- ఎవరిపై వివక్ష చూపం
- నిరసనలను నియంత్రించాలనుకుంటే ఫలితం ఎట్లుంటదో చూశామని కామెంట్
- హైదరాబాద్‌లో కమ్మ గ్లోబల్ సమిట్ ప్రారంభం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎవరిపై వివక్ష ఉండదని, అది తమ ప్రభుత్వ విధానం కాదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తమకు భేషజాలు లేవని, తాము కులాన్ని అభిమానిస్తామని, ఇతర కులాలను గౌరవిస్తామని చెప్పారు. ‘‘ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం ఒక హక్కు. నిరసన తెలపకుండా నియంత్రించాలనుకుంటే.. ఫలితాలు ఎలా ఉంటాయో ఇప్పటికే చూశాం” అని అన్నారు.
రెండ్రోజుల పాటు జరగనున్న కమ్మ గ్లోబల్ సమిట్‌ను శనివారం హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘కమ్మ అంటేనే కష్టపడే గుణం ఉన్నవారు. అమ్మలాంటి ఆప్యాయత కలిగినవారు. కమ్మవారు నేలను నమ్ముకుని కష్టపడి పని చేస్తారు. ఎక్కడ సారవంతమైన నేల ఉంటే అక్కడ కమ్మవారు కనిపిస్తారు. కష్టపడటం, పది మందికి సాయం చేయడం కమ్మవారి లక్షణం. కమ్మ సామాజికవర్గం వారు నన్ను ఎంతగానో అభిమానిస్తారు. ఎన్టీఆర్ లైబ్రరీలో చదువుకున్న చదువు మమ్మల్ని ఉన్నత స్థానంలో నిలబెట్టింది” అని అన్నారు.
-
ఎన్టీఆర్.. ఒక బ్రాండ్
లీడర్ షిప్ లో దివంగత సీఎం ఎన్టీఆర్ ఒక బ్రాండ్ క్రియేట్ చేశారని సీఎం రేవంత్ అన్నారు. ‘‘ఎన్టీఆర్ రాజకీయంగా ఎంతోమందికి అవకాశాలు ఇచ్చారు. దేశంలో ఆయన ప్రవేశపెట్టిన సంకీర్ణ రాజకీయాల వల్లే ఇప్పుడు చాలా మందికి రాజకీయ అవకాశాలు వచ్చాయి” అని అన్నారు. హైదరాబాద్ ను విశ్వనగరంగా మార్చేందుకు కమ్మవారు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
కమ్మవారిలో ఉన్న నైపుణ్యాలను ప్రోత్సహించడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ‘‘జాతీయ స్థాయిలో తెలుగువారు లేని లోటు కనిపిస్తున్నది. కుల,మతాలకు అతీతంగా జాతీయస్థాయిలో రాణించే తెలుగువారిని ప్రోత్సహించాలి. కమ్మ సంఘానికి సంబంధించి వివాదంలో ఉన్న ఐదెకరాల భూ సమస్యను పరిష్కరిస్తాం. సంఘం భవన నిర్మాణానికి నిధులు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది” అని తెలిపారు.
