2029 లోగా కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తా: సీఎం రేవంత్

2029 లోగా  కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తా: సీఎం రేవంత్

2029 లోగా తెలంగాణలో కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేస్తామని సీఎం రేవంత్​ హామీ ఇచ్చారు. మహిళా సంఘాలకు పెట్రోల్​ బంకులు కేటాయిస్తే వారే నిర్వహించుకుంటున్నారని, 600 ఆర్టీసీ బస్సులు మహిళలకు కేటాయించామని చెప్పారు. శిల్పారామం దగ్గర మూడున్నర ఎకరాల్లో 100 స్టాల్స్​ ఏర్పాటు చేశామని..  మహిళలు ఆదానీ, అంబానీతో పోటీపడే విధంగా ఎదగాలన్నారు. ఒక ఆడబిడ్డ ఆర్థికంగా ఎదిగితే ఆ కుటుంబం, ఆ ప్రాంతం బాగుపడుతుందని తెలిపారు. 

‘‘మహిళా పొదుపు సంఘాలకు గత ఏడాది 21వేల కోట్లు ఇవ్వగా , ఈఏడాది ఇప్పటికే రూ.15వేల కోట్లు బ్యాంక్​ లింకేజీ పూర్తి అయింది. మా ప్రభుత్వం రుణమాఫీ, రైతు భరోసా, కనీస మద్దతు ధర, సన్నాలకు రూ.500 బోనస్​రూపంలో రైతులకు రూ.60 వేల కోట్లు ఖర్చు చేసింది. వరి వేస్తే ఉరే అన్న మాజీ సీఎం తన ఫామ్​హౌస్​లో మాత్రం సన్నాలు పండించిండు. సన్న వడ్లు పండించాలని చెప్తే నన్ను సన్నాసి అని విమర్శించిన్రు. పేద ప్రజలకు ప్రభుత్వం సన్న బియ్యం ఇవ్వడం చూసి వాళ్లే సన్నాసులయ్యారు” అని ఆయన అన్నారు. రెండు సీజన్లలో 2.80లక్షల టన్నుల సన్న బియ్యం పండించారని, ఇది దేశంలోనే రికార్డు అని తెలిపారు. ప్రతి నెలా 3.10 కోట్ల మందికి సన్న బియ్యం ఇస్తున్నామని, గృహజ్యోతి కింద 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఫ్రీ విద్యుత్​ అందజేస్తున్నామని ఆయన వివరించారు. 

రూ. 12,600 కోట్ల ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకాన్ని సోమవారం నాగర్​కర్నూల్​ జిల్లా అమ్రాబాద్​ మండలం మాచారం గ్రామంలో సీఎం రేవంత్​రెడ్డి ప్రారంభించారు. సౌర గిరి జల వికాసం పైలాన్​ను ఆవిష్కరించారు.  గిరిజన సంక్షేమశాఖ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్​ పరిశీలించారు. రిమోట్​ ద్వారా సోలార్​ మోటార్లు ఆన్ చేశారు. అనంతరం చెంచు మహిళా రైతులతో ముఖాముఖి మాట్లాడారు. అచ్చంపేట నియోజకవర్గ స్వయం సహాయక సంఘాలకు రూ.119 కోట్ల విలువైన చెక్కు అందజేశారు.  నల్లమల డిక్లరేషన్​ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్​రెడ్డి మాట్లాడారు.  ఒకప్పుడు నల్లమల బాగా వెనుకబడిన ప్రాంతమని, ఈ ప్రాంతానికి చెందిన తాను ప్రజల ఆశీస్సులతో ముఖ్యమంత్రినై, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నానని సీఎం రేవంత్​ అన్నారు.

 ‘‘ఇది బూర్గుల రామకృష్ణారావు, జయపాల్​రెడ్డి, మహేంద్రనాథ్ పుట్టిన ప్రాంతం. ఈ ప్రాంత బిడ్డను కావడం నాకు గర్వకారణం. పాలమూరు బిడ్డలు దేశంలోని అన్ని ప్రాంతాల్లో మట్టి పనికి వెళ్లారు. పాలమూరు బిడ్డల చెమట చుక్క చూడని ప్రాజెక్టులు లేవు. ఈ వేదిక ద్వారా నల్లమల డిక్లరేషన్ ప్రకటించడం సంతోషంగా ఉంది. ఈ ప్రాంత అభివృద్ధిలో ఎమ్మెల్యే వంశీకృష్ణతో పాటు నాకు కూడా బాధ్యత ఉంది. నల్లమల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ అమలు చేసి.. నిధులు విడుదల చేసి విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తం” అని తెలిపారు.