల కోసం కొట్లాడామని.. కానీ ప్రజా ప్రభుత్వ ప్రాధాన్యత ఉద్యోగ నియామకాలని స్పష్టం చేశారు.
ఇందులో భాగంగానే అధికారంలోకి వచ్చిన 14 నెలల్లో 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని.. ప్రైవేటు రంగంలో లక్ష ఉద్యోగాలు కల్పించాని పేర్కొన్నారు. 3 లక్షల కోట్ల రూపాయల మేరకు పెట్టుబడులను తీసుకొచ్చామని తెలిపారు. యువతకు విద్య, ఉద్యోగాల కల్పన మా ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అని నొక్కి చెప్పారు. అడ్డంకులను అధిగమించి తొందరలోనే గ్రూప్ I, II, III, IV నియామకాలు పూర్తి చేస్తామని పేర్కొన్నారు.