25,712 రేషన్ కార్డులకు అప్రూవల్​

 25,712 రేషన్ కార్డులకు అప్రూవల్​
  • పాత, కొత్త రేషన్ కార్డుల్లో కలిపి భారీగా చేర్పులు 
  • కొత్తగా 1.81 లక్షల మందికి అందనున్న సన్న బియ్యం 
  • ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న కొత్త కార్డుల జారీ ప్రక్రియ

కరీంనగర్, వెలుగు: ఉమ్మడి కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లావ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల జారీతోపాటు పాత కార్డుల్లో కుటుంబ సభ్యుల చేర్చే ప్రక్రియ కొనసాగుతోంది. ఎన్నో ఏళ్లుగా కొత్తగా పెండ్లయిన జంటలకు రేషన్ కార్డులు మంజూరు కాకపోవడం, కార్డులుండి కూడా పిల్లల పేర్లు చేర్చకపోవడంతో వారి పేరిట బియ్యం రాకపోవడంతోపాటు సంక్షేమ పథకాలకు నోచుకోని విషయం తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజాపాలన సభలతోపాటు మీ సేవా కేంద్రాల ద్వారా కొత్త రేషన్ కార్డుల కోసం, కుటుంబ సభ్యుల చేర్పు కోసం దరఖాస్తులు స్వీకరించింది. 

సమగ్ర కులగణన సర్వే సందర్భంగా కూడా రేషన్ కార్డుల్లేని కుటుంబాలను గుర్తించారు. ఈ దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన రెవెన్యూ సిబ్బంది అర్హులైన వారి దరఖాస్తులకు అప్రూవల్ ఇస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఈ నెల 17 వరకు 25,712 కొత్త రేషన్ కార్డులకు అప్రూవల్ ఇచ్చారు. కొత్త కార్డుల ద్వారా సుమారు 65 వేల మందికి, పాత కార్డుల్లో చేర్చిన సుమారు 1.16 లక్షల మందికి కలిపి మొత్తంగా 1.81 లక్షల మందికి లబ్ధి చేకూరుతోంది. ఎట్టకేలకు ప్రభుత్వం కొత్త కార్డుల మంజూరుతోపాటు కుటంబ సభ్యులను పాతకార్డుల్లో చేరస్తుండడంతో జనం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలవారీగా కార్డులు ఇలా.. 
    
కరీంనగర్ జిల్లాలో కొత్త కార్డుల జారీకి ముందు 2,76,897 రేషన్ కార్డులు ఉండగా 8,09,596 మంది లబ్ధిపొందేవారు. ప్రస్తుతం జిల్లాలో రేషన్ కార్డుల సంఖ్య 2,87,635కు చేరగా 8,73,906 మంది లబ్ధి పొందుతున్నారు. కొత్తగా 10,738 కార్డులు మంజూరు కాగా, కొత్త, పాతకార్డుల్లో కలిపి 64,310 మందిని చేర్చారు. 
    
జగిత్యాల జిల్లాలో ఏప్రిల్ వరకు 3,07‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,096 రేషన్ కార్డులు ఉండగా 8,98,262 మంది లబ్ధిదారులు ఉండేవారు. ప్రస్తుతం ఈ జిల్లాలో రేషన్ కార్డుల సంఖ్య 3,15,861కు చేరగా లబ్ధిదారుల సంఖ్య 9,48,121 మందికి చేరింది. కొత్తగా 8,765 కార్డులు మంజూరు కాగా, కొత్త, పాతకార్డుల్లో కలిపి 49,859 మందిని చేర్చారు. 
    
పెద్దపల్లి జిల్లాలో ఏప్రిల్ వరకు 2,19,711 రేషన్ కార్డులు ఉండగా 6,30,965 మంది లబ్ధిదారులు ఉండేవారు. ప్రస్తుతం ఈ జిల్లాలో రేషన్ కార్డుల సంఖ్య 2,23,247కు చేరగా లబ్ధిదారుల సంఖ్య 6,67,694 మందికి చేరింది. కొత్తగా 3,536 కార్డులకు అప్రూవల్ ఇచ్చి, కొత్త, పాతకార్డుల్లో కలిపి 36,729 మందిని చేర్చారు.  

రాజన్న సిరిసిల్ల గతంలో 1,73,577 రేషన్ కార్డులు ఉండగా 5,02,673 మంది లబ్ధిదారులు ఉండేవారు. ప్రస్తుతం ఈ జిల్లాలో రేషన్ కార్డుల సంఖ్య 1,76,250కు చేరగా లబ్ధిదారుల సంఖ్య 5,33,185 మందికి చేరింది. కొత్తగా 2,673 రేషన్ కార్డులు సాంక్షన్ కాగా, కొత్త, పాతకార్డుల్లో కలిపి 30,512 మందిని చేర్చారు.

పెళ్లయిన ఐదేళ్లకు కార్డు 

గత సర్కార్ హయాంలో ఐదేళ్ల కింద రేషన్ కార్డు కోసం అప్లై చేశాను. అయినా రేషన్ కార్డు రాలేదు.  కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరోసారి ప్రజాపాలన సభతోపాటు మీ సేవా కేంద్రంలో అప్లై చేశాం. దీంతో ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భార్య, ఇద్దరు పిల్లల పేర్లతో రేషన్ కార్డు మంజూరైంది. మేలో సన్న బియ్యం కూడా అలాట్ అయ్యాయి. ఇస్త్రీ షాపుతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాం.
రేషన్ కార్డు రావడంతో సంతోషంగా ఉంది. మునిగంటి కల్పన, రాంబాబు దంపతులు, బోర్నపల్లి, హుజూరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