- 9 వికెట్ల తేడాతో ఓడిన ఒమన్
- చెలరేగిన మార్ష్, హెడ్, జంపా
పల్లెకెలె: టీ20 వరల్డ్ కప్‌లో గ్రూప్ దశలోనే ఇంటిముఖం పట్టిన ఆస్ట్రేలియా.. విజయంతో టోర్నీని ముగించింది. ఇంటా, బయటా తీవ్ర విమర్శపాలైన కంగారూలు.. శుక్రవారం జరిగిన గ్రూప్–బి ఆఖరి లీగ్ మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఒమన్‌పై గెలిచారు. టాస్ ఓడిన ఒమన్ 16.2 ఓవర్లలో 104 రన్స్‌కే ఆలౌటైంది. వసీమ్ అలీ (33 బాల్స్‌లో 4 ఫోర్లతో 32) టాప్ స్కోరర్. తర్వాత ఆస్ట్రేలియా 9.4 ఓవర్లలోనే 108/1 స్కోరు చేసింది.
మిచెల్ మార్ష్ (33 బాల్స్‌లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 64 నాటౌట్), ట్రావిస్ హెడ్ (19 బాల్స్‌లో 6 ఫోర్లతో 32) దంచికొట్టారు. తొలి ఓవర్‌లో మూడు ఫోర్లతో ఛేదన మొదలుపెట్టిన మార్ష్.. ఒమన్ బౌలింగ్‌ను ఉతికి ఆరేశాడు. రెండో ఓవర్‌లో మార్ష్ 6, హెడ్ 4 దంచారు. నాలుగో ఓవర్‌లో హెడ్ 4, 4, మార్ష్ 6 కొట్టగా తర్వాతి ఓవర్‌లో చెరో ఫోర్‌తో జోరు పెంచారు. ఆరో ఓవర్‌లో మార్ష్ 4, 6, 4, 4తో 18 రన్స్ రాబట్టాడు. ఈ క్రమంలో మార్ష్ 26 బాల్స్‌లో హాఫ్ సెంచరీ చేయగా, ఆసీస్ 73/0తో పవర్‌ప్లేను ముగించింది. తర్వాతి ఓవర్ 6, 4, 4 కొట్టిన హెడ్‌ను 8వ ఓవర్‌లో షకీల్ (1/29) ఔట్ చేశాడు. తొలి వికెట్‌కు 93 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. ఈ దశలో వచ్చిన జోష్ ఇంగ్లిస్ (12 నాటౌట్) రెండు ఫోర్లతో విజయాన్ని పూర్తి చేశాడు. జంపాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
బౌలర్లు అదుర్స్..
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఒమన్‌ను ఆసీస్ బౌలర్లు పూర్తిగా కట్టడి చేశారు. స్పిన్నర్లు ఆడమ్ జంపా (4/21), మ్యాక్స్‌వెల్ (2/13) అద్భుతమైన టర్నింగ్‌తో ఇన్నింగ్స్‌ను శాసిస్తే.. పేసర్ జేవియర్ బార్ట్‌లెట్ (2/27) అండగా నిలిచాడు. ఇన్నింగ్స్ తొలి బాల్‌కు అమీర్ కలీమ్ (0)ను ఔట్ చేసి బార్ట్‌లెట్ ఇచ్చిన ఆరంభాన్ని స్పిన్నర్లు కంటిన్యూ చేశారు. ఫోర్‌తో టచ్‌లోకి వచ్చిన కరణ్ సోనవాలె (12), జతిందర్ సింగ్ (17) ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ నాలుగో ఓవర్‌లో ఎలిస్ (1/14).. కరణ్‌ను, బార్ట్‌లెట్.. జతిందర్‌ను పెవిలియన్‌కు పంపారు. 39/3తో నిలిచిన ఒమన్ పవర్‌ప్లేలో 47/3 స్కోరు చేసింది. ఓ ఎండ్‌లో వసీమ్ నిలకడగా ఆడినా.. జంపా స్పిన్ ముందు మిగతా బ్యాటర్లు తేలిపోయారు.
6, 4తో కుదురుకున్న హమ్మద్ మీర్జా (16)తో పాటు మహ్మద్ నదీమ్ (2)ను జంపా తన వరుస (8, 10) ఓవర్లలో వెనక్కి పంపాడు. వినయ్ శుక్లా (9) ఫోర్‌తో ఒమన్ 73/5తో ఫస్ట్ టెన్‌ను ముగించింది. వసీమ్, శుక్లా సింగిల్స్‌తో స్ట్రయిక్ రొటేట్ చేశారు. కానీ 13వ ఓవర్‌లో స్టోయినిస్ (1/16) దెబ్బకు వినయ్ ఔటయ్యాడు. తర్వాత మ్యాక్స్‌వెల్ (2/13) డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. తన వరుస ఓవర్లలో జితెన్ రామానంది (1), వసీమ్ వికెట్లు పడగొట్టాడు. 17వ ఓవర్‌లో జంపా వరుస బాల్స్‌లో షకీల్ అహ్మద్ (3), షఫీక్ జాన్ (0)ను పెవిలియన్‌కు పంపడంతో ఒమన్ తక్కువ స్కోరుకే పరిమితమైంది.
సంక్షిప్త స్కోర్లు
ఒమన్: 16.2 ఓవర్లలో 104 ఆలౌట్ (వసీమ్ అలీ 32, జతిందర్ సింగ్ 17, జంపా 4/21, మ్యాక్స్‌వెల్ 2/13). ఆస్ట్రేలియా: 9.4 ఓవర్లలో 108/1 (మార్ష్ 64*, హెడ్ 32, షకీల్ 1/29).
