
దేశంలో గుండె పోటుతో చనిపోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. వయసుతో సంబంధం లేకుండా.. పసి పిల్లల నుంచి పండు ముసలి వరకు గుండెపోటుకు బలైపోతున్నారు. ఏదో ఒక పనిచేస్తూ ఒక్కసారిగా కార్డియాక్ అరెస్ట్‌తో కుప్పకూలుతున్న ఘటనలు ఇటీవల నిత్యం ఎక్కడో ఒక చోట వెలుగు చూస్తున్నాయి.
వ్యాయామం చేస్తూ ఒకరు, డ్యాన్స్ చేస్తూ మరొకరు, సినిమా చూస్తూ ఇంకొకరు, కూర్చున్న వారు కూర్చున్నట్టే క్షణాల్లోనే ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి ఘటనే ఒకటి తమిళనాడులో జరిగింది. యువ వైద్యుడు ఆసుపత్రిలో పేషెంట్లను చూస్తూనే కార్డియాక్ అరెస్ట్‌తో కుప్పకూలి చనిపోయాడు. ఇక్కడ దిగ్భ్రాంతికరమైన విషయం ఏంటంటే.. చనిపోయిన వైద్యుడు గుండె వైద్య నిపుణుడే. గుండె సంబంధిత జబ్బులను చూసే వైద్యుడు.. చివరకు గుండెపోటుకే బలి కావడంతో కార్డియాక్ అరెస్ట్ గురించి మరోసారి చర్చ మొదలైంది.
తమిళనాడుకు చెందిన 39 ఏళ్ల గ్రాడ్లిన్ రాయ్ కార్డియాక్ సర్జన్ అంటే గుండె సంబంధిత జబ్బులు చూసే డాక్టర్. చెన్నైలోని సవీత మెడికల్ కాలేజీలో కన్సల్టెంట్ కార్డియాక్ సర్జన్‌గా పని చేస్తున్నాడు. రోజు మాదిరిగానే శుక్రవారం (ఆగస్ట్ 29) కూడా ఆసుపత్రికి వెళ్లిన రాయ్ పేషెంట్ల దగ్గరికి రౌండ్స్ వేస్తున్నారు. ఈ క్రమంలో పేషెంట్లను చూస్తూనే ఒక్కసారిగా కుప్పకూలాడు డాక్టర్ రాయ్.
వెంటనే అప్రమత్తమైన తోటి డాక్టర్లు.. డాక్టర్ రాయ్ కార్డియాక్ అరెస్ట్‌కు గురైనట్లు గుర్తించి అందుకు తగ్గ ట్రీట్మెంట్ ఇచ్చారు. సీపీఆర్, యాంజియోప్లాస్టీ, ఇంట్రా-అయోర్టిక్ బెలూన్ పంప్, ఎక్మో చికిత్స అందించారు. కానీ ఎడమ ధమని వంద శాతం బ్లాక్ కావడంతో రక్త ప్రసరణ జరగక డాక్టర్ రాయ్ మరణించాడు. కార్డియాలజీపై అవగాహన ఉండి.. అన్నిరకాల జాగ్రత్తలు తీసుకునే కార్డియాక్ సర్జన్ చివరకు గుండె పోటుతో మరణించడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
►ALSO READ | సాఫ్ట్ వేర్ జాబ్ వదిలేసి పానీపూరీ వ్యాపారం
డాక్టర్ గ్రాడ్లిన్ రాయ్ ఘటనపై హైదరాబాద్‌కు చెందిన న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ మాట్లాడుతూ.. డాక్టర్ రాయ్ సహచరులు ఆయనను కాపాడటానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేసిన ఫలితం దక్కలేదన్నారు. సీపీఆర్, యాంజియోప్లాస్టీ, ఇంట్రా-అయోర్టిక్ బెలూన్ పంప్, ఎక్మో చికిత్స అందించిన ఎడమ ధమని హోల్స్ పూర్తిగా బ్లాక్ కావడంతో డాక్టర్ రాయ్ మరణించాడని అన్నారు. ధమని 100 శాతం బ్లాక్ కావడం వల్ల సంభవించే కార్డియాక్ అరెస్ట్ నుంచి ఎవరూ తప్పించుకోలేరన్నారు.
ఎక్కువసేపు పని చేయడం వల్ల ఇలాంటి మరణాలు సంభవిస్తున్నాయని అంటున్నారు ప్రముఖ గుండె వైద్యు నిపుణులు. వైద్యులు రోజుకు 12-18 గంటలు పని చేస్తారని, కొన్నిసార్లు ఒకే షిఫ్ట్‌లో 24 గంటలకు పైగా పని చేయడం వల్ల ఒత్తిడికి గురై ఇలాంటి ఘటనలు జరుగుతాయంటున్నారు. అనారోగ్యకరమైన జీవనశైలి, క్రమరహిత భోజనం, శారీరక వ్యాయామం లేకపోవడం, ఆరోగ్య పరీక్షలను నిర్లక్ష్యం చేయడం వల్ల ఇలా జరుగుతుందన్నారు.