హైదరాబాద్: పశ్చిమాసియాలో యుద్ధం వల్ల రాబోయే రోజుల్లో మనకు యూరియా కొరత వచ్చేలా ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రామ గుండం ఫ్యాక్టరీ యూరియా అంతా మనకే దక్కేలా బీజేపీ ఎంపీలు సహకరించాలని కోరారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు చేద్దాం.. ఎన్నికలు లేనప్పుడు ప్రాంతాల అభివృద్ధికి పరస్పరం సహకరించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్ష పార్టీలు సమస్యలు తీసుకువచ్చిన ప్రభుత్వం పరిష్కరిస్తుందని తెలిపారు.
కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుతో రాజకీయాంగా భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు కానీ ఆ నియోజకవర్గాల ప్రజల అభివృద్ధి కోసం కూడా పని చేస్తామన్నారు. తాను ఏ నియోజకవర్గంపైన వివక్ష చూపించనని.. వివక్ష మా ఇంటా వంటానే లేదని చెప్పారు. సిద్దిపేట జిల్లాలోని నర్మెట్ట ఆయిల్ ఫ్యాక్టరీని కొడంగల్‌కు తరలించగలిగేవాణ్ని కానీ తాను అలా చేయలేదన్నారు.
కొడంగల్ లోనూ ఆయిల్ ఫ్యాక్టరీ నిర్మిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పామాయిల్ సాగు లాభసాటి వ్యవసాయమని.. రైతుల ఆదాయం కూడా పెరుగుతోందని అన్నారు. సిద్ధిపేట జిల్లా నర్మెట్టలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆయిల్ ఫ్యాక్టరీని ఆదివారం (మార్చి 22) సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభి రైతులకు అంకితం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రైతు సభలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పంటల విధానంలో మరిన్ని మార్పులు రావాలని సూచించారు.
►ALSO READ | ధరణిని బంగాళాఖాతంలో పడేశాం.. సాదాబైనాలకు పరిష్కారం చూపాం: మంత్రి పొంగులేటి
గతంలో రంగారెడ్డి జిల్లాలో కూరగాయాలు, పండ్లు, ఆకుకూరలు బాగా పండించేవారని.. కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం వల్ల రంగారెడ్డి జిల్లా పంటల సాగు తగ్గిందన్నారు. పంట మార్పిడికి రైతులను ప్రభుత్వ ప్రోత్సహిస్తోందని తెలిపారు. మిల్లెట్స్, ఆకు కూరలు, పామాయిల్ సాగుపై రైతులు దృష్టి పెట్టాలని సూచించారు. పంట మార్పిడితో రైతులకు మంచి ధర వచ్చేలా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతామన్నారు. 10 లక్షల ఎకరాల్లో పామాయిల్ పండించినా కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.
పాలు, కోడిగుడ్లు, కూరగాయలు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని.. రైతుల ఆదాయం పెరగాలంటే వరి పండించడం ఒక్కటే పరిష్కారం కాదన్నారు. పంట మార్పిడికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. రైతులు పండించిన వాణిజ్య పంటలను ఎగుమతి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ప్రతి రైతు కారు కొనుక్కునేలా ఆదాయం పెరగాలని సూచించారు. బంగారు తెలంగాణ అంటే ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందడమేనని అన్నారు.
