
Markets Crash: ఉదయం నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు ఆ తర్వాత తిరిగి పుంజుకుని ఫ్లాట్ ట్రేడింగ్ కొనసాగించిన సంగతి తెలిసిందే. అయితే మధ్యాహ్నం సమయం నాటికి మార్కెట్ సూచీలు భారీగా నష్టాలను మూటకట్టుకున్నాయి. అయితే ఒక్కసారిగా బుల్స్ ని భయానికి గురిచేసిన అంశాలు ఏంటనేది ఇన్వెస్టర్లు తెలుసుకోవాలి. ప్రధానంగా ఎఫ్ఎంసీజీ, ఆటో, ఫైనాన్షియల్ రంగాలు నష్టాలకు కారణంగా ఉన్నాయి.
* ఆసియా మార్కెట్లు నష్టాల్లో కొనసాగటం భారత ఈక్విటీ మార్కెట్లను ప్రభావితం చేస్తోంది. అమెరికా ఫ్యూచర్స్ మార్కెట్లలో అలజడి, ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపులో కోతలపై ఆందోళనలు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. ఈ క్రమంలో దక్షిణ కొరియా మార్కెట్లు కూడా నష్టాల్లో ఉన్నాయి.
* గడచిన కొన్ని ట్రేడింగ్ సెషన్ల నుంచి పెట్టుబడులు పెడుతున్న విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు తమ డబ్బును వెనక్కి తీసుకోవటం కూడా ఒక కారణంగా జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రతినిధి వికే విజయ్ కుమార్ అన్నారు. వారు రూ.523 కోట్ల విలువైన పెట్టుబడులను విక్రయించినట్లు తేలింది.
* మార్కెట్లను ప్రభావితం చేసిన మరో అంశం జపనీస్ బాండ్ మార్కెట్ల కుదేలు. 2000 సంవత్సరం తర్వాత తొలిసారి జపాన్ 20 ఏళ్ల బాండ్ ఈల్డ్ తారాస్థాయికి చేరినట్లు తేలింది. దీంతో జపనీస్ బాండ్ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి భారీగా పెరిగినట్లు అనలిస్టులు చెబుతున్నారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఇతర మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని వారు అంటున్నారు.
* గతవారం ట్రంప్ ఇండియా తమతో సున్నా సుంకాల వాణిజ్యానికి ఒప్పుకుందని ప్రకటించినప్పటికీ అది నిజం కాదని భారత వర్గాలు పేర్కొన్నాయి. దీంతో రెండు దేశాల మధ్య ద్రైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం భారత బృందం చేస్తున్న ప్రయత్నాలు ఆలస్యం కావటంపై మార్కెట్లు ప్రతికూలంగా స్పందిస్తున్నాయి. అయితే ఈ నెలాఖరు నాటికి దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ట్రంప్ కూడా తనకు తొందరేమీ లేదని కావాల్సినంత టైమ్ తీసుకోవాలని ఇండియాకు కామెంట్ చేసిన సంగతి తెలిసిందే.
* ప్రధాన వాణిజ్య దేశాలపై సుంకాల పెంపు ఉండొచ్చని యూఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బిస్సెంట్ చేసిన కామెంట్స్ ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో అలజడి సృష్టిస్తోంది. ఇది ఒక్కసారిగా ఈక్విటీ మార్కెట్లలో ఆందోళనలు పెంచేసింది.
* అమెరికాతో డీల్ ఫైనల్ కాకపోవటంతో రూపాయి విలువ కూడా పతనాన్ని చూస్తోంది. నేడు అమెరికా డాలరుతో రూపాయి మారకపు విలువ 13 పైసలు తగ్గి రూ.85.55కి దిగజారింది. ఇది వ్యాపారవర్గాల్లో ఆందోళనలు పెంచేస్తోంది.
* ఇక చివరిగా ప్రముఖ గ్లోబల్ రేటింగ్ సంస్థ మూడీస్ అమెరికా ప్రభుత్వ రుణాలపై రేటింగ్ తగ్గింపు ఆందోళనలు పెంచింది. దీర్ఘకాలంలో పరిస్థితులపై ఇది ఆందోళనలను ఎత్తిచూపింది. ఇది వెంటనే ప్రతికూల ప్రభావాన్ని కలిగి ఉండనప్పటికీ గ్లోబల్ సెంటిమెంట్లను దెబ్బతీస్తుందని నిపుణులు చెబుతున్నారు.
మధ్యాహ్నం 2.37 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీలను పరిశీలిస్తే.. సెన్సెక్స్ 785 పాయింట్లకు పైగా నష్టపోగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 238 పాయింట్లను కోల్పోయింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 523 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 822 పాయింట్లకు పైగా నష్టాలతో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి.