
- యూపీ సీఎం యోగి ఆదేశం
- యాత్రికుల పవిత్రతను కాపాడేందుకే ఈ నిర్ణయమని వెల్లడి
లక్నో: కన్వర్ యాత్ర రూట్లలో హోటళ్లు, రెస్టారెంట్లు తప్పనిసరిగా నేమ్ బోర్డులపై యజమానుల పేర్లను డిస్ ప్లే చేయాల్సిందేనని ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం ఆదేశాలు జారీచేశారు. అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. కన్వర్ యాత్రికుల పవిత్రతను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని సీఎం తెలిపారు. ‘‘రెస్టారెంట్, దాబా, తోపుడు బండి.. ఫుడ్ బిజినెస్ చేసే ఏ సంస్థ అయినా, ఎవరైనా తప్పనిసరిగా నేమ్ బోర్డుపై యజమానుల పేర్లు రాయాల్సిందే” అని సీఎం స్పష్టం చేశారు.
కొంతమంది ముస్లింలు తమ హోటళ్ల నేమ్ బోర్డులపై వైష్ణో దాబా, శాకాంబరీ దేవి భోజనాలయ, శుద్ధ భోజనాలయ అని పేర్లు రాసి మాంసాహారం అమ్ముతున్నారు. దీంతో యాత్రికుల పవిత్రతకు భంగం కలుగుతోంది’’ అని యూపీ మంత్రి కపిల్ దేవ్ అగర్వాల్ ఇటీవలే ఆరోపించారు. ఈ నెల 22న కన్వర్ యాత్ర ప్రారంభం కానుంది.
ఉత్తరాఖండ్ కూడా యూపీ బాటలోనే
ఉత్తరాఖండ్ కూడా యూపీ సర్కారులాగే నిర్ణయం తీసుకుంది. కాన్వర్ యాత్ర రూట్లలో హోటళ్లు, రెస్టారెంట్లు, ధాబాలు తప్పనిసరిగా యజమానుల పేర్లు వెల్లడించాల్సిందేనని ఆదేశాలు జారీచేసింది.
ఆదేశాలు వెనక్కి తీసుకోవాలి: ప్రియాంక
కన్వర్ రూట్లలో హోటళ్లు యజమానుల పేర్లను వెల్లడించాలని యూపీ, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు జారీచేసిన ఆదేశాలపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మండిపడ్డారు. ఇలా ఆదేశాలు జారీచేయడం రాజ్యాంగంపై దాడి అని ట్విటర్ లో ఆమె విమర్శించారు. ‘‘కులం, మతం, భాషపరంగా పౌరులపై వివక్ష చూపకూడదని మన రాజ్యాంగం చెబుతుంది. కానీ.. యూపీ, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు ఒక వర్గం వారిమీద వివక్ష చూపుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఆదేశాలను వెనక్కి తీసుకోవాలి” అని ఆమె డిమాండ్ చేశారు.