రామచంద్రాపురం, వెలుగు: అక్రమంగా నిల్వ ఉంచిన 101 కిలోల గంజాయిని ఎస్‌ఓటీ సహకారంతో కొల్లూర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. సీఐ గణేశ్ పటేల్ తెలిపిన ప్రకారం.. ఏపీకి చెందిన బస్వ జగన్నాథం, పల్లపు లక్ష్మీనారాయణ సులభంగా డబ్బులు సంపాదించేందుకు ఒడిశాకు చెందిన రాజు నుంచి గంజాయిని కొనుగోలు చేశారు.
ఒడిశా నుంచి తెప్పించిన గంజాయిని తెల్లాపూర్ పరిధి శిల్ప వెంచర్ సమీపంలోని ఓ షెడ్డులో నిల్వ చేసి, లేబర్ క్యాంపుల వద్ద విక్రయించేందుకు సిద్ధమయ్యారు. పక్కా సమాచారంతో ఎస్‌ఓటీ సహకారంతో పోలీసులు సోమవారం రాత్రి మెరుపు దాడులు నిర్వహించి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
జగన్నాథం, లక్ష్మీనారాయణను అరెస్టు చేశారు. వారి వద్ద 101 కిలోల గంజాయి, నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.25.72 లక్షలు ఉంటుందని సీఐ పేర్కొన్నారు. ప్రధాన నిందితుడు రాజు పరారీలో ఉన్నాడని, ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టినట్లు తెలిపారు.
ముగ్గురు స్టూడెంట్లు అరెస్ట్
కరీంనగర్: గంజాయి స్వయంగా వినియోగించడంతో పాటు ఇతరులకు సరఫరా చేస్తున్న ముగ్గురు ఇంటర్, ఇంజినీరింగ్ స్టూడెంట్స్‌ను తెలంగాణ ఈగల్ ఫోర్స్ మంగళవారం వరంగల్–కరీంనగర్ మార్గంలో అరెస్ట్ చేసింది. వారి నుంచి 36.878 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుంది. కరీంనగర్‌కు చెందిన బుచ్చల ఆదిత్య అలియాస్ ఇంద్ర మేడ్చల్‌లోని ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. అతడి స్నేహితులతో కలిసి ఒడిశాలో 36.878 కిలోల గంజాయి కొన్నాడు.
వరంగల్ మీదుగా కరీంనగర్‌కు తరలిస్తుండగా, ఆదిత్యతో పాటు ఇంటర్ విద్యార్థి గొల్లపల్లి నిఖిల్ అలియాస్ చింటును ఈగిల్ ఫోర్స్ పట్టుకుంది. వారి వద్ద నుంచి రెండు బ్యాగుల గంజాయి, బైక్, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం గోదావరిఖనికి చెందిన వడ్లకొండ యశ్వంత్ అలియాస్ మింటును కూడా అరెస్ట్ చేశారు. మరో ఎనిమిది మంది పరారీలో
ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
సాత్నాల శివారులో 92 మొక్కలు స్వాధీనం..
ఆదిలాబాద్ టౌన్(బేల): ఆదిలాబాద్ జిల్లా బేలా పోలీస్ స్టేషన్ పరిధిలోని సాత్నాల మండలం దౌనా గ్రామ శివారులో అటవీ భూమిలో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు జైనథ్ సీఐ జి.శ్రావణ్ తెలిపారు. చెక్‌డ్యామ్ వెనుక అటవీ భూమిలో తనిఖీలు చేపట్టగా, అదే గ్రామానికి చెందిన చంకటి బాపురావు అలియాస్ చకటి బౌరావు జొన్న పంటలో 92 గంజాయి మొక్కలు లభ్యమైనట్లు పేర్కొన్నారు. వాటి విలువ సుమారు రూ.9.2 లక్షలు ఉంటుందని చెప్పారు.
