మోదీని గద్దె దించుతం.. బీజేపీకి 150 సీట్లు కూడా రానివ్వం: సీఎం రేవంత్

మోదీని గద్దె దించుతం.. బీజేపీకి 150 సీట్లు కూడా రానివ్వం: సీఎం రేవంత్
  • రాహుల్​ అనుకుంటే 2004లో కేంద్ర మంత్రి, 2009లో ప్రధాని అయ్యేవారు
  • రాహుల్ హామీ మేరకే కులగణన
  • దేశానికి తెలంగాణ మోడ‌ల్ ఇచ్చాం
  • ఏఐసీసీ సదస్సులో సీఎం రేవంత్

న్యూఢిల్లీ, వెలుగు: వచ్చే లోక్​సభ ఎన్నికల్లో బీజేపీకి 150 సీట్లు కూడా రాని వ్వమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ విషయాన్ని బీజేపీ నేతలు తమ డైరీల్లో రాసుకోవాలని సూచించారు. ప్రధాని మోదీని కుర్చీ దించడానికి రాహుల్ గాంధీ నేతృ త్వంలోని కాంగ్రెస్ శ్రేణులు పోరాడుతున్నాయన్నారు. ‘రాజ్యాంగ సవాళ్లు: దృక్పథం, మార్గాలు’ థీమ్​పై శనివారం ఢిల్లీలో నిర్వహించిన సదస్సులో సీఎం రేవంత్​ రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్  ఏం చేసింద‌‌ని బీజేపీ వాళ్లు ప‌‌దే ప‌‌దే ప్రశ్నిస్తున్నారని సీఎం ఫైర్ అయ్యారు. ‘దేశానికి స్వాతంత్య్రం రాకముందే కాంగ్రెస్ పార్టీ ఉంది. బ్రిటిష్ వాళ్లతో పోరాడి దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిందే కాంగ్రెస్. ఈ విష‌‌యాన్ని బీజేపీ నేతలకు గుర్తుచేస్తున్నా. పాకిస్తాన్​ను యుద్ధంలో ఓడించి రెండు ముక్కలు చేసిన కాళీమాతా ఇందిరాగాంధీ. ఉగ్రవా దుల నుంచి దేశాన్ని ఆమె రక్షించారు. ఈ దేశం కోసం గాంధీజీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణ త్యాగా లు చేశారు’ అని సీఎం పేర్కొన్నారు. 

2009లోనే రాహుల్ ప్రధాని అయ్యే వారు

2004లో ప్రధాని అయ్యే అవకాశం ఉన్నా సోనియా గాంధీ ఆ పదవిని త్యాగం చేసి మన్మోహన్ సింగ్​కు ఇచ్చారని సీఎం రేవంత్​ గుర్తు చేశారు. రాష్ట్రప‌‌తిగా అవ‌‌ కాశం వ‌‌చ్చినా వ‌‌దులుకొని ప్రణబ్ ముఖ‌‌ర్జీని రాష్ట్రప‌‌తి చేశారన్నారు. రాహుల్ గాంధీ అనుకుంటే 2004లోనే కేంద్ర మంత్రి, 2009లోనే ప్రధాన‌‌మంత్రి అయ్యే వారన్నారు. కానీ, ఆ రెండింటిని ఆయ‌‌న త్యాగం చేశారన్నారు. ‘త్యాగాలు కాంగ్రెస్‌‌కు కొత్త కాదు, సామాన్య కార్యక‌‌ర్తగానే రాహుల్ కొన‌‌సాగుతున్నారు. పేద‌‌లు, ద‌‌ళితులు, ఆదివాసీలు, ఓబీసీల సామాజిక న్యాయం కోసం 25 ఏండ్లుగా రాహుల్ పోరాడుతున్నారు’ అని సీఎం కొనియాడారు. గుజరాత్ సీఎం అయింది మొద‌‌లు.. 2001 నుంచి మోదీ కుర్చీ వదలడం లేదని, ఈ సారి దిగిపోవడం ఖాయమన్నారు. ‘రెండు నెల‌‌ల క్రితం ఆర్ఎస్ఎస్ స‌‌ర్ సంఘ్ చాల‌‌క్ మోహ‌‌న్ భగ‌‌వ‌‌త్ 75 ఏండ్లు నిండిన వారు కుర్చీ వ‌‌ద‌‌లాల‌‌ని చెప్పినా మోదీ వ‌‌దులుకునేందుకు సిద్ధంగా లేరు. అద్వానీ, ముర‌‌ళీ మ‌‌నోహ‌‌ర్ జోషికి వ‌‌ర్తించే నిబంధ‌‌న‌‌లు మోదీకి వ‌‌ర్తించ‌‌వా? మోదీని ఆర్ఎస్ఎస్‌‌, వాజ్‌‌పేయి కుర్చీ నుంచి దించలేక‌‌పోయారు. వ‌‌చ్చే ఎన్నిక‌‌ల్లో మోదీని రాహుల్ గాంధీ కుర్చీ నుంచి దింపేస్తారు. వ‌‌చ్చే ఎన్నిక‌‌ల్లో బీజేపీకి 150కి మించి ఒక్క సీటూ రాదు.’ అని సీఎం రేవంత్​ పేర్కొన్నారు. 

సామాజిక న్యాయం కోసం రాహుల్ వెంట నడుస్తం

బీసీల సామాజిక న్యాయం కోసం రాహుల్ గాంధీ నేతృత్వంలో పోరాడతామని సీఎం రేవంత్​ అన్నారు. ‘రాహుల్ గాంధీ భార‌‌త్ జోడో యాత్ర చేశారు. ఆ టైంలో తెలంగాణ‌‌లో కులగ‌‌ణ‌‌న‌‌కు హామీ ఇచ్చారు. దీంతో ఆయ‌‌నకు బాస‌‌ట‌‌గా తెలంగాణ ప్రజ‌‌లు ప్రేమ దుకాణాలు (మొహ‌‌ బ్బత్ కా దుకాణ్‌‌) తెరిచారు. అందుకే మేం తెలంగాణ‌‌లో కులగ‌‌ణ‌‌న చేశాం. దేశానికి తెలంగాణ మోడ‌‌ ల్ ఇచ్చాం. దేశంలో సామాజిక న్యాయం కోసం, కులగ‌‌ణ‌‌న కోసం, బీసీల‌‌కు 42 శాతం రిజ‌‌ర్వేష‌‌న్లు సాధిం చడం కోసం, నూత‌‌న సామాజిక న్యాయ సాధ‌‌న‌‌ కోసం రాహుల్ వెంట ఉండి పోరాటం చేస్తాం’ అని సీఎం అన్నారు.