సర్తో అర్హుల ఓట్లు చేజారొద్దు.. లంబాడీలు, ఆదివాసీలు, దళితులు, మైనార్టీలు, వలస కార్మికుల ఓట్లకు ముప్పు: సీఎం రేవంత్

సర్తో అర్హుల ఓట్లు చేజారొద్దు.. లంబాడీలు, ఆదివాసీలు, దళితులు, మైనార్టీలు, వలస కార్మికుల ఓట్లకు ముప్పు: సీఎం రేవంత్
  • నియోజకవర్గ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జీలు బాధ్యతగా పనిచేస్తే ఒక్క ఓటు కూడా పోకుండా చూడొచ్చు
  • ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి మంత్రులు ప్రతి 10 రోజుల్లో ఒక రోజు పూర్తిగా పార్టీ కార్యక్రమాలకే కేటాయించాలి
  • కొందరు ఎమ్మెల్యేలు జమీందార్లలా తయారయ్యారని ఫైర్
  • కాంగ్రెస్ సానుభూతిపరుల ఓట్లు తగ్గించి.. లబ్ధి పొందాలని చూస్తున్న బీజేపీ: పీసీసీ చీఫ్

హైదరాబాద్, వెలుగు: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) వల్ల అర్హులైన ఏ ఒక్కరి ఓటూ చేజారకుండా అప్రమత్తంగా ఉండాలని పార్టీ నేతలకు సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి సూచించారు. ముఖ్యంగా రాష్ట్రంలో ‘సర్’ పేరుతో లంబాడీలు, ఆదివాసీలు, దళితులు, మహిళలు, మైనార్టీలు, వలస కార్మికుల ఓట్లను తొలగించే ముప్పు పొంచి ఉందని, ఈ విషయంలో నియోజకవర్గాల పార్టీ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జీలు బాధ్యతగా పనిచేస్తే ఒక్క ఓటు కూడా పోకుండా చూడవచ్చని పేర్కొన్నారు. 

శుక్రవారం గాంధీ భవన్‌‌లో పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ అధ్యక్షతన పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ ( పీఏసీ ) సమావేశం జరిగింది. దీనికి చీఫ్ గెస్ట్ గా హాజరైన సీఎం రేవంత్‌‌రెడ్డి పార్టీ నేతలను ఉద్దేశించి మాట్లాడారు. సర్ పై కాంగ్రెస్ ​శ్రేణులు అవగాహన పెంచుకోవడం మంచి పరిణామమని హర్షం వ్యక్తం చేశారు. గతంలో కాంగ్రెస్ సభ్యత్వ నమోదులో కీలక పాత్ర పోషించిన ఎన్‌‌రోలర్స్ సహకారాన్ని సర్ విషయంలో కూడా తీసుకోవాలని సూచించారు. 

సర్ కోసం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు, 17 లోక్‌‌ సభ నియోజకవర్గాలకు ఇన్‌‌చార్జీలను  నియమించాలని కోరారు. సర్ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఇన్‌‌చార్జీలు నియోజకవర్గాల్లోనే ఉండాలని సూచించారు. పార్టీ నాయకులంతా సమన్వయంతో పనిచేయాలని, నాయకులు ఫీల్డ్‌‌కు వెళ్తేనే..కార్యకర్తలు బూత్‌‌స్థాయికి వెళ్తారని చెప్పారు. హైదరాబాద్ నగర పరిధిలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సర్ పై సమావేశాలు నిర్వహించాలని సీఎం సూచించారు. సిటీలో సర్ బాధ్యతలను పార్టీ రాజ్యసభ సభ్యులకు, ఎమ్మెల్సీలకు అప్పగించాలన్నారు. సర్ తరఫున మహిళా కాంగ్రెస్ కూడా క్లస్టర్లవారీగా సమావేశాలు నిర్వహించి చైతన్యపరచాలన్నారు.

  • మంత్రులు పదిరోజులకోసారి పార్టీకి పనిచేయాలి.. 

 జిల్లాల్లో ఇన్‌‌చార్జి మంత్రులు ప్రతి 10 రోజుల్లో ఒక రోజు పూర్తిగా పార్టీ కార్యక్రమాలకే కేటాయించాలని సీఎం రేవంత్‌‌రెడ్డి కోరారు. ‘‘నేను కూడా ప్రతి 10 రోజులకు ఒకసారి క్షేత్ర స్థాయిలో పార్టీ కార్యకర్తలను కలుస్తా.  నాతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ప్రతి ఒక్కరు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందే’’ అని స్పష్టం చేశారు. ఇందులో తనతోపాటు ఏ ఒక్కరికీ మినహాయింపు ఇవ్వరాదని పీసీసీ నాయకత్వాన్ని సీఎం రేవంత్ కోరారు. మాజీ పీసీసీ అధ్యక్షుల సలహాలను తీసుకోవాలని సూచించారు. 

