సికింద్రాబాద్-నిజామాబాద్ మధ్య మళ్లీ రాకపోకలు సాగిస్తున్న రైళ్లు

సికింద్రాబాద్-నిజామాబాద్ మధ్య మళ్లీ రాకపోకలు సాగిస్తున్న రైళ్లు

కామారెడ్డి జిల్లా: సికింద్రాబాద్-నిజామాబాద్ మధ్య మళ్లీ రైళ్లు తిరుగుతున్నయ్. కామారెడ్డి జిల్లాలో వరదల కారణంగా రైల్వే ట్రాక్ పూర్తిగా దెబ్బతినడంతో మూడు రోజులుగా రైళ్ల రాకపోకలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. తలమడ్ల దగ్గర ట్రాక్ మరమ్మత్తులు పూర్తి కావడంతో సికింద్రాబాద్-నిజామాబాద్ మధ్య రైళ్ల రాకపోకలు మళ్లీ యథావిధిగా కొనసాగుతున్నాయి. తలమడ్ల స్టేషన్ మీదుగా రాయలసీమ ఎక్స్ప్రెస్ ఇప్పటికే నిజామాబాద్ వెళ్లింది. తిరుపతి నుంచి నిజామాబాద్ వైపు రాయలసీమ ఎక్స్ప్రెస్ రైలు వెళ్లడం గమనార్హం. మరమ్మతు పనులు 36 గంటల పాటు కొనసాగాయి. మొదట డెమో ట్రైన్తో రైల్వే అధికారులు ట్రాక్ చెక్ చేశారు. ఈ టెస్ట్ సక్సెస్ కావడంతో నిజామాబాద్, హైదరాబాద్ మధ్య రైళ్ల రాకపోకలు మళ్లీ మొదలయ్యాయి. 

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే రోజువారీ సర్వీసుల్లో పలు మార్పులు చేసిన సంగతి తెలిసిందే. కొన్ని రైళ్లను రద్దు, మరికొన్నింటిని పాక్షిక రద్దు, ఇంకొన్నింటిని రీషెడ్యూల్​ చేసినట్లు పేర్కొంది. భిక్నూర్–తలమడ్ల, అక్కన్నపేట మెదక్, గజ్వేల్ -లకుడారం, బోల్సా -కర్ఖేలి రైల్వేస్టేషన్ల మధ్య ఉన్న సెక్షన్లు వరదల కారణంగా నీట మునిగాయి. జోన్ మీదుగా నడపాల్సిన రైలు సర్వీసుల్లో పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేశారు. రైల్వే ఇన్​స్టాగ్రామ్ (@scrailwayindia), దక్షిణ మధ్య రైల్వే అధికారిక వెబ్‌‌‌‌సైట్ (https://scr.indianrailways.gov.in/),  సోషల్ మీడియా ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌ల ద్వారా రైళ్ల రద్దు, దారి మళ్లింపు, రీషెడ్యూల్​సమాచారం ఇచ్చారు.