ఎంఐఎం సహవాసం వల్లే.. హిందువులపై సీఎం కామెంట్లు : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ఎంఐఎం సహవాసం వల్లే.. హిందువులపై సీఎం కామెంట్లు : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
  •     హిందూ సమాజం ఆలోచించాలి: కేంద్ర మంత్రి బండి సంజయ్

న్యూఢిల్లీ, వెలుగు: ఎంఐఎం పార్టీతో సహవాస దోషం వల్లే సీఎం రేవంత్ రెడ్డి హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఒక హిందువుగా.. హిందూ దేవతలపై రేవంత్​రెడ్డి కామెంట్లు చేయడం శోచనీయమన్నారు. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 

రేవంత్ వ్యాఖ్యలపై తెలంగాణలో కూడా హిందువులంతా ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. హిందువుల శక్తి ఏంటో తెలియజేయాలన్నారు. ఏ ఓట్లతో అధికార పీఠమెక్కి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారో.. ఆ ఓట్లతోనే సీఎం, కాంగ్రెస్ పార్టీకి పట్టిన మైకాన్ని, అహంకారాన్ని వదిలించాలన్నారు. అధికార పీఠం నుంచి వారిని దించాలని, అందుకోసం తెలంగాణలోని హిందువులంతా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ ఎంఐఎంకు కొమ్ము కాసే పార్టీ: సంజయ్

 కాంగ్రెస్ ముమ్మాటికీ మజ్లిస్ పార్టీకి కొమ్ముకాసే పార్టీ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. ముస్లిం అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే ముస్లిం పార్టీ అని రేవంత్ రెడ్డి చెప్పడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఈ మేరకు సీఎం కామెంట్లను తప్పుబడుతూ మంగళవారం బండి సంజయ్ ఆఫీసు ఒక ప్రకటన రిలీజ్ చేసింది. 

బీఆర్ఎస్ సైతం గతంలో పలుమార్లు హిందూ దేవుళ్లను, హిందూ సంస్కృతిని కించపర్చిందని చెప్పారు. హిందూ సమాజం ఇకనైనా ఆలోచించుకోవాలన్నారు. ‘‘ఓట్ల కోసం చీలిపోయి విడివిడిగా ఉంటూ అవహేళనను, అవమానాన్ని దిగమింగుకుంటూ ఉంటారో?.. లేక ఏకమై హిందువుల సత్తాను చాటుతారో తేల్చుకోవాలి’’ అని అన్నారు.