
టీమిండియా టెస్ట్ కెప్టెన్ ఎవరనే విషయంలో సస్పన్స్ కొనసాగుతోంది. ఇంగ్లాండ్ టూర్ లో భాగంగా జూన్ 20 నుంచి భారత్ 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కు త్వరలో స్క్వాడ్ ను ప్రకటించనున్నారు. రోహిత్ శర్మ అనూహ్యంగా టెస్ట్ ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించడంతో హిట్ మ్యాన్ స్థానంలో ఎవరిని కెప్టెన్ గా ఎంపిక చేయాలో సెలక్టర్లకు పెద్ద తలనొప్పిగా మారింది. వాస్తవానికి భారత జట్టుకు వైస్ కెప్టెన్ గా ఉంటున్న జస్ప్రీత్ బుమ్రాను కెప్టెన్ గా చేయాల్సింది. కానీ బుమ్రా ఫిట్ నెస్ సమస్యలు కారణంగా అన్ని టెస్ట్ మ్యాచ్ లకు అందుబాటులో ఉండడం లేదు.
ALSO READ | చెత్త రికార్డుకు చేరువలో పంత్.. ఆ రెండు ఇన్నింగ్స్ల తర్వాత జరిగేది అదే..!
బుమ్రా సైతం టెస్ట్ కెప్టెన్సీ ఆఫర్ ను తిరస్కరించినట్టు సమాచారం. ఫిట్‌నెస్ సమస్యల కారణంగా పూర్తి సిరీస్‌లకు అతను అందుబాటులో ఉండటం సందేహాస్పదం కావడమే ఇందుకు కారణం అవుతోంది. తనను ఫుల్ టైమ్ కెప్టెన్‌గా పరిగణించకపోవడానికి కూడా ఇదే అడ్డంకిగా మారుతోంది. హిట్‌మ్యాన్ వారసుడిగా శుభ్‌మన్ గిల్ టెస్టు ఫార్మాట్‌లో కొత్త కెప్టెన్‌గా.. వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్‌కు వైస్ కెప్టెన్సీ అప్పగించాలని నిన్నటివరకు వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచార ప్రకారం వీరిద్దరికి టెస్ట్ కెప్టెన్సీ అప్పగించడానికి సెలక్టర్లు సిద్ధంగా లేనట్టు వార్తలు వస్తున్నాయి.
ఇటీవలే గిల్, పంత్ తో సెలక్టర్లు అనధికారిక చర్చలు జరిపారు. గిల్ విదేశాల్లో రికార్డ్ దారుణంగా ఉంది. కేవలం 25 యావరేజ్ తోనే పరుగులు చేశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో గిల్ కనీసం ప్లేయింగ్ 11 లో చోటు దక్కించుకోలేకపోయాడు. దీంతో గిల్ పై సెలక్టర్లు అంతగా ఆసక్తి చూపనట్టు సమాచారం. ఇక రిషబ్ పంత్ ప్రస్తుతం పేలవ ఫామ్ లో ఉన్నాడు. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఫ్లాప్ షో చేయగా.. ప్రస్తుతం ఐపీఎల్ లో ఘోరంగా విఫలమవుతున్నాడు. దీంతో పంత్, గిల్ ను కాకుండా అనుభవజ్ఞుడు కేఎల్ రాహుల్ ను టీమిండియా టెస్ట్ కెప్టెన్ గా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
జూన్ 20 నుంచి ఇంగ్లాండ్, భారత్ జట్ల మధ్య 5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ జరుగుతుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ షిప్ 2025-27 సైకిల్ లో టీమిండియాకు ఇదే తొలి సిరీస్. ఈ సారి ఇండియా ఎక్కువగా యంగ్ ప్లేయర్లతోనే బరిలోకి దిగబోతుంది. ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ కు ముందు ఇంగ్లాండ్ లయన్స్ తో యంగ్ ఇండియా రెండు ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ల సిరీస్ ఆడుతుంది. హెడ్డింగ్లేలో జూన్ 20 న తొలి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. సిరీస్‌లోని మిగతా నాలుగు టెస్టులకు ఎడ్జ్‌బాస్టన్, లార్డ్స్, ఓల్డ్ ట్రాఫోర్డ్ ఓవల్ వేదికలు కానున్నాయి.