బీహార్ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ సారి అధికారం మాదే అనుకున్న మహాగట్బంధన్ ఘోర పరాజయం చవిచూడాల్సి వచ్చింది. దీంతో కూటమిలోని ముఖ్యమైన పార్టీ ఆర్జేడీలో లుకలుకలు బయటపడుతున్నాయి. లేటెస్టుగా పార్టీని వీడుతూ లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు రోహిణీ ఆచార్య తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. పార్టీతో పాటు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ఆమె 2025 నవంబర్ 15వ తేదీన ప్రకటించారు.
చాలా కాలంగా పార్టీ పరంగా రగులుతున్న అసంతృప్తి ఎన్నికల ఫలితాల తర్వాత బయటపడింది. పార్టీలో ఉండలేనని.. పార్టీ ఓటమికి కారణం అనుసరిస్తున్న విధానాలేనని పరోక్షంగా తన సోదరుడు, పార్టీ ప్రసిడెంట్ తేజస్వీ యాదవ్ కు చురకలంటించారు.
నేను రాకీయాల నుంచి తప్పుకుంటున్నాను.. కుటుంబంతో సంబంధాలు తెంచుకుంటున్నాను. సంజయ్ యాదవ్, రమీజ్ సలహా ప్రకారం పార్టీని వీడుతున్నాను. అన్ని నిందలను మోస్తూ బయటికి వెళ్తున్నాను.. అని ఆమె ఎక్స్ లో పోస్ట్ చేశారు.
రోహిణీ ప్రకటనతో ప్రకంపనలు:
నేను రాజకీయాలతో పాటు కుటుంబంతో సంబంధాలు తెంచుకుంటున్నాను అంటూ లూలూ కూతురు రోహినీ ఆచార్య చేసిన బహిరంగ ప్రకటన బీహార్ రాజకీయాల్లో.. ముఖ్యంగా ఆర్జేడీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొదటి నుంచి పార్టీ పరంగా, సోదరుడు తేజస్వీ యాదవ్ వ్యవహారంపై అసంతృప్తితో ఉన్న ఆమె.. ప్రత్యక్షంగా తేజస్వీ ని ఏమీ అనకుండానే చురకలంటించారు.
తేజస్వీ అనుచరులను టార్గెట్ చేసి ఆమె చేసిన ట్వీట్ పై చర్చ నడుస్తోంది. తేజస్వీ మొదటి నుంచి తమను పట్టించుకోలేదని.. తమ అభిప్రాయాలకు విలువివ్వలేదని ఆమె గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ఫలితాల తర్వాత ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు ఫ్యామిలీ ఉన్న లుకలుకలు స్పష్టంగా బయటపడుతున్నాయి.
I’m quitting politics and I’m disowning my family …
— Rohini Acharya (@RohiniAcharya2) November 15, 2025
This is what Sanjay Yadav and Rameez had asked me to do …nd I’m taking all the blame’s
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్(ఎన్డీయే) ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి ఏకంగా 202 సీట్లను గెలిచిన విషయం తెలిసిందే. మొత్తం 243 సీట్లున్న బిహార్ అసెంబ్లీకి నవంబర్ 6, 11న రెండు విడతల్లో పోలింగ్ జరగగా.. ఎన్డీఏ 202 సీట్లు గెలుచుకోగా మహాగట్బంధన్ 35 సీట్లకే పరిమితం కావాల్సి వచ్చింది. అందులో ఆర్జేడీ కేవలం 25 స్థానాల వద్దే ఆగిపోవాల్సి వచ్చింది. ఓట్ షేర్ పరంగా బీజేపీ, జేడీయూ పార్టీలను మించి సాధించినప్పటికీ.. సీట్ల విషయంలో ఘోరంగా విఫలమైంది. దీంతో ఆ పార్టీలో అంతర్గత విభేదాలు మెల్లమెల్లగా బయటపడుతున్నాయి.
