
ఐపీఎల్ 2025లో మరో మ్యాచ్ రద్దు కాకుండా బీసీసీఐ జాగ్రత్తలు తీసుకుంది. ఇందులో భాగంగా శుక్రవారం (మే 23) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ ను బీసీసీఐ బెంగళూరు నుంచి లక్నోకి మార్చింది. బెంగళూరులోని ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా వేదిక మార్చాల్సి వచ్చింది. "రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ బెంగళూరులో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్ స్టేడియంకు మార్చారు" అని బీసీసీఐ మంగళవారం తమ అధికారిక ప్రకటనలో తెలిపింది.
ALSO READ | IPL 2025: పంజాబ్, గుజరాత్‌కు బంపర్ ఛాన్స్.. ఐపీఎల్ ప్లే ఆఫ్స్ వేదికలు ఇవే!
బెంగళూరులో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ కారణంగా నగరంలోని వివిధ ప్రాంతాలు జలమయమయ్యాయి. భారత వాతావరణ శాఖ ప్రకారం.. బెంగళూరులో రాబోయే ఐదు రోజులు వర్షాలు కురుస్తాయని అంచనా వేయబడింది. ఐపీఎల్ రీ స్టార్ట్ లో భాగంగా జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్ కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. భారీ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడలేదు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ ఇచ్చారు. ఈ సీజన్ లో ఆర్సీబీ ఇప్పటికే ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించగా.. సన్ రైజర్స్ ప్లే ఆఫ్స్ నుంచి అధికారికంగా నిష్క్రమించింది.
ఈ మ్యాచ్ సన్ రైజర్స్ కు నామమాత్రం అయినప్పటికీ ఆర్సీబీ సీరియస్ గా తీసుకుంటుంది. టాప్ 2 లో వారు స్థానం సంపాదించాలంటే ఈ మ్యాచ్ లో విజయం చాలా కీలకం. ఈ మ్యాచ్ తో పాటు బీసీసీఐ ప్లే ఆఫ్స్ కు వేదికలు ఖరారు చేసింది. ఇందులో భాగంగా క్వాలిఫయర్ 1, ఎలిమినేటర్ మ్యాచ్ లు పంజాబ్ లోని ముల్లన్పూర్ లో జరుగుతాయి. క్వాలిఫయర్ 2,ఫైనల్ కు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతాయి. క్వాలిఫయర్ 1, ఎలిమినేటర్ మ్యాచ్ లు వరుసగా మే 29, మే 30 న జరుగుతాయి. జూన్ 1 న క్వాలిఫయర్ 2, జూన్ 3 న ఫైనల్ మ్యాచ్ లు జరగనున్నాయి.