అమ్మ ఒడితో చదువుకు భరోసా కల్పించాం

అమ్మ ఒడితో చదువుకు భరోసా కల్పించాం

స్వాతంత్య్రానికి, ప్రజా స్వామ్యానికి, సార్వభౌమత్వానికి, ఆత్మ గౌరవానికి ప్రతీక జాతీయ జెండా అని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. అహింసే ఆయుధంగా, సత్యమే సాధనంగా శాంతియుత పోరాటం భారతదేశానికి, ప్రపంచమానవాళికి మహోన్నత చరిత్రగా తిరుగులేని స్ఫూర్తిగా కలకాలం నిలిచే ఉంటుందన్నారు. అందుకే మన స్వాతంత్య్ర పోరాటం మహోన్నతమైనదన్నారు. 75 ఏండ్లలో దేశం తిరుగులేని విజయాలు సాధించిందన్నారు. బ్రిటీష్ వారిపై యుద్ధం ప్రకటించి దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుల త్యాగాలు మరువలేనివన్నారు. 

ప్రపంచంతో పోటీ పడి ప్రగతి సాధిస్తున్నం

1947లో 100మందిలో12 శాతం అక్షరాస్యత ఉంటే..ప్రస్తుతం అక్షరాస్యత 77 శాతానికిపైగా ఉందని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. స్మార్ట్ ఫోన్ల వినియోగంలో ప్రపంచంలోనే దేశం రెండో స్థానంలో ఉందన్నారు. ప్రపంచ ఫార్మా రంగంలో టాప్ మూడు దేశాల్లో ఇండియా ఒకటిగా నిలిచిందన్నారు. బ్రిటన్ లో వాడుతున్న నాలుగు ట్యాబెట్లలో ఒకటి ఇండియాలోనే తయారు అవుతున్నాయన్నారు. అంతరిక్ష రంగంలో ఇస్రో సాధించే ఘన విజయాలు శత్రువు ఎంత బలవంతుడైనా దాన్ని ఎదుర్కొనేందుకు అణు ఆయుధాల క్షిపణులు, తేజస్ యద్ధవిమానాలు తయారు చేశామన్నారు. వాటిని కొనుగోలు చేసేందుకు పలు దేశాలతో పాటు అమెరికా ఆసక్తి చూపుతోందన్నారు. ఎందరో ఇండియన్లు అమెరికన్ కంపెనీలకు సీఈవోలుగా ఉన్నారని చెప్పారు. బ్రిటన్ లో భారతీయ సంతతి వ్యక్తి ప్రధాని రేసులో ఉన్నారని..అగ్రరాజ్యంలో భారతీయ సంతతి మహిళ అమెరికా ఉపాధ్యక్ష పదవిలో ఉండటం భారతీయలు గర్వించే అంశాలుగా ఉన్నాయన్నారు. ప్రపంచంతో పోటీ పడి ప్రగతి సాధిస్తున్నామని.. ఆహార ధాన్యాల లోటుని దేశం అధిగమించిందన్నారు. 150 దేశాలకు ఆహార ధాన్యాన్ని ఎగుమతి చేస్తున్నామని ఏపీ సీఎం జగన్ చెప్పారు. 

రైతులకు అన్ని విధాలా సహాయం

గడిచిన మూడేండ్లలో ఏపీలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అనేక సంస్కరణలు అమలు చేసిందని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. అనేక వర్గాల దోపిడీల బారి నుంచి కాపాడామన్నారు. ప్రతి నెలా ఒకటో తారీఖున వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి ఫించన్లు అందజేస్తున్నారని చెప్పారు. రైతులకు అన్ని విధాలా సహాయం చేసే విధంగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. గ్రామాల్లో వైఎస్సార్ విలేజ్ క్లినిక్ లు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. డిజిటల్ గ్రాంథాలయాలు.. ప్రతి మండలానికి రెండు పీహెచ్ సీలు ఏర్పాటు చేశామని తెలిపారు. 

పరిపాలనా వికేంద్రీకరణ కోసం 26 జిల్లాలు 

విద్య, వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చామని సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. జిల్లాల పెంపుతో పరిపాలనా వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టామన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చామన్నారు. పౌరసేవల్లో అనేక మార్పులు తీసుకొచ్చామని తెలిపారు. రైతులకు సున్నా వడ్డీకే రుణాలు అందజేస్తున్నామని, విత్తనం నుంచి పంట అమ్మకం వరకు ఆర్బీకేల ద్వారా సేవలు అందిస్తున్నామన్నారు. పగటి పూటే నాణ్యమైన 9 గంటల ఉచిత విద్యుత్ అందజేస్తున్నామన్నారు. రైతు సంక్షేమానికి 83 వేల కోట్లు...ధాన్యం సేకరణపై 44 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. మూడేళ్లలో వ్యవసాయం మీద రూ.లక్షా 27 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. రాష్ట్రంలో ఆహార ధాన్యాల ఉత్పత్తిలో ఏటా 16 లక్షల టన్నులు పెరిగేలా చర్యలు చేపట్టామన్నారు. 

30 లక్షల కుటుంబాలకు ఇండ్ల పట్టాలు 

దేశ చరిత్రలో లేని విధంగా రాష్ట్రంలో 30 లక్షల కుటుంబాలకుపైగా ఇళ్ల పట్టాలు అందజేస్తామని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. వివిధ దశలో 21 లక్షల ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయన్నారు. పిల్లల చదువులతోనే పేదల తలరాతలు మార్చి, వారి ఇంట వెలుగులు నింపాలనే సంకల్పంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తల్లులకు అండగా నిలుస్తూ జగనన్న అమ్మఒడి పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు.

విద్యారంగంపై రూ.53 వేల కోట్ల వ్యయం

మూడేండ్లలో విద్యారంగం మీద చేసిన వ్యయం 53 వేల కోట