పార్టీ తరఫున ఇప్పుడు వేలాది మంది సర్పంచ్‌‌లు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు ఎన్నికయ్యారని గుర్తు చేశారు. కొన్నిచోట్ల సర్‌‌‌‌పై పార్టీ నేతలు అలసత్వం వహిస్తున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. హైదరాబాద్ సిటీలో సర్ ప్రక్రియను పట్టించుకునేవారే లేకుండాపోయారని, సంబంధిత మంత్రులు వివరణ ఇవ్వాలని సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.

 ‘‘కొందరు ఎమ్మెల్యేలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు.. నియోజకవర్గాల్లో జమీందార్ల లెక్క తయారయ్యారు.. సొంతంగా డబ్బా కొట్టుకునేలా వీరి ప్రచారం ఉంటోంది తప్ప పార్టీకి ఉపయోగపడేలా ఉండట్లేదు. ఈ తీరు మార్చుకుంటే మంచిది..’’ అని హెచ్చరించారు.  

పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రచారం చేయాలి తప్ప, వ్యక్తిగత ప్రచారాలు కాదని చురకలంటించారు. ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల కోసం సోషల్ మీడియాను విస్తృతంగా వాడుకోవాలని సీఎం రేవంత్‌‌రెడ్డి సూచించారు.   ఈ సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్,  మంత్రులు వివేక్ వెంకటస్వామి, తుమ్మల నాగేశ్వర్‌‌‌‌రావు,  పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, అజారుద్దీన్‌‌, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క,  జూపల్లి కృష్ణారావు,  ఎంపీ రేణుకా చౌదరి, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్‌‌రెడ్డి, షబ్బీర్ అలీ,  ఇతర నాయకులు పాల్గొన్నారు.

  • లౌకికవాదుల ఓట్లు తొలగించే కుట్ర.. 

‘సర్’ పేరుతో కాంగ్రెస్ సానుభూతిపరుల ఓట్లను తగ్గించి.. రాజకీయ లబ్ధి పొందేందుకు బీజేపీ కుట్ర చేస్తున్నదని పీసీసీ  చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. లౌకికవాదుల ఓట్లను కూడా జాబితా నుంచి తొలగించే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ తీరుపై విరుచుకుపడ్డారు.  పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు ‘సర్’ ప్రక్రియకు నిదర్శనమన్నారు. అక్కడ 92 లక్షల ఓట్లు తొలగించారని, తిరిగి దరఖాస్తు చేసుకుంటే కేవలం 31 లక్షల ఓట్లు మాత్రమే జత చేశారని ఆరోపించారు.

 అక్కడ ప్రభుత్వం మారడానికి 30 లక్షల ఓట్లు మాత్రమే కారణమని పేర్కొన్నారు. బెంగాల్ తర్వాత బీజేపీ ఫాసిస్టు ప్రభుత్వం టార్గెట్ పంజాబ్, తెలంగాణ అని, అందుకే ఈ విషయంలో పార్టీ నేతలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమర్థులైన పార్టీ కేడర్‌‌‌‌ను బూత్‌‌స్థాయి ఏజెంట్లు ( బీఎల్ఏ ) లుగా నియమించామన్నారు. అంతకుముందు గాంధీ భవన్ లో  ‘సర్’ పై ఏఐసీసీ నుంచి వచ్చిన కొందరు ఎక్స్‌‌పర్ట్స్.. పీసీసీ నియమించిన మాస్టర్ ట్రైనీలకు  శిక్షణ ఇచ్చారు. ఈ ట్రైనీలు జిల్లాలకు వెళ్లి బీఎల్ఏలకు శిక్షణ ఇవ్వనున్నారు. 

సర్ విషయంలో పార్టీ కేడర్‌‌‌‌ను అప్రమత్తం చేసేందుకు హైకమాండ్ పార్టీలో సమర్థులైన కార్యకర్తలకు ఈ శిక్షణ ఇస్తోంది. ఈ ట్రైనింగ్‌‌ అనంతరం మాస్టర్ ట్రైనీలకు క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, పార్టీ ఇన్‌‌చార్జి మీనాక్షి నటరాజన్ స్వయంగా పర్యవేక్షించారు.