ట్రంప్ చనిపోయాడంటూ ఎక్స్‌లో ట్రెండింగ్.. జేడీ వాన్స్ కామెంట్స్ తర్వాత..

ట్రంప్ చనిపోయాడంటూ ఎక్స్‌లో ట్రెండింగ్.. జేడీ వాన్స్ కామెంట్స్ తర్వాత..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చనిపోయాడంటూ ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ ఫారం ఎక్స్ వేదికగా ట్రెండ్ అవుతోంది. ఈ క్రమంలో “Trump Is Dead” అంటూ తెగ వైరల్ అవుతోంది. 79 ఏళ్ల ట్రంప్ ఆరోగ్యం గురించి కొన్ని గంటల కిందట అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కామెంట్స్ చేసిన తర్వాత ట్రెండ్ ఊపందుకుంది. అవసరమైతే ట్రంప్ ప్లేసులో తానే అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నానని వాన్స్ చేసిన ప్రకటన ట్రంప్ ఆరోగ్యంపై అనుమానాలు రేకెత్తించినట్లు తెలుస్తోంది. 

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వాన్స్ మాట్లాడుతూ తనకు ఉన్న 200 రోజుల అనుభవంతో అనుకోని ఆపత్కర పరిస్థితి వస్తే యూఎస్ ప్రెసిడెంట్ బాధ్యతలు చేపట్టడానికి సమర్థుడినంటూ కామెంట్స్ చేశారు. ట్రంప్ ఆరోగ్యంపై వస్తున్న ప్రచారాలకు చెక్ పెట్టేందుకు చేసిన కామెంట్స్ తర్వాత ట్రంప్ ప్రజల ముందు కనిపించకపోవటంతో కొత్త ట్రెండ్ ఊపందుకుంది. 

ALSO READ : ట్రంప్ టారిఫ్స్ చెల్లవ్..

ట్రంప్ పూర్తిగా ఆరోగ్యంతో ఉన్నారని, ఆయన అధ్యక్ష బాధ్యతలు సమర్థవంతంగా పూర్తి చేయగలరని వాన్స్ చెప్పిన సంగతి తెలిసిందే. చురుకుగా ఉండే ట్రంప్ అందరి కంటే ముందే పని స్టార్ చేసి చివరికి లేట్ నైట్ వరకు పనిచేస్తారని.. ట్రంప్ ఆరోగ్యంపై అనుమానాలు అక్కర్లేదని వాన్స్ చెప్పారు. అయితే దాదాపు 24 గంటల నుంచి ప్రజల ముందు ఎక్కడా కనిపించని ట్రంప్ మరో రెండు రోజుల పాటు కూడా అధికారికంగా ఎలాంటి కార్యక్రమాల్లో బయటకు రారని తెలియటంతో అసలు ట్రంప్ హెల్త్ ఎలా ఉంది.. ఆయన అనారోగ్యాన్ని బయటకు రాకుండా కవర్ చేస్తున్నారా అనే ఊహాగానాలు వ్యాప్తి చెందుతున్నాయి. 

జూలైలో ట్రంప్ అనారోగ్యం గురించి బయటకు వార్తలు పొక్కాయి. ఆ సమయంలో వైట్ హౌస్ నిజంగానే ట్రంప్ అనారోగ్యంతో ఉన్నారని.. దీర్ఘకాలిక సిరల లోపంతో బాధపడుతున్నారని ధృవీకరించింది. ఈ సిరల వ్యాధి కాళ్లలో వాపుకు కారణం అవుతుందని వైద్యులు చెబుతున్నారు. ఇదే క్రమంలో ఎన్నికలకు ముందు ప్రచారం సమయంలో పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో జరిగిన ప్రచార ర్యాలీలో హత్యాయత్నం సందర్భంగా ట్రంప్ కుడి చెవి పైభాగంలో కాల్పులు జరిగినప్పుడు తీసిన పాత ఫోటోను కొంతమంది సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తున్నారు. మరో యూజర్ ట్రంప్ చనిపోతే తన ట్వీట్ లైక్ చేసివారందరికీ 100 డాలర్లు బహుమతిగా ఇస్తానంటూ పోస్ట్ పెట్టాడు.