
హైదరాబాద్, వెలుగు: భారీ వర్షాలు, వరదల వల్ల రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో నష్టం జరిగిందని, జాతీయ విపత్తుగా ప్రకటించి, పెద్దమనసుతో ఆర్థిక సాయం అందజేయాలని ప్రధాని నరేంద్రమోదీకి సీఎం రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు. వరద నష్టాన్ని పరిశీలించేందుకు స్వయంగా రావాలని ప్రధానికి ఆయన సోమవారం లేఖ రాశారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.5 వేల కోట్ల దాకా నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చామని, పూర్తిస్థాయి నివేదిక అందిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామని, ఈలోగా తక్షణ సాయం కింద కనీసం రూ. 2 వేల కోట్లు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి సాయం అందేలా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కృషి చేయాలని ఆయన కోరారు.