కేటీఆర్ స్క్రిప్ట్ ప్రకారం కిషన్‌‌రెడ్డి నడుస్తున్నరు..హైదరాబాద్ మెట్రోపై కిషన్ రెడ్డి కుట్ర

కేటీఆర్ స్క్రిప్ట్ ప్రకారం కిషన్‌‌రెడ్డి  నడుస్తున్నరు..హైదరాబాద్ మెట్రోపై కిషన్ రెడ్డి కుట్ర
  • మేం లోన్ తెచ్చుకుంటే ఢిల్లీ వెళ్లి అడ్డుకున్నరు: సీఎం రేవంత్‌‌రెడ్డి
  • జపాన్ సంస్థ నుంచి వచ్చిన 13,600 కోట్లు ఐఆర్ఎఫ్‌‌సీ నుంచి బదిలీ కాకుండా అడ్డుపుల్ల 
  • వెంటనే ఆ మొత్తం రిలీజ్​ చేయించాలి 
  • కేటీఆర్ స్క్రిప్ట్ ప్రకారం​.. కిషన్‌‌రెడ్డి  నడుస్తున్నరు 
  • ఫేజ్–2 కు కేంద్రం 50 శాతం నిధులిస్తుందో లేదో చెప్పాలి 
  • లేదంటే ఎన్వోసీ  ఇచ్చి తప్పుకోవాలి.. 100 శాతం రాష్ట్ర ఈక్విటీతో మెట్రో విస్తరణ పూర్తి చేస్తం
  • అహ్మదాబాద్, యూపీ, విశాఖకు మెట్రో ఇచ్చి తెలంగాణకు ఎందుకు  ఇవ్వరో చెప్పాలని డిమాండ్
  • రాజీనామాకు నేను రెడీ.. మరి మోదీ సిద్ధమా? అని సవాల్‌‌

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ మహానగరానికి అత్యంత ప్రతిష్టాత్మకమైన మెట్రో  ఫేజ్-2 విస్తరణను అడ్డుకోవడానికి కేంద్రమంత్రి  కిషన్ రెడ్డి, బీఆర్‌‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుట్రపన్నారని సీఎం రేవంత్‌‌రెడ్డి ఆరోపించారు. నష్టాల ఊబిలో కూరుకుపోయిన ఎల్ అండ్ టీ మెట్రోను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియలో భాగంగా కుదుర్చుకున్న రూ.13,600 కోట్ల ఐఆర్‌‌ఎఫ్‌‌సీ  నిధులను ఢిల్లీ స్థాయిలో కిషన్ రెడ్డి ఒత్తిడి తెచ్చి నిలిపివేశారని మండిపడ్డారు.  ఒకవేళ మెట్రో ఫేజ్-–2కు కేంద్రం 50 శాతం వాటా ఇవ్వడం ఇష్టం లేకపోతే తమకు  వెంటనే  నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) ఇవ్వాలన్నారు. 100 శాతం రాష్ట్ర ప్రభుత్వ ఈక్విటీ రూ.40 వేల కోట్లతో తామే మెట్రో విస్తరణను పూర్తి చేస్తామని పేర్కొన్నారు.  సోమవారం సెక్రటేరియెట్‌‌లో మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్ తదితరులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో  సీఎం రేవంత్‌‌రెడ్డి మాట్లాడారు.

మెట్రో మొదటి దశ స్వాధీనం, నిధుల సమీకరణలో కేంద్రం చూపిస్తున్న వివక్షను ఎండగట్టారు.  దేశంలోని ఇతర రాష్ట్రాల్లో మెట్రో రైలు ప్రాజెక్టులకు కేంద్రం శరవేగంగా అనుమతులు, నిధులు మంజూరు చేస్తోందని చెప్పారు. యూపీ మెట్రోకు, గుజరాత్‌‌లోని అహ్మదాబాద్ మెట్రో ఫేజ్-–2కు కేంద్రం నిధులు కేటాయించిందని, చివరకు పొరుగు రాష్ట్రమైన ఏపీలోని విశాఖపట్నం మెట్రోకు కూడా అనుమతులు మంజూరు చేసిందని తెలిపారు.  దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అపారమైన గుర్తింపు పొంది, శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశ్వనగరం హైదరాబాద్ మెట్రో విస్తరణకు వచ్చేసరికి కేంద్రం ఎందుకు మొండిచేయి చూపుతోందని ప్రశ్నించారు. ఈ వివక్ష ఏ స్థాయిలో కొనసాగుతుందో నగర ప్రజలు గమనించాలని కోరారు.

జపాన్ నిధులు సిద్ధంగా ఉన్నా..  

ఎల్ అండ్ టీ బ్యాంకుల నుంచి 8.25 శాతం వడ్డీతో తెచ్చిన ఈ అప్పును, తక్కువ వడ్డీతో రీఫైనాన్సింగ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఐఆర్‌‌ఎఫ్‌‌సీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని సీఎం రేవంత్‌‌రెడ్డి తెలిపారు. జపాన్ ఆర్థిక సంస్థ ద్వారా కేవలం 4 శాతం వడ్డీకే ఈ రూ.13,600 కోట్ల నిధులు మంజూరయ్యాయని, ఆ నిధులు ఇప్పటికే ఐఆర్‌‌ఎఫ్‌‌సీ ఖాతాలో జమయ్యాయని గుర్తుచేశారు. జూన్ 1 నాటికే ఒప్పందం ప్రకారం ఈ నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ కావాల్సి ఉన్నా, కిషన్ రెడ్డి రాజకీయ కుట్రలతో వాటిని అడ్డుకున్నారని ఆరోపించారు.

మే 20న నాటి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌‌ను, మే 21న రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌‌ను కిషన్ రెడ్డి కలిసి.. ‘‘రేవంత్ రెడ్డికి ఇంత సులువుగా పనులు జరిగితే తెలంగాణలో బీజేపీ మనుగడ కష్టమవుతుంది’’ అని నిధులు విడుదల చేయకుండా కొర్రీలు పెట్టించారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వడమే కాకుండా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  కౌంటర్ గ్యారంటీ కూడా సమర్పించినా ఎందుకు నిధులు విడుదల చేయడం లేదని నిలదీశారు. సోమవారం సాయంత్రం 5 గంటల వరకు ఐఆర్‌‌ఎఫ్‌‌సీ నిధుల విడుదలకు చివరి గడువు ఉందని, కిషన్‌‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఈ నిధులు విడుదల చేయించాలని సవాల్ విసిరారు.

కిషన్ రెడ్డికి అంత తెలివి లేదు..  

‘‘నేను కిషన్ రెడ్డిపై నేరుగా ఆరోపణ చేస్తున్నా.. ఈ కుట్ర వెనుక బీఆర్‌‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నాడు’’ అని రేవంత్‌‌రెడ్డి వ్యాఖ్యానించారు. కిషన్ రెడ్డికి అంత తెలివి లేదని, కేటీఆర్ రాసిచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే ఆయన నడుస్తున్నారని అన్నారు. ‘‘లోక్‌‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలవడానికి కేసీఆర్ లోపాయికారీగా సహకరించినందుకు, కిషన్ రెడ్డి ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్‌‌‌‌కు గురుదక్షిణ చెల్లిస్తున్నారు’’ అని ఆరోపించారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వానికి ఎలాంటి బ్యాంకు గ్యారంటీలు లేకపోయినా పీఎఫ్‌‌సీ, ఆర్‌‌ఈసీల ద్వారా రూ.3.15 లక్షల కోట్ల అప్పులను 9.5% నుంచి 11.5% అత్యధిక వడ్డీలకు ఇప్పించిన కేంద్రం.. తాము కేవలం 4 శాతం తక్కువ వడ్డీతో ప్రజా రవాణా కోసం తెస్తున్న నిధులను ఎందుకు తొక్కిపెడుతోందని మండిపడ్డారు.

మాకు ఎన్వోసీ ఇవ్వండి.. శాలువాతో సన్మానిస్తం

మెట్రో రెండో దశ విస్తరణ 122 కిలోమీటర్ల మేర చేపట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్‌‌రెడ్డి ప్రకటించారు. ‘‘ఒకవేళ మెట్రో ఫేజ్-–2కు కేంద్రం 50 శాతం వాటా ఇవ్వడం ఇష్టం లేకపోతే మాకు అభ్యంతరం లేదు. వెంటనే మాకు నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) ఇవ్వండి. వంద శాతం రాష్ట్ర ప్రభుత్వ ఈక్విటీ రూ.40వేల కోట్లతో మేమే మెట్రో విస్తరణను పూర్తి చేస్తాం’’ అని  స్పష్టం చేశారు. కిషన్ రెడ్డికి నిజంగా నగర అభివృద్ధిపై ప్రేమ ఉంటే, సెక్రటేరియెట్‌‌కు రావాలని కోరారు. ‘‘మా మెట్రో అధికారులు ఒప్పంద పత్రాలతో సిద్ధంగా ఉన్నారు. కిషన్‌‌రెడ్డి  , అటు బీజేపీ ఎంపీలు బండి సంజయ్, ఈటల రాజేందర్, రఘునందన్ రావును కూడా వెంట తీసుకురండి. సెక్రటేరియెట్‌‌లోనే పవర్‌‌పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాం. కిషన్‌‌రెడ్డి  చొరవ తీసుకుని కేంద్రం నుంచి నిధులు కానీ లేదా ఎన్‌‌వోసీ కానీ ఇప్పించగలిగితే.. మిమ్మల్ని సెక్రటేరియెట్‌‌కు ఆహ్వానించి, శాలువా కప్పి ఘనంగా సన్మానం చేస్తం” అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తాను ఎవరి దగ్గరికైనా వెళ్తానని, తనకేలాంటి బేషజాలు లేవని సీఎం స్పష్టం చేశారు.

కేంద్ర కేబినెట్‌‌లో తెలంగాణ కోటాలో ఉన్న ఏకైక పూర్తిస్థాయి మంత్రి కిషన్ రెడ్డి మాత్రమేనని, సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్‌‌కు కేబినెట్ సమావేశాల్లో భాగస్వామ్యం ఉండదని తెలిపారు. అందుకే రాష్ట్ర హక్కుల కోసం  తాను కిషన్ రెడ్డినే అడుగుతున్నానని, ఆయనతో కలిసి ఢిల్లీ వెళ్లడానికైనా సిద్ధమన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఇన్‌‌చార్జి మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి కిషన్‌‌రెడ్డి ఇంటికైనా వెళ్తానని.. ఈ విషయంలో మీడియా ప్రతినిధులే చొరవ తీసుకుని అపాయింట్‌‌మెంట్ ఖరారు చేయాలని కోరారు. రెండు కంపెనీల మధ్య జరిగిన అధికారిక, వ్యాపార పత్రాలు తన వద్ద వంద శాతం ‘బ్లాక్ అండ్ వైట్’ లో ఉన్నాయని, అనైతికం కాబట్టే వాటిని పబ్లిక్ డొమైన్‌‌లో పెట్టడం లేదని, ఆ పత్రాలన్నింటినీ కిషన్‌‌రెడ్డికి అందజేస్తానని సీఎం వెల్లడించారు.

కేంద్ర సర్కార్ ‘ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్’.. 

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సొంతంగా స్పష్టమైన మెజారిటీ లేక ఇతర పార్టీలపై ఆధారపడి నడుస్తున్న ఒక ‘ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్’  ప్రభుత్వమని సీఎం రేవంత్‌‌రెడ్డి విమర్శించారు. తమకు మాత్రం రాష్ట్రంలో పూర్తి మెజారిటీ కంఫర్ట్‌‌గా ఉందన్నారు.

ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు, నల్లధనం వెలికితీసి ప్రతి పేదవాడి ఖాతాలో రూ.15 లక్షలు వేయడం, రైతుల ఆదాయం రెట్టింపు చేయడంలాంటి 2014, 2019, 2024 మేనిఫెస్టోల హామీల్లో ప్రధాని మోదీ ఒక్కటి కూడా అమలు చేయలేదని మండిపడ్డారు. తన రాజీనామా కోరే నైతిక హక్కు బీజేపీకి లేదని స్పష్టం చేశారు. ఒకవేళ అదే పరిస్థితి వస్తే రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్లేందుకు తాను, తన కేబినెట్ సిద్ధమని వెల్లడించారు. కానీ, తమతోపాటు ప్రధాని మోదీ కూడా రాజీనామా చేసి, ప్రభుత్వాన్ని రద్దు చేసి సరికొత్త ప్రజా తీర్పు కోరాలని డిమాండ్ చేశారు. రాజకీయ ప్రకటనలు ఎప్పుడూ ఏకపక్షంగా ఉండవని  సీఎం స్పష్టం చేశారు.

యూపీ మెట్రో ఎండీ ఆధ్వర్యంలో ఆస్తుల మదింపు..

ఈ మెట్రో స్వాధీన నిర్ణయాన్ని తాము హడావుడిగా తీసుకోలేదని సీఎం రేవంత్‌‌రెడ్డి స్పష్టం చేశారు. ఎల్ అండ్ టీ మెట్రోను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియలో పారదర్శకత కోసం కేంద్ర ప్రభుత్వ సూచన మేరకే యూపీ మెట్రో ఎండీ సుశీల్ కుమార్‌‌ను నిపుణుడిగా నియమించామని తెలిపారు. ఆయన నేతృత్వంలోనే మెట్రో ఆస్తుల విలువను శాస్త్రీయంగా మదింపు వేయించామని, ఇదంతా అధికారిక పత్రాల ద్వారానే సాగిందని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై చర్చించడానికి మొదట అధికారుల కమిటీ, ఆ తర్వాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావుతో కూడిన కేబినేట్​ సబ్-కమిటీని కూడా నియమించి పకడ్బందీగా అధ్యయనం చేశామని వివరించారు.

30 వేల కోట్ల ఆస్తి..  15 వేల కోట్లకు టేకోవర్..

మెట్రోను లాభాల బాట పట్టించేందుకు ఎల్ అండ్ టీ నుంచి మొదటి దశ మెట్రోను స్వాధీనం చేసుకోవాలని తమ ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుందని సీఎం తెలిపారు. ఈ క్రమంలో రూ.30వేల కోట్ల విలువైన మెట్రో ఆస్తులను కేవలం రూ.15వేల కోట్లకు కొనుగోలు చేసేలా ఒప్పందం కుదిరిందన్నారు. ఎల్ అండ్ టీకి ఈక్విటీ మార్జిన్ మనీ కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.1,400 కోట్లు చెల్లించిందని, ప్రాజెక్టుకున్న రూ.13,600 కోట్ల అప్పును టేకోవర్ చేసిందని వెల్లడించారు.

సొంత పార్టీ ఎంపీల నియోజకవర్గాలకే ద్రోహం..

మెట్రో ప్రాజెక్టును నిలిపివేయడం ద్వారా కిషన్‌‌రెడ్డి తమ సొంత పార్టీ ఎంపీల నియోజకవర్గాల అభివృద్ధిని దెబ్బతీస్తున్నారని సీఎం రేవంత్‌‌ పేర్కొన్నారు.  తాము ప్రతిపాదించిన మెట్రో రెండో దశ విస్తరణ మార్గాలన్నీ బీజేపీ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్– కిషన్‌‌రెడ్డి, మల్కాజ్‌‌గిరి– ఈటల రాజేందర్, చేవెళ్ల– కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మెదక్ –రఘునందన్ రావు నియోజకవర్గాల గుండానే సాగుతున్నాయని గుర్తు చేశారు. పైగా ఈ రూట్లలో కాంగ్రెస్‌‌కు కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలు (గణేష్, నవీన్) మాత్రమే ఉన్నారని, మిగిలినవారంతా బీఆర్‌‌ఎస్ ఎమ్మెల్యేలేనని చెప్పారు. మరి కిషన్ రెడ్డి ఎవరిపై కక్షతో ఈ మెట్రో ప్రాజెక్టును అడ్డుకుంటున్నారని సీఎం రేవంత్‌‌రెడ్డి ప్రశ్నించారు.

కేసీఆర్ తిట్టినా పల్లెత్తు మాట అనలేదు.. కానీ ఇప్పుడు..

గతంలో కిషన్‌‌రెడ్డిని బీఆర్‌‌ఎస్ అధినేత కేసీఆర్ తీవ్రస్థాయిలో అవమానించిన విషయాన్ని సీఎం రేవంత్‌‌ ఈ సందర్భంగా ప్రస్తావించారు. 2021లో కేసీఆర్ బహిరంగంగానే కిషన్ రెడ్డిని ‘రండ’ అంటూ అవమానకరమైన పదజాలంతో తిట్టారని.. ఆనాడు  కేసీఆర్ వైపు కిషన్‌‌రెడ్డి కనీసం కన్నెత్తి కూడా చూడలేకపోయారని ఎద్దేవా చేశారు. తనను అంతలా అవమానించిన వారి పట్ల మెతక వైఖరి అవలంబిస్తూ, ఇప్పుడు కేటీఆర్ డైరెక్షన్‌‌లో నడుస్తూ నగర ప్రజల ప్రయోజనాలను కిషన్ రెడ్డి బలిపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. వరంగల్ ఎయిర్‌‌పోర్టు అభివృద్ధి కూడా కిషన్‌‌రెడ్డి నిర్లక్ష్యం వల్లే ఆగిపోయిందని మండిపడ్డారు.

కేసీఆర్ జాప్యంతోనే నష్టాలు

హైదరాబాద్‌‌ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో 2004లో ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ చైర్‌‌పర్సన్ సోనియా గాంధీ, కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి, నాటి సీఎం వైఎస్ రాజశేఖర్‌‌‌‌ రెడ్డి హయాంలో హైదరాబాద్ మెట్రోకు అంకురార్పణ చేశారని సీఎం రేవంత్‌‌రెడ్డి గుర్తుచేశారు. 2009లో టెండర్ ప్రక్రియ పూర్తయి పనులు ప్రారంభమైనా, 2014లో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ చారిత్రక కట్టడాల పరిరక్షణ పేరిట, అలైన్‌‌మెంట్ మార్పుల సాకుతో మూడేండ్లపాటు (2014–2017) ప్రాజెక్టును నిలిపివేశారని ఆరోపించారు. దీనివల్ల రూ.15వేల కోట్లతో పూర్తికావాల్సిన మెట్రో వ్యయం రూ.22,000 కోట్లకు పెరిగిందని, ప్రాజెక్టు జాప్యం, కొవిడ్ ప్రభావంతో ఎల్ అండ్ టీ సంస్థ భారీగా నష్టపోయిందని వివరించారు. పదేండ్ల బీఆర్‌‌ఎస్ పాలనలో మెట్రో విస్తరణను పూర్తిగా గాలికొదిలేయడం వల్లే దేశంలో రెండో స్థానంలో ఉండాల్సిన హైదరాబాద్ మెట్రో 9వ స్థానానికి పడిపోయిందన్నారు. గత ప్రభుత్వం కేవలం రియల్ ఎస్టేట్ శక్తులకు లాభం చేకూర్చడానికే చివరి నిమిషంలో ఎయిర్‌‌పోర్ట్ మెట్రో ప్రతిపాదనలను తెరపైకి తెచ్చిందని మండిపడ్డారు.

రూ. 84 కోట్ల ప్రాసెసింగ్ ఫీజు చెల్లించినా జాప్యం..

ఈ కొనుగోలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అన్ని బాధ్యతలను సకాలంలో నెరవేర్చిందని సీఎం రేవంత్‌‌ రెడ్డి తెలిపారు. పేపర్ ప్రాసెసింగ్ ఫీజు కింద ఐఆర్‌‌ఎఫ్‌‌సీకి రూ. 84 కోట్లను రాష్ట్ర ప్రభు త్వం ఇప్పటికే చెల్లించిందని, మార్జిన్ మనీ ఈక్వి టీ రూ. 1,400 కోట్లు కూడా సిద్ధం చేశామని చెప్పారు. మే 30 నాటికి జపాన్ నుంచి వచ్చిన నిధుల డిస్బర్స్‌‌మెంట్ పూర్తి చేసి, జూన్ 1 నుంచి మెట్రోను సంపూర్ణంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధీనం లోకి తీసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. సరిగ్గా ఈ సమయంలోనే కిషన్‌‌రెడ్డి కుట్రపూరితంగా వ్యవహరించి నిధుల బదిలీ కాకుండా అడ్డుకున్నారన్నారు.