IPL 2025: పంత్ సేనకు దెబ్బ మీద దెబ్బ.. లక్నో స్టార్ స్పిన్నర్‎పై బీసీసీఐ సస్పెన్షన్ వేటు

IPL 2025: పంత్ సేనకు దెబ్బ మీద దెబ్బ.. లక్నో స్టార్ స్పిన్నర్‎పై బీసీసీఐ సస్పెన్షన్ వేటు

సన్ రైజర్స్ హైదరాబాద్‎పై ఓటమితో ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన లక్నో సూపర్ జైయింట్స్‎కు మరో బిగ్ షాక్ తగిలింది. లక్నో స్టార్ స్పిన్నర్ దిగ్వేష్ రతిపై బీసీసీఐ ఒక మ్యాచ్ నిషేధం విధించింది. అంతేకాకుండా మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించింది. సస్పెన్షన్ కారణంగా లక్నో, గుజరాత్ మ్యాచుకు దిగ్వేష్ దూరం కానున్నాడు. ఇప్పటికే ఫ్లే ఆఫ్స్ చేరుకోలేదన్న బాధలో ఉన్న పంత్ సేనకు ఆ జట్టులో కీలకమైన స్పిన్నర్‎పై సస్పెన్షన్ వేటు పడటం ఎదురు దెబ్బ అనే చెప్పవచ్చు. 

అసలేం జరిగిందంటే

ఐపీఎల్ 18లో భాగంగా సోమవారం (మే 19) లక్నోలోని ఎకానా స్టేడియంలో హైదరాబాద్, లక్నో జట్లు తలపడ్డాయి. ఈ క్రమంలో హైదరాబాద్ ఇన్సింగ్స్ సమయంలో ఓ వివాదం జరిగింది. 206 పరుగుల లక్ష్యంతో ఎస్ఆర్ హెచ్ బరిలోకి దిగగా.. హైదరాబాద్ బ్యాటర్ అభిషేక్ ఆకాశమే హద్దుగా చేలరేగాడు. లక్నో బౌలర్లను ఊచకోత కోస్తూ 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి ఫుల్ స్వింగ్‎లో ఉన్నాడు. మరింత దూకుడుగా ఆడే క్రమంలో దిగ్వేష్ రతిలో బౌలింగ్‎లో అభిషేక్ క్యాచ్ ఔట్ అయ్యాడు. అభిషేక్ ఔట్ అయ్యాక అతడిని రెచ్చగొట్టేలా తన ట్రేడ్ మార్క్ నోట్ బుక్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు దిగ్వేష్. 

దీంతో అభిషేక్, దిగ్వేష్ మధ్య వాగ్వాదం జరిగింది. ఇద్దరు ఒకరిపైకి మరొకరు దూసుకువచ్చారు. వెంటనే అంపైర్లు, ఇతర ఆటగాళ్లు కలగజేసుకుని ఇద్దరిని సముదాయించారు. మైదానంలో జరిగిన వాగ్వాదంలో ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు దిగ్వేష్ రతిపై ఐపీఎల్ నిర్వాహకులు చర్యలకు పూనుకున్నారు. ఐపీఎల్ కోడ్‌లోని లెవల్ 1 నేరం (ఆర్టికల్ 2.5) కింద మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానాతో పాటు దిగ్వేష్ ఖాతాలో రెండు డీమెరిట్ పాయింట్లు జోడించారు. 

ప్రస్తుత సీజన్‌లో దిగ్వేష్ రతికి ఇది మూడవ ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన. గతంలో రెండు సార్లు చేసిన తప్పులకు అతనికి మూడు మూడు డీమెరిట్ పాయింట్లు కేటాయించారు. సన్ రైజర్స్ మ్యాచులో మరో రెండు డీమెరిట్ పాయింట్లు రావడంతో.. అతడిపై ఒక మ్యాచ్ సస్పెన్షన్ వేటు పడింది. ఐపీఎల్ నియమం ప్రకారం ఒక ఆటగాడికి 4 డీమెరిట్ పాయింట్లు వస్తే.. ఒక మ్యాచ్ నిషేధం విధిస్తారు. 

ఈ రూల్‎లో భాగంగా దిగ్వేష్‎పై ఒక మ్యాచ్ వేటు పడింది. దీంతో గుజరాత్ టైటాన్స్ తో జరగనున్న నెక్ట్స్ మ్యాచ్ కు ఈ స్పిన్నర్ దూరం కానున్నాడు. అభిషేక్ శర్మకు కూడా మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా పడింది. అయితే.. దిగ్వేష్‎పై వేటు పడటంపై అభిమానులు భిన్నంగా రియాక్ట్ అవుతున్నారు. అతడికిపై వేటు కర్టెకేనని.. దిగ్వేష్ ఓవర్ యాక్షన్ మరీ ఎక్కువైందని కామెంట్లు చేస్తున్నారు.