గవర్నర్ అపాయింట్మెంట్ కోరిన సిద్ధరామయ్య.. సీఎం పదవికి రాజీనామా..? 

గవర్నర్ అపాయింట్మెంట్  కోరిన సిద్ధరామయ్య.. సీఎం పదవికి రాజీనామా..? 

బెంగళూర్: కర్నాటక రాజకీయాల్లో పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. రాష్ట్రంలో నాయకత్వ మార్పు వార్తల వేళ సీఎం సిద్ధరామయ్య గవర్నర్ అపాయింట్మెంట్ కోరడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గురువారం (మే 28) సీఎం పదవికి సిద్ధూ తన రాజీనామాను సమర్పించేందుకు గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్‌ అపాయింట్‌మెంట్ కోరినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. హైకమాండ్ ఆదేశాల మేరకు ఆయన సీఎం పదవికి రాజీనామా చేయనున్నట్లు టాక్. 

మరోవైపు.. ఏఐసీసీ అబ్జర్వర్లు కేసీ వేణుగోపాల్, రణ‎దీప్ సూర్జేవాలా కర్నాటనకు చేరుకున్నారు. గురువారం (మే 28) ఉదయం సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులతో వీరు బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ నిర్వహించనున్నారు. ఈ భేటీ అనంతరం సీఎం సిద్ధరామయ్య గవర్నర్ కలిసి రాజీనామా సమర్పించనున్నట్లు సమాచారం. సిద్ధూ స్థానంలో కర్నాటక తదుపరి సీఎంగా డీకే శివకుమార్ 2026, మే 30న ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. డిప్యూటీ సీఎం రేసులో జీ పరమేశ్వర, ప్రియాంక్ ఖర్గే, ఎంబీ పాటిల్ ఉన్నారు. 

డీకేకు సీఎం పదవి కట్టబెట్టాలని పార్టీ హైకమాండ్ ఏకగ్రీవంగా మద్దతు ఇచ్చినట్టుగా జాతీయ మీడియా వెల్లడించింది. సీఎం సిద్ధరామయ్యకు రాజ్యసభ సీటు ఆఫర్ చేశారని, ఢిల్లీ నుంచి జాతీయ స్థాయిలో మరింత పెద్ద పాత్ర పోషించాలని కోరారని తెలుస్తోంది. అయితే, దీనిపై నిర్ణయం తీసుకోవడానికి సిద్ధరామయ్య సమయం అడిగారని సమాచారం.

సిద్ధరామయ్య ఈ విషయాన్ని తన అనుచరులతో చర్చించారని, తాను హైకమాండ్ నిర్ణయాలకు కట్టుబడి ఉంటానని ప్రకటించారని కూడా ఢిల్లీ వర్గాలు తెలిపాయి. సీఎం పదవి నుంచి దిగేందుకు అంగీకరించిన సిద్ధూ.. ఒకటి రెండు రోజుల్లో రాజీనామా చేసే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి.

మంగళవారం ఉదయం నుంచి ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలు ఆరు గంటల పాటు సుదీర్ఘ సమావేశాన్ని నిర్వహించారు. అయితే, కర్నాటకలోని మూడు రాజ్యసభ సీట్లకు, ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించే ఈ సమావేశంలో చర్చించామని, సీఎం పదవి మార్పులో నిజంలేదని పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. దీనిపై అనవసర ఊహాగానాలు చేయొద్దని మీడియాను కోరారు.

ఏడాది క్రితం నుంచే డీకే వర్గం డిమాండ్..

కర్నాటక కాంగ్రెస్లో ఈ నాయకత్వ సమస్య ఏడాదికిపైగా నలుగుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు సిద్ధూ, డీకే మధ్య తీవ్ర పోటీ నెలకొంది. దీంతో పార్టీ కేంద్ర నాయకత్వం రొటేషన్ పద్ధతిలో 2.5 ఏండ్ల తర్వాత సీఎం పదవిని ఇచ్చేలా డీకేకు హామీ ఇచ్చిందని, ఆ వాగ్దానం ప్రకారం.. ఇప్పుడు డీకేకు సీఎం కుర్చీ అప్పగించాలని ఆయన అనుచరులు ఏడాదికిపైగా డిమాండ్ చేస్తున్నారు.

అయితే, మైనారిటీ వర్గాలు, వెనుకబడిన తరగతులు, దళితులతో కూడిన అహిందా సమూహంలో సిద్ధరామయ్యకు ఉన్న మద్దతు దృష్ట్యా ఆయనను దింపేందుకు కాంగ్రెస్ తటపటాయించింది. సిద్ధూను దింపితే పక్క రాష్ట్రం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన వొక్కలిగ లింగాయత్ వర్గం ఓట్లకు గండిపడుతుందని వాయిదా వేస్తూ వచ్చింది.

ALSO READ : బీఆర్ఎస్ పరిస్థితి ఒడ్డున పడ్డ చేప పిల్లలా ఉంది..

ఇప్పుడు తమిళనాడు ఎన్నికలు కూడా ముగిసినందున సీఎం కుర్చీని ఇవ్వాల్సిందేనంటూ డీకే వర్గం మరింత బలంగా డిమాండ్ చేసిందని, దీంతో చివరకు హైకమాండ్ డీకేకు మద్దతు ఇచ్చిందని తెలుస్తోంది. మరోవైపు, సిద్ధరామయ్య రాజీనామా నిర్ణయంపై ఆయన అనుచరులు అసంతృప్తితో ఉన్నారని, తుది నిర్ణయం తీసుకునే ముందు అన్ని ప్రత్యామ్నాయాలను పరిశీలించాలని వారు కోరినట్టు సమాచారం.