
- స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు: సీఎం
- రేషన్ కార్డు పేదవాడి ఆత్మగౌరవం.. అందుకే కొత్త గా 5.6 లక్షల మందికి ఇస్తున్నం
- మరో 26 లక్షల మంది పేర్లను చేర్చినం.. 3 కోట్ల మందికి సన్నబియ్యం
- రెండేండ్లలో లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తం
- కూలిపోయే కాళేశ్వరం కట్టిన బీఆర్ఎస్ నేతలను ఉరితీసినా పాపం లేదు
- పదేండ్లు అధికారంలో ఉన్నపుడు ఎందుకు గోదావరి నీళ్లు తీసుకురాలేదని ఫైర్
- 2034 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని ధీమా
- సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం
సూర్యాపేట, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు ఇచ్చి బీసీలకు రాజ్యాధికారం కల్పిస్తామని సీఎం రేవంత్ తెలిపారు. దేశంలో ఎస్సీ వర్గీకరణ పూర్తి చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. రాష్ట్రంలో కులగణన పూర్తి చేసి వచ్చే జనగణనలో కులగణన చేసే విధంగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చామని, చివరకు తలొగ్గేలా చేశామని తెలిపారు. రేషన్ కార్డు పేదవాడి ఆత్మగౌరవం, గుర్తింపు అని, అది ఆకలి తీర్చే ఆయుధమని చెప్పారు. అందుకే కొత్తగా 5.6 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నామని తెలిపారు. సోమవారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రతి పేదవాడి కడుపు నింపాలన్న ఉద్దేశంతోనే రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షకుపైగా కొత్త రేషన్‌కార్డులతోపాటు 26 లక్షల మంది పేర్లను రేషన్ కార్డుల్లో చేర్చినట్టు చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా 3 కోట్ల 10 లక్షల మందికి సన్న బియ్యం ఇస్తున్నట్టు తెలిపారు. ‘‘పదేండ్లు అధికారంలో ఉన్నా పేదలకు రేషన్ కార్డు, సన్నబియ్యం ఇవ్వాలనే ఆలోచన బీఆర్ఎస్ నేతలకు రాలేదు. మా ప్రభుత్వం 3.10 కోట్ల మందికి సన్న బియ్యం ఇస్తే రేషన్ దుకాణాల వద్ద బారులు తీరుతున్నారు. వ్యవసాయం దండగ కాదు.. పండగ అని గిట్టుబాటు ధరతోపాటు బోనస్ ఇచ్చాం. దేశం తలెత్తుకునేలా వరి ధాన్యం ఉత్పత్తి చేస్తున్నాం” అని వివరించారు. పదేండ్లలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్‌షాపులను మూసి.. బెల్టు షాపులను తెరిచిందని ఎద్దేవా చేశారు. పదేండ్ల తర్వాత తమ ప్రభుత్వంలో రేషన్‌షాపులు తెరిస్తే.. సన్నబియ్యం కోసం కోట్లాది మంది లైన్లలో నిల్చొని బియ్యం తీసుకుంటున్నారని చెప్పారు. తమ ప్రభుత్వం సన్నబియ్యం, రేషన్ కార్డులు ఇస్తుంటే బీఆర్ఎస్నేతలు కండ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని మండిపడ్డారు. నల్గొండ చరిత్రే.. తెలంగాణ చరిత్ర అంటే అతిశయోక్తి కాదన్నారు. ఈ ఉమ్మడి జిల్లాలోని హుజూర్‌నగర్ నియోజకవర్గంలో సన్నబియ్యం పంపిణీ ప్రారంభించామని, ఇప్పుడు తుంగతుర్తిలో రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టామని చెప్పారు.
వ్యవసాయాన్ని పండుగ చేసినం..
వ్యవసాయం దండగ కాదు.. పండుగ చేయాలన్న లక్ష్యంతోనే రైతాంగానికి అండగా నిలవాలని రూ.21 వేల కోట్లతో 25 లక్షల 55 వేల 968 మందికి రూ. 2 లక్షల చొప్పున రుణమాఫీ చేశామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. పంటలకు కనీస మద్దతు ధరతోపాటు సన్నవడ్లు పండిస్తే రూ.500 బోనస్ చెల్లిస్తున్నామని చెప్పారు. ఈ సీజన్‌లో 9 రోజుల్లోనే రూ.9 వేల కోట్లతో 79 లక్షల మంది రైతులకు కోటి 49 లక్షల ఎకరాలకు రైతు భరోసా ఇచ్చి.. అన్నదాతల కండ్లల్లో ఆనందం చూశామని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే 285 లక్షల టన్నుల వడ్లు పండించి దేశంలోనే తెలంగాణ అగ్రగామికి నిలిచిందని చెప్పారు. రైతులు సంతోషంగా ఉన్నప్పుడే ఇందిరమ్మ ఆత్మ సంతోషిస్తుందని, సోనియమ్మ కల నెరవేరుతుందని అన్నారు.
