ట్రంప్ టారిఫ్స్ చెల్లవ్.. అమెరికా కోర్టు సంచలన తీర్పు..!

ట్రంప్ టారిఫ్స్ చెల్లవ్.. అమెరికా కోర్టు సంచలన తీర్పు..!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. యూఎస్ ఫెడరల్ అపీల్స్ కోర్ట్ ట్రంప్ ప్రపంచ దేశాలపై ప్రకటించిన టారిఫ్స్ చట్టబద్ధమైనవి కాదని సంచల తీర్పును శుక్రవారం ఇచ్చింది. దీంతో ప్రపంచ దేశాలపై ట్రంప్ ప్రకటించిన వాణిజ్య సుంకాలు చెల్లవని అయితే ప్రస్తుతం వాటిని అమలులో ఉంచుతూ దీనిపై సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు సమయం ఇస్తున్నట్లు అపీల్స్ కోర్ట్ వెల్లడించింది. 

వాస్తవానికి అమెరికా అధ్యక్షుడికి అత్యవసర సమయంలో ఉండే పరిమితులను అతిక్రమించి టారిఫ్స్ నిర్ణయాలు తీసుకున్నట్లు కోర్ట్ పేర్కొంది. న్యూయార్క్‌లోని ప్రత్యేక ఫెడరల్ ట్రేడ్ కోర్టు మే నిర్ణయాన్ని ఎక్కువగా సమర్థించింది. ఇప్పటికే ట్రంప్ తీసుకొచ్చిన టారిఫ్స్ ఆర్థిక మార్కెట్లను కుదిపేయటంతో పాటు వ్యాపార అనిశ్చితిని పెంచుతూ సంక్షోభం దిశగా అనేక దేశాలను నడిపిస్తోందనే భయాలు పెరిగాయి. 

ఏప్రిల్‌లో ట్రంప్ దాదాపు అన్ని అమెరికా వాణిజ్య భాగస్వాములపై ​​విధించిన సుంకాలతో పాటు చైనా, మెక్సికో, కెనడాపై అధ్యక్షుడు అంతకు ముందు విధించిన సుంకాలపై కోర్టు నిర్ణయం కేంద్రీకృతమై ఉంది. ట్రంప్ టారిఫ్స్ నుంచి ఉపశమనం పొందేందుకు యూకే, జపాన్, యూరోపియన్ యూనియన్ వంటి దేశాలు అమెరికాతో ఒప్పందాలు కుదుర్చుకున్నప్పటికీ ప్రస్తుతం కోర్టు తీర్పుతో వాటి భవిష్యత్తుపై కూడా అనుమానాలు పెరుగుతున్నాయి. 

ALSO READ : మీ కొనుగోళ్లే పిల్లల ప్రాణాలు తీస్తున్నయ్.. 

ట్రంప్ రష్యా నుంచి ఆయిల్ కొనటాన్ని సాకుగా చూపుతూ ఇండియాపై అత్యధికంగా 50 శాతం సుంకాలు ప్రకటించటం ఆందోళన కలిగించినప్పటికీ.. ఇండియా దీనిని ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రధాని మోడీ విదేశీ పర్యటనతో భారత ఎగుమతులను ప్రపంచ వ్యాప్తంగా 40 దేశాలకు పెంచే వ్యూహంతో అమెరికా దూకుడు చర్యలకు కళ్లెం వేయాలని భావిస్తున్నారు. అయితే తాజాగా కోర్టు తీర్పుపై ట్రంప్ తన ట్రూత్ ఖాతాలో పోస్ట్ చేస్తూ దేశం కోసం సుప్రీం కోర్టులో తన పోరాటం కొనసాగుతుందంటూ పోస్ట్ పెట్టారు. 

జూలై నాటికి సుంకాల నుంచి వచ్చిన టారిఫ్స్ ఆదాయం 159 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు వెల్లడైంది. అయితే సుప్రీం కోర్టులో కూడా ట్రంప్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలితే ఈ డబ్బును తిరిగి చెల్లించాల్సి ఉంటుందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.