
తిరుమల: ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్య క్షేత్రం తిరుమలలో నిర్మించిన యాత్రికుల వసతి సముదాయం-5 భవనాన్ని టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి శనివారం పరిశీలించారు. ఈ భవనంలోని హాళ్లు, కళ్యాణ కట్ట, మరుగుదొడ్లు, అన్న ప్రసాద వితరణ కేంద్రాలను పరిశీలించి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని సదుపాయాలు ఉండేలా చూడాలని ఆదేశించారు. ఇంజనీరింగ్ అధికారులు అద్భుతంగా ఈ సముదాయాన్ని నిర్మించారని టీటీడీ చైర్మన్ కొనియాడారు.
2018లో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ భవన నిర్మాణానికి బోర్డు ఆమోదం తెలిపిందని ఆయన గుర్తుచేశారు. ఈ భవన నిర్మాణం ద్వారా తిరుమలలో యాత్రికుల వసతి సమస్యకు కొంత మేర ఉపశమనం కలుగుతుందని చెప్పారు. ప్రస్తుతం తిరుమలలో 45 వేల మందికి మాత్రమే వసతి సౌకర్యాలు ఉన్నాయని, కొత్తగా నిర్మించిన పీఏసీ–5లో 2 వేల 500 మంది యాత్రికులు బస చేయడానికి వీలు ఉంటుందని తెలిపారు. భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
ALSO READ : తిరుమల కొండపై సెప్టెంబర్ నెలలో వేంకటేశ్వరస్వామి విశేష సేవలు, పూజలు, పర్వదినాలు ఇవే..!
వచ్చే బ్రహ్మోత్సవాల సమయంలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఈ సముదాయాన్ని ప్రారంభించి.. భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి మాట్లాడుతూ.. యాత్రికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కొత్త పీఏసీ భవనంలో అనేక మార్పులు చేశామని పేర్కొన్నారు. 2 వేల 500 మందికి వసతి సౌకర్యం కల్పించినప్పటికీ, అవసరమైతే మరో వెయ్యి మంది యాత్రికులను కూడా సర్దుబాటు చేసుకునే అవకాశం ఉందని వివరించారు.
చంటి పిల్లల తల్లుల కోసం ప్రత్యేకంగా మిల్క్ ఫీడింగ్ గది ఏర్పాటు చేశామని చెప్పారు. ఒకేసారి 14 వందల మంది అన్నప్రసాదాలు స్వీకరించే విధంగా విస్తృతమైన అన్నప్రసాదాల హాలును ఏర్పాటు చేశారు. ప్రథమ చికిత్స కేంద్రం, కళ్యాణకట్ట, అన్న ప్రసాద వితరణ కేంద్రం, తదితర అన్ని అవసరమైన సదుపాయాలను ఈ భవనంలో కల్పించామని చెప్పారు.