
మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ల ఉద్యమం ఉధృతమవుతోంది.. మరాఠా రిజర్వేషన్ల సాధన కార్యకర్త మనోజ్ జరంగే పాటిల్ నేతృత్వంలో మరాఠా ఉద్యమం సాగుతోంది. శనివారం (ఆగస్టు30) మహారాష్ట్ర అధికార కేంద్రమైన మంత్రాలయను ఘెరావ్ చేయడమే లక్ష్యంగా నిరసనకారులు కదిలారు. కాషాయ కండువాలు ధరించిన నిరసనకారులు వివిధ మార్గాల నుంచి మంత్రాలయకు వచ్చారు. వారిని ఆపడానికి పోలీసులు ఏమీ చేయలేకపోయారు. హైకోర్టు ముందు సహా అనేక చోట్ల రాస్తారోకోలు, ధర్నాలతో ముంబై దద్దరిల్లింది.
నిరసనకారులు ముంబైలోని చారిత్రాత్మక ఆజాద్ మైదాన్ లో సమావేశమయ్యారు. ఈ ప్రాంతం మంత్రాలయ, విద్యా భవన్ వంటి ప్రభుత్వ అధికార కేంద్రాలకు దగ్గరగా ఉంటుంది.వేలాది మంది మరాఠా నిరసనకారులు కాషాయ కండువాలు, జెండాలతో ముంబైకి చేరుకున్నారు. దీనివల్ల నగరంలో రోడ్డు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. ముఖ్యంగా చత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (CSMT) ఇతర ప్రధాన రోడ్ల దగ్గర ట్రాఫిక్ జామ్ అయింది.
నిరసనకారులను అదుపులోకి తీసుకోవడానికి ముంబైలో భారీగా పోలీసులను మోహరించారు. నిరసనకారుల డిమాండ్లను పరిశీలించడానికి కేబినెట్ సబ్-కమిటీని కూడా ఏర్పాటు చేశారు. అయితే ఆందోళనకారులు మాత్రం ప్రభుత్వం నుంచి తమకు సరైన స్పందన లభించడం లేదని అంటున్నారు.
ALSO READ : తిరుమలలో గదులు దొరక్క ఇబ్బంది పడుతున్న భక్తులకు శుభవార్త
మరాఠా ఉద్యమానికి మద్దతుగా మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాలనుంచి పెద్ద ఎత్తున్న మరాఠాలు తరలివచ్చారు. దీంతో DN రోడ్డులోని అంజుమన్ ఐ ఇస్లాం పాఠశాల ముందు వాహనాలను నిలిపివేశారు మరియు వాహనదారులు తమ కార్లను వెనక్కి తిప్పి పంపిస్తున్నారు. నిరసనకారులను బస్సులను హైజాక్ చేస్తున్నారు. ప్రయాణికులను బలవంతంగా దించి మంత్రాలయకు తీసుకెళ్లాల్సిందిగా డ్రైవర్లను మరాఠా యువకులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ ఆందోళనతో సాధారణ ప్రజల జీవనం ప్రభావితమైంది. కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది, స్కూల్ బస్సులు ఆలస్యమయ్యాయి. వర్షం ,ప్రాథమిక సౌకర్యాలు లేకపోవడం వల్ల నిరసనకారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
మరాఠా రిజర్వేషన్ల కార్యకర్త మనోజ్ జరంగే పాటిల్ ఈ ఆందోళనకు నాయకత్వం వహిస్తున్నారు. ఆయన తన సొంత గ్రామం జాల్నా జిల్లాలోని అంతర్వాలి సారతి నుంచి ముంబైకి పాదయాత్రగా వచ్చి, ఆజాద్ మైదాన్‌లో నిరాహార దీక్ష ప్రారంభించారు.
జరంగే పాటిల్ ప్రధానంగా మరాఠాలకు కున్బీ (OBC) వర్గం కింద రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. కున్బీ అనేది ఇతర వెనుకబడిన తరగతుల జాబితాలో ఉన్న ఒక వ్యవసాయ వర్గం. ఈ గుర్తింపు ద్వారా మరాఠాలు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ ప్రయోజనాలు పొందుతారు.