నడిరోడ్డుపై గట్కా విద్య ప్రయోగం.. అమెరికాలో సిక్కు వ్యక్తిని షూట్ చేసిన పోలీసులు.. వీడియో విడుదల

నడిరోడ్డుపై గట్కా విద్య ప్రయోగం.. అమెరికాలో సిక్కు వ్యక్తిని షూట్ చేసిన పోలీసులు.. వీడియో విడుదల

ఇండియాలో చేసినట్లుగా అమెరికాలో  ఏం చేసినా నడుస్తుందంటే కుదరదు. అక్కడ రూల్స్ అంటే రూల్సే. కట్టుబడి ఉండాల్సిందే. లేదంటే స్ట్రిక్ట్ యాక్షన్స్ ఉంటాయి. ఇటీవల అమెరికాలో ఒక సిక్కు వ్యక్తిని షూట్ చేసిన ఘటన సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో ఫూటేజ్ రిలీజ్ ను శుక్రవారం (ఆగస్టు 29) చేశారు యూఎస్ పోలీసులు. 

అమెరికా లాస్ ఏంజిల్స్ లో గట్కా ప్రయోగిస్తున్న సిక్కు వ్యక్తిని షూట్ చేశారు పోలీసులు. జులైలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన ఫూటేజ్ ఇప్పుడు రిలీజ్ చేశారు. ఈ ఘటన అప్పట్లో సంచలనంగా మారింది. షూటౌట్ కు సంబంధించిన వీడియోలను లాస్ ఏంజిల్స్ పోలీస్ డిపార్ట్మెంట్ (LAPD) విడుదల చేశారు. 

గురుప్రీత్ సింగ్ అనే 35 ఏళ్ల వ్యక్తి.. నడిరోడ్డుపై గట్కా ప్రదర్శిస్తూ భయభ్రాంతులకు గురిచేశాడు. లాస్ ఏంజిల్స్ లోని Crypto.com Arena ముందు రెండు వైపుల పదునున్న కత్తి లేదా కొడవలి లాంటి ఆయుధంతో గట్కా ప్రదర్శించాడు. పంజాబ్ కు చెందిన మార్షల్ ఆర్ట్స్ లో ఒకటైన ఈ విద్యను ప్రదర్శిస్తూ ట్రాఫిక్ కు అంతరాయం కలిగించాడు. అదే విధంగా జనాలను బెదిరించాడు. అడ్డుకోబోయిన పోలీసులపై దాడికి ప్రయత్నించాడు సింగ్. 

జులై 13న  జరిగింది ఈ ఘటన. ఒక షార్ట్, బనియన్, బ్లూరిబ్బన్ మాత్రమే ధరించి రోడ్డుపై నానా హంగామా చేశాడు. కళను ప్రదర్శిస్తూనే మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తిలా అందిరినీ బెదిరించాడు. సింగ్ ను ఆపాలని పోలీసులు ప్రయత్నించినా వినలేదు. ఆయుధం పడేయాలని చెప్పినా వినకుండా దగ్గరికెళ్లిన పోలీసులపై దాడికి ప్రయత్నించాడు. అంతేకాకుండా ఏకంగా తన నాలుక తానే కోసుకుని భయపెట్టాడు. 

పోలీసులు దగ్గరికి వెళ్లే సరికి కారులో ఎక్కి పారపోయే ప్రయత్నం చేశాడు. రోడ్డుపై ఇష్టం వచ్చినట్లు నడిపి చాలా వాహనాలకు ఢీకొట్టాడు. కారు అద్దంలో నుంచి కత్తిని చూపిస్తూ బెదిరిస్తూ డ్రైవ్ చేస్తూ కొంతసేపు అలజడి సృష్టించాడు. పోలీసులపై కత్తితో దాడిచేసే ప్రయత్నం చేయగా షూట్ చేసినట్లు LAPD పోలీసులు తెలిపారు. పోలీసులు అలా ఎలా కాలుస్తారని.. అదుపులోకి తీసుకుని కోర్టు ముందు హాజరు పరిచి శిక్ష వేయించాల్సింది గానీ.. చంపేయడమేంటని దీనిపై మానవహక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. 

గట్కా.. పంజాబ్ కు చెందిన ఒక విద్య. మార్షల్ ఆర్ట్స్ లో భాగం. కత్తి, కర్ర, డాలు, ఇతర ఆయుధాలతో చేసే యుద్ధ కళ ఇది. ఆత్మరక్షణతో పాటు శత్రువులను ఎదుర్కొనేందుకు వినియోగించే ప్రాచీన యుద్ధ విద్య.