
సాధారణంగా దసరా పండుగ అంటే అగ్రహీరోల సినిమాలు థియేటర్లలో సందడి చేస్తాయి. బాక్సాఫీస్ వద్ద పోటాపోటీ వాతావరణం నెలకొంటుంది. అభిమానుల హంగామా తారాస్థాయికి చేరుకుంటుంది. కానీ ఈ సారి ఊహించని మలుపు తిరిగింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'ఓజీ' ఒక్కడే దసరా బరిలో నిలవబోతున్నాడు. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న 'అఖండ 2' వాయిదా పడగా, మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' కూడా రేసు నుంచి తప్పుకుంది. ఈ రెండు భారీ చిత్రాలు లేకపోవడంతో, పవన్ అభిమానులకు ఈ దసరా పండుగ ఓజీ పండుగగా మారింది. అభిమానులు ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
దసరా బరి నుంచి తప్పుకున్న బాలయ్య
నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న 'అఖండ 2: తాండవం' సినిమా విడుదల వాయిదా పడింది. 'అఖండ' విజయం తర్వాత ఈ కాంబోపై భారీ అంచనాలు నెలకొన్నప్పటికీ, సినిమా నాణ్యత విషయంలో రాజీ పడకుండా, మరింత అద్భుతంగా తీర్చిదిద్దేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. అలాగే, మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర చిత్రం కూడా సెప్టెంబర్ 25న విడుదల కావాల్సింది, కానీ అది కూడా వాయిదా పడింది. ఈ రెండు భారీ చిత్రాలు రేసు నుంచి తప్పుకోవడంతో, 'ఓజీ' (They Call Him OG) చిత్రానికి దసరా పండుగ సీజన్ మొత్తం అనుకూలంగా మారింది.
అడ్వాన్స్ బుకింగ్స్‌లో 'ఓజీ' రికార్డులు
పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఓజీ' బాక్సాఫీస్‌ను షేక్ చేయడం మొదలుపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 25న విడుదల కానున్న ఈ సినిమాకు, ఇంకా నెల రోజుల సమయం ఉన్నప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో అడ్వాన్స్ బుకింగ్‌లు మొదలయ్యాయి. ముఖ్యంగా అమెరికాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ( ఆగస్టు 27, 2025 ) నుంచే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాగా, కేవలం కొన్ని గంటల్లోనే అంచనాలకు మించిన స్పందన లభించింది. కేవలం 24 గంటల్లోనే 3,00,000 డాలర్లు దాటడం ద్వారా US ప్రీ-సేల్ రికార్డులను బద్దలు కొట్టింది. ఇప్పటి వరకు 9 వేలకు పైగా టిక్కెట్లు సెల్ అయినట్లు సమాచారం. ఈ ట్రెండ్ చూస్తుంటే, పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే అమెరికాలో 'ఓజీ' అత్యంత భారీ ఓపెనింగ్స్ సాధించడం ఖాయమని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
►ALSO READ | OTT Crime: ఎవ్వరూ ఊహించని ఓటీటీలోకి.. మొగలి రేకులు’ హీరో RKసాగర్ క్రైమ్ థ్రిల్లర్
'సాహో' వంటి బ్లాక్‌బస్టర్ అందించిన దర్శకుడు సుజీత్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. పవన్ కల్యాణ్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా పరిచయం కావడం సినిమాపై అంచనాలను మరింత పెంచింది. డి.వి.వి. దానయ్య నిర్మించిన ఈ చిత్రంలో శ్రియా రెడ్డి, హరీష్ ఉత్తమన్, అర్జున్ దాస్ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. థమన్ సంగీతం, రవి కె. చంద్రన్ సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రధాన బలం. ఇటీవల విడుదలైన 'హరిహర వీరమల్లు' కాస్త నిరాశపరిచినప్పటికీ, ఈసారి పవన్ 'ఓజీ'తో బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
వారానికో సినిమా.. సెప్టెంబర్లో వరుస విడుదల..
దసరా బరిలో 'ఓజీ' ఒక్కటే నిలబడినప్పటికీ, సెప్టెంబర్ నెలలో అభిమానులకు పండగే అని చెప్పాలి. వారానికి ఒకటి చొప్పున మొత్తం ఆరు సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి. సెప్టెంబర్ 5న అనుష్క నటించిన 'ఘాటి' తో పాటు శివ కార్తికేయన్, మురుగదాస్ కాంబినేషన్‌లోని 'మదరాసి' విడుదల కానున్నాయి. అనుష్క ఫ్యాన్ ఫాలోయింగ్ కారణంగా 'ఘాటి' మంచి వసూళ్లను రాబట్టవచ్చని అంచనాలు ఉన్నాయి. సెప్టెంబర్ 12నబెల్లంకొండ శ్రీనివాస్ నటించిన 'కిష్కింద పురి' మూవీ దుల్కర్ సల్మాన్ 'కాంత' విడుదల కానున్నాయి. ఇక తేజ సజ్జ నటించిన 'మిరాయ్' సెప్టెంబర్ 19కి ఫిక్స్ అయింది. ఈ నెలలో హైలైట్‌గా పవన్ కల్యాణ్ 'ఓజీ' సెప్టెంబర్ 25న థియేటర్లలోకి రానుంది. ఈ వరుస విడుదలలు సెప్టెంబర్ నెలలో సినీ ప్రియులకు పూర్తి వినోదాన్ని అందించనున్నాయి.