
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 ఫైనల్ ప్లే ఆఫ్స్ వేదికలు ఖరారైనట్టు సమాచారం. ఇండియా, పాకిస్థాన్ ఉద్రిక్తల పరిస్థితుల నేపథ్యంలో ఐపీఎల్ 2025కు బ్రేక్ పడడంతో షెడ్యూల్ తో పాటు వేదికలు కూడా మార్చాల్సి వచ్చింది. ఐపీఎల్ రీ స్టార్ట్ తర్వాత లీగ్ లో మిగిలిన మ్యాచ్ లకు వేదికలు ప్రకటించిన బీసీసీఐ.. ప్లే ఆఫ్స్ ఎక్కడ జరుగుతాయనే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే వస్తున్న సమాచార ప్రకారం ఐపీఎల్ ప్లే ఆఫ్స్ కు బీసీసీఐ వేదికలను బీసీసీఐ ఫిక్స్ చేసిందట.
ఇందులో భాగంగా క్వాలిఫయర్ 1, ఎలిమినేటర్ మ్యాచ్ లు పంజాబ్ లోని ముల్లన్పూర్ లో జరుగుతాయి. క్వాలిఫయర్ 2,ఫైనల్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతాయి. క్వాలిఫయర్ 1, ఎలిమినేటర్ మ్యాచ్ లు వరుసగా మే 29, మే 30 న జరుగుతాయి. జూన్ 1 న క్వాలిఫయర్ 2, జూన్ 3 న ఫైనల్ మ్యాచ్ లు జరగనున్నాయి. ఈ వేదికలు పంజాబ్, గుజరాత్ జట్లకు అనుకూలంగా మారనుంది. ప్రస్తుత సీజన్ లో రెండు జట్లు ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించాయి. టైటిల్ గెలవటానికి సొంతగడ్డపై మ్యాచ్ లు ఆడనుండడం కలిసొచ్చే అంశం.
షెడ్యూల్ ప్రకారం ఐపీఎల్ 2025 ఫైనల్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరగాల్సి ఉంది. కోల్‌కతాలోని ప్రతికూల వాతావరణం కారణంగా ఐపీఎల్ ఫైనల్ ను షిఫ్ట్ చేయనున్నారు. మే నెలాఖరులో కోల్‌కతాలో భారీ వర్ష సూచన ఉంది. ఈ కారణంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం ఫైనల్‌కు ఆతిధ్యమివ్వబోతున్నట్టు సమాచారం. క్వాలిఫయర్ 1, ఎలిమినేటర్ మ్యాచ్ లు హైదరాబాద్ లో జరగాల్సి ఉండగా.. ముల్లన్పూర్ కు షిఫ్ట్ చేయనున్నారు. ఈ సీజన్ లో మరో వారం రోజుల పాటు లీగ్ మ్యాచ్ లు జరగనున్నాయి.