
హైదరాబాద్: కృష్ణా, గోదావరి జలాలపై అసెంబ్లీలో చర్చిద్దామని కేసీఆర్‌ను ఆహ్వానించానని.. ప్రతిపక్ష నేత సభకు రావాలని సూచన చేశా కానీ సవాల్ చేయలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వీధుల్లో, క్లబుల్లో, పబ్బుల్లో కాకుండా అసెంబ్లీలో చర్చకు రమ్మన్నాం. కానీ ఒకాయన (కేటీఆర్) ప్రెస్ క్లబ్‌కి వెళ్లి చర్చకు రమ్మని సవాల్ చేశారని ఫైర్ అయ్యారు. ఆయన పేరు ఎత్తడం కూడా నా స్థాయికి తగదని.. ఇకనైనా వీధులు, పబ్బులు, క్లబ్బులు కాకుండా చట్ట సభలకు చర్చకు రావాలన్నారు.
బుధవారం (జులై 9) ప్రజా భవన్లో కృష్ణా, గోదావరి జలాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. పీపీటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చాక 10 ఏళ్లు కేసీఆరే సీఎంగా ఉన్నారు. నీటి పారుదల శాఖకు కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులే మంత్రులుగా ఉన్నారని పేర్కొన్నారు. కేసీఆర్ పాలనలో కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు తీవ్ర నష్టం జరిగిందని విమర్శించారు.
‘‘కృష్ణా జలాల్లో తెలంగాణకు 299 టీఎంసీలు చాలని కేసీఆర్ సంతకం చేశారు. బేసిన్లు లేవు.. భేషజాలు లేవంటూ గోదావరి నీళ్లు కూడా రాయలసీమకు తరలించుకోండని జగన్‌కు సలహా ఇచ్చారు. రాయలసీమను రతనాల సీమ చేస్తానని ప్రకటించిందే కేసీఆర్. కృష్ణా పరివాహక ప్రాంతంలో రైతులకు కేసీఆర్ మరణశాసనం రాశారు’’ అని విమర్శించారు.
►ALSO READ | ముస్లిం ఓట్లే టార్గెట్.. జూబ్లీ హిల్స్ సీటుపై బీఆర్ఎస్ కొత్త ఎత్తులు..!
రాష్ట్రంలోకి కృష్ణా ప్రవేశించిన చోటే నీటిని ఒడిసి పట్టుకోవాల్సిందని.. జురాల నుంచే తెలంగాణకు నీళ్లు తెచ్చుకునేది ఉంటే రాష్ట్రం మరోలా ఉండేదని అన్నారు. అనాడు చిన్నారెడ్డి జురాల విషయం చెప్తే.. నిండు సభలో కేసీఆర్ అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆంధ్రవాళ్లు శ్రీశైలం వెనకాల పోతిరెడ్డి పాడు నుంచే నీటిని తోడేస్తున్నారన్నారు. కుల్వకుర్తి ఎత్తిపోతలకు ఇప్పటికీ నీటి కేటాయింపు లేదని.. కృష్ణాలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడం వల్లే ఈ దుస్థితి వచ్చిందని దుయ్యబట్టారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే బీఆర్ఎస్ మాట్లాడుతోందని ఫైర్ అయ్యారు.