ఫిబ్రవరి17 న ముగ్గురు కమిషనర్లతో సీఎం సమావేశం..గ్రేటర్ ఎన్నికలపై చర్చించే అవకాశం

ఫిబ్రవరి17 న ముగ్గురు కమిషనర్లతో సీఎం సమావేశం..గ్రేటర్ ఎన్నికలపై చర్చించే అవకాశం
  • అడ్వర్టైజ్​మెంట్ పాలసీపై కీలక నిర్ణయం

హైదరాబాద్ సిటీ, వెలుగు : హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్ల కమిషనర్లతో సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం సమావేశం కానున్నట్లు తెలిసింది. ఇందులో ఏండ్లుగా పెండింగ్ లోఉన్న అడ్వర్టైజ్ మెంట్ పాలసీ, ఎలక్ర్టిసిటీ, శానిటేషన్ కి  సంబంధించి రాంకీ ఏజెన్సీ విస్తరణపై చర్చించే అవకాశం ఉంది. అలాగే, మున్సిపల్​ఎన్నికల్లో గెలిచిన ఉత్సాహంతో మూడు కార్పొరేషన్ల ఎన్నికలకి సంబంధించి కూడా చర్చ జరిగే అవకాశం ఉందని సమాచారం. ప్రభుత్వం నుంచి గ్రీన్​సిగ్నల్​వస్తే కార్పొరేషన్ల వారీగా ఓటర్ల జాబితా సవరణ, కొత్త ఓటర్ల నమోదుకు నోటిఫికేషన్ ఇచ్చే అవకాశముంటుంది. తర్వాత రిజర్వేషన్ల సంగతి తేలుస్తారు. ఇటీవల జీహెచ్ఎంసీ మేయర్ స్థానాన్ని జనరల్ మహిళకి కేటాయించినప్పటికీ కార్పొరేషన్ల విభజన జరగడంతో ఆ రిజర్వేషన్ మరోసారి మారుతుందంటున్నారు.  

అడ్వర్టైజ్​మెంట్ పాలసీపై..

 2020 వరకు గ్రేటర్ లో హోర్డింగ్స్​కు అనుమతులు ఉండేవి. దీంతో అప్పట్లో జీహెచ్ఎంసీకి ఏటా దాదాపు రూ.36 కోట్ల ఆదాయం వచ్చేది. ప్రమాదాలు జరగడంతో హోర్డింగ్స్​బ్యాన్ చేస్తూ అప్పటి ప్రభుత్వం జీవో 68 విడుదల చేసింది. అప్పటి నుంచి హోర్డింగ్ లకు బ్రేక్ పడింది. కొత్త పాలసీ కోసం ఇప్పటికే పలు మార్లు అధికారులు సర్కార్ కు ప్రతిపాదనలు పంపారు. కొత్త పాలసీలో హోర్డింగ్స్​ఎత్తు 80 ఫీట్ల వరకు ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం ఇచ్చినట్టు తెలిసింది.

వీటిని కేవలం100 ఫీట్ల రోడ్లపైన మాత్రమే ఏర్పాటు చేసుకునేలా నిబంధన విధిస్తారని అంటున్నారు. హోర్డింగ్ కి, హోర్డింగ్ కి  మధ్య250 మీటర్ల గ్యాప్ తప్పనిసరి. జంక్షన్ నుంచి కూడా100 ఫీట్ల గ్యాప్ ఇచ్చి ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందని చెప్తున్నారు. ఎల్ఈడీ స్క్రీన్లకు కూడా అనుమతులు లభించనున్నాయి. కొత్త పాలసీ ప్రకారం నార్మల్ హోర్డింగ్ అయితే 4500 స్క్వైర్ ఫీట్ లో ఉండనున్నది. ఎల్ఈడీకి అయితే రివైజ్ చేసి రేటు ఫిక్స్ చేసే అవకాశం ఉంది. బిల్డింగ్, రూప్ టాప్, రోడ్డుపై ఏర్పాటు చేసుకునే వీలుంటున్నప్పటికీ అన్ని క్లియరెన్స్ తీసుకున్నాకే అనుమతులు ఇవ్వనున్నట్లు తెలిసింది. కొత్త పాలసీతో మూడు కార్పొరేషన్లకి రూ.150 కోట్ల ఆదాయం వచ్చే చాన్స్ ఉంది.