తిరుగుబాటు మంత్రుల శాఖలను తొలగించిన ఠాక్రే

తిరుగుబాటు మంత్రుల శాఖలను తొలగించిన ఠాక్రే

ముంబై : మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. గంట గంటకు పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఉద్దవ్ ఠాక్రే సర్కార్ పై ఏక్ నాథ్ షిండేతో పాటు ఆయన అనుచర ఎమ్మెల్యేలు తిరుగుబావుటా ఎగరవేయడంతో రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఈ నేపథ్యంలో సీఎం ఉద్ధవ్ ఠాక్రే కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏక్ నాథ్ షిండ్ వైపు వెళ్లిన తొమ్మిది మంది మంత్రుల శాఖలను ఠాక్రే తొలగించారు. మహారాష్ట్రలో భారీ వర్షాలు, తుఫాన్ ముప్పు ఉండటంతో అందుబాటులో లేని 9 మంది మంత్రుల శాఖలను తొలగించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తిరుగుబాటు ఎమ్మెల్యేలు అస్సాంలోని గౌహతిలో ఉన్న రాడిసన్ బ్లూ హోటల్ లో ఉన్నారు. ఏక్ నాథ్ షిండ్ నిర్వహిస్తున్న పట్టణాభివృద్ధి, పబ్లిక్ వర్క్స్ శాఖను ఎమ్మెల్యే  సుభాష్ దేశాయ్‌కు సీఎం ఠాక్రే అప్పగించారు.

తిరుగుబాటు మంత్రుల శాఖల తొలగింపు
గులాబ్రావ్ పాటిల్ నిర్వహిస్తున్న నీటి సరఫరా, పారిశుధ్యంశాఖను అనిల్ పరబ్‌కు అప్పగించారు. దాదాజీ భూసే వద్ద ఉన్న వ్యవసాయం, మాజీ సైనికుల సంక్షేమ శాఖలతో పాటు సందీపన్ భూమారే వద్ద ఉన్న ఉపాధి హామీ, ఉద్యానవన శాఖలను ఎమ్మెల్యే శంకర్ గడఖ్ కు అప్పగించారు. ఉదయ్ సావంత్ వద్ద ఉన్న ఉన్నత విద్య, సాంకేతిక విద్యా శాఖలను ఆదిత్య ఠాక్రేకు అప్పగించారు. శంభురాజ్ దేశాయ్ వద్ద ఉన్న మూడు శాఖలను సంజయ్ బన్సోడే, సతేజ్ పాటిల్, విశ్వజిత్ కదమ్‌లకు అప్పగించారు. రాజేంద్ర పాటిల్ (యాద్రవ్‌కర్) వద్ద ఉన్న నాలుగు మంత్రిత్వ శాఖలను విశ్వజీత్ కదమ్, ప్రజక్త్ తాన్‌పురే, సతేజ్ పాటిల్, అదితి తత్కరేలకు అప్పగించారు. అబ్దుల్ సత్తార్‌ వద్ద ఉన్న మూడు శాఖలను ప్రజక్త్ తాన్‌పురే, సతేజ్ పాటిల్, అదితి తత్కరేకు అప్పగించారు. ఓంప్రకాష్ కుడు వద్ద ఉన్న నాలుగుశాఖలను అదితి తత్కరే, సతేజ్ పాటిల్, సంజయ్ బన్సోడే, దత్తాత్రయ్ భర్నేలకు అప్పగించారు. 

రెబెల్ ఎమ్మెల్యేలు గౌహతి నుంచి రాజకీయం నడుపుతుండగా.. ఉద్ధవ్ వర్గం ముంబై కేంద్రంగా రాజకీయాలు చేస్తోంది. ఇప్పటికే సీఎం ఉద్ధవ్ ఠాక్రే సిఫారసు మేరకు డిప్యూటీ స్పీకర్  నరహరి జిర్వాల్‌16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడంతో పాటు, అసెంబ్లీలో శివసేన ఫ్లోర్ లీడర్ గా ఏక్ నాథ్ షిండేను తప్పించి అజయ్ చౌదరిని డిప్యూటీ స్పీకర్ నియమించారు. ఇదిలా ఉంటే శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ఉమ్మడి మహా వికాస్ అఘాడీ ప్రభుత్వానికి షిండే వర్గం మద్దతు ఉపసహరించుకున్నట్లు, ప్రభుత్వం మైనారిటీలో పడిపోయనట్లు సుప్రీం కోర్టుకు తెలియజేశారు. సీఎం ఉద్ధవ్ ఠాక్రేను భర్తరఫ్ చేయాలని గవర్నర్ కు రెబెల్ ఎమ్మెల్యేల సంతకాలతో లేఖలు రాసింది షిండే వర్గం.