పదేండ్లలో గోదావరి నీళ్లు ఎందుకు తేలే?
అధికారంలో ఉన్నప్పుడు పదేండ్లలో ప్రతిపక్ష పార్టీ నేతలు గోదావరి నీళ్లు ఎందుకు తేలేదని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.‘‘ఈ రోజు ఒకాయన సీఎం ఎట్ల వస్తడో అడ్డుకుంటా.. గోదావరి నీళ్లు తేలేదని అంటున్నడు. ఆయన ఉన్నది మూడు అడుగులు. ఆరు అడుగుల ఎత్తు ఎగురుతున్నడు. మూడు అడుగులాయనను నేనొక మాట అడుగుతున్నా.. 3 రోజుల టైం ఇస్తే గోదావరి జలాలు తుంగతుర్తికి తెస్తా అనే ప్రకటన పేపర్లో చూసిన. 3 రోజులు కాదు.. పదేండ్లు అవకాశం ఇస్తే ఎందుకు గోదావరి నీళ్లు తుంగతుర్తికి తీసుకురాలేదో? గోదావరి జలాలతో పంటలను ఎందుకు తడపలేదో? చెప్పాలని అడుగుతున్నా. గ్లాసులో సోడా పోసినట్టు కాదు తుంగతుర్తికి గోదావరి నీళ్లు తేవడం అంటే.. నీ ఊరును మండలం చేసుకున్నవ్.. మండలాఫీసు తెచ్చుకున్నవా? పోలీస్‌స్టేషన్ తెచ్చుకున్నవా? మీ నాయకుడు పదేండ్లు సీఎంగా ఉండి కూడా తెచ్చుకోలేని సన్నాసివి.. ఇయ్యాల మందుల సామేలు తీసుకొస్తే సిగ్గుతో తలవంచుకోవాల్సింది పోయి సీఎంను అడ్డుకుంటానని ప్రగల్బాలు పలుకుతున్నవా? ఆ పక్కన దామోదర్ రెడ్డి ఉన్నడు. దామన్న ఒక్కడ చాలు.. మీ కథాకమామిషు ఏందో చూస్తడు” అని బీఆర్ఎస్ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిపై ఫైర్ అయ్యారు.
కాళేశ్వరం కూలేశ్వరం అయింది
పదేండ్లు అధికారంలో ఉంటే రూ.20 లక్షల కోట్లు కేసీఆర్ చేతికి వచ్చాయని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. “కాళేశ్వరం ప్రాజెక్టుకు కట్టడం.. కూలడం.. మూడేండ్లలోనే పూర్తయింది. 60 ఏండ్లలో కాంగ్రెస్ కట్టిన నాగార్జునసాగర్, శ్రీశైలం, ఎస్సారెస్పీ, జూరాలలాంటి ప్రాజెక్టులు ఎలా ఉన్నాయి? కాళేశ్వరం ఎలా ఉందో చర్చకు సిద్ధమా? ప్రాజెక్టుల గురించి నాగార్జున సాగర్ కట్టపై కూర్చొని చర్చిద్దామా? మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం వద్ద చర్చిద్దామా?” అని బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు. నాడు గంజికి గతిలేని వారు తెలంగాణ ప్రజల ధనాన్ని దోచుకొని నేడు బెంజ్ కార్లలో తిరుగుతున్నారని, అన్ని డబ్బులు వారికి ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. కూలిన కాళేశ్వరం వద్ద మిమ్మల్ని ఉరితీసినా తప్పులేదని బీఆర్ఎస్నేతలనుద్దేశించి వ్యాఖ్యానించారు. దేశ తొలి ప్రధాని నెహ్రూ కట్టిన ప్రాజెక్టులే ఇయ్యాల తెలంగాణ ప్రాంతానికి నీళ్లు అందిస్తున్నాయని తెలిపారు.
మహిళలను కోటీశ్వరులను చేసినం..
బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఆడబిడ్డలను తలుపుతట్టి బాగున్నరా? అని అడిగిన పరిస్థితే లేదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కానీ.. ఇందిరమ్మ రాజ్యంలో స్వయం సహాయక సంఘాలకు బ్యాంకుల్లో అప్పులు ఇప్పించి ఆర్థికంగా నిలబెట్టినట్టు చెప్పారు. రూ. 21వేల కోట్ల జీరో వడ్డీ రుణాలు అందజేశామని తెలిపారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని, ఇందుకోసం 18 నెలల్లో రూ.6,500 కోట్లు ఖర్చు పెట్టామని వెల్లడించారు. మహిళా సంఘాలకు 600 బస్సులు కొనిచ్చి.. వారిని యజమానులను చేశామని తెలిపారు. రాష్ట్రంలోని 67 లక్షల స్వయం సహాయక సంఘాల ఆడబిడ్డలకు పండుగపూట ఒక్కొక్కరికీ రెండు చీరల చొప్పున ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. మహిళా సంఘాల సభ్యులకు విద్యుత్ సోలార్ప్లాంట్లను ఇస్తున్నామని, ప్రభుత్వ స్థలాలు ఇచ్చి పెట్రోల్‌బంక్‌లు నడిపించే బాధ్యతను అప్పగిస్తున్నామని చెప్పారు. గవర్నమెంట్ స్కూళ్లలో మహిళలతోనే అమ్మ ఆదర్శ కమిటీలు ఏర్పాటు చేశామని, పాఠశాల నిర్వహణ, కూరగాయలు కొనుగోలు చేసే కాంట్రాక్టు, పిల్లలకు యూనిఫాం కుట్టుపని అవకాశం కల్పించినట్టు చెప్పారు.
లక్ష ఉద్యోగాలిస్తం..
తమ మహబూబ్‌నగర్ జిల్లాలో ఏ ఉద్యోగిని అడిగినా..తమది నల్గొండ జిల్లా అనే చెబుతారని, ఎస్ఐలు, కాని స్టేబుళ్లకు నల్గొండ జిల్లా కేంద్రం అని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. కానీ.. గత పదేండ్లలో బీఆర్ఎస్ ఉద్యోగాలు ఇవ్వలేదని మండిపడ్డారు. దిల్‌సుఖ్ నగర్, అమీర్ పేట, అశోక్ నగర్ చౌరస్తాల్లోని కోచింగ్ సెంటర్లకు నిరుద్యోగులు కోట్లు ఖర్చు పెట్టారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఏడాది లోపల 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలకు నియామక ప్రతాలు అందించి దేశంలోనే రికార్డు సృష్టించిందని చెప్పారు. ‘‘తిరుమలగిరి వేదిక మీద నుంచి చెప్తున్నా.. రెండున్నరేండ్లలో లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తం. లక్ష మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కల్పించి వాళ్ల కుటుంబాలు ఆత్మగౌరవంతో బతికేలా చర్యలు చేపడ్తం” అని తెలిపారు. ‘‘నల్గొండ జిల్లాలోని తులసివనంలో గంజాయి మొక్క మొలిచింది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూకటివేళ్లతో గంజాయి మొక్కను తొలగించాలి’’ అని పిలుపునిచ్చారు.
తుంగతుర్తి.. పోరాటాల గడ్డ
తుంగతుర్తి గడ్డకు గొప్ప చరిత్ర ఉందని, ఇది పోరాటాల గడ్డ అని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఇలాంటి గడ్డమీద నుంచి కొత్త రేషన్‌కార్డుల పంపిణీని ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులకు సీఎం రేవంత్ రెడ్డి రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్ గౌడ్, లోక్ సభ సభ్యులు, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
మరో పదేండ్లు అధికారంలో ఉంటం..
ఉమ్మడి ఏపీలో 2004-2014 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉంటే.. తెలంగాణలో 2014-2023 వరకు బీఆర్ఎస్ అధికారంలో ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇప్పుడు 2023 లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, మరో పదేండ్లు అంటే 2034 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఏ ఎన్నికలు వచ్చినా తెలంగాణ గడ్డపైన కాంగ్రెస్ జెండానే ఎగురుతుందని తెలిపారు. భవిష్యత్తులో తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు.
రేషన్ కార్డుల జారీలో దేశానికే తెలంగాణ రోల్ మోడల్: ఉత్తమ్
పేదలకు తెల్ల రేషన్ కార్డుల మంజూరులో దేశానికే తెలంగాణ రోల్‌మోడల్‌గా నిలిచిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. 5.61 లక్షల వైట్ రేషన్ కార్డులు మంజూరు చేసి రాష్ట్ర జనాభాలో 80 శాతం నిరుపేదలకు ఫ్రీగా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడారు. ‘‘అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు అందజేస్తాం. కొత్త తెల్ల రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. ఎన్నికల టైమ్‌లో ఇచ్చిన హామీ మేరకు రేషన్ కార్డులు జారీ చేస్తున్నాం. పదేండ్లు అధికారంలో ఉన్న గత బీఆర్ఎస్ సర్కార్.. ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. రాష్ట్రంలో రేషన్ కార్డుల లబ్ధిదారుల సంఖ్య 3.09 కోట్లకు చేరుకున్నది. మేము అధికారంలోకి వచ్చేటప్పటికే సివిల్ సప్లైస్ శాఖ పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయింది. ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాం. దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యం ఇస్తున్నం. నిరపేదల కడుపు నింపుతున్నం. కాళేశ్వరం నిరుపయోగంగా ఉన్నప్పటికీ రికార్డు స్థాయిలో ధాన్యం పండించాం’’అని ఉత్తమ్ అన్నారు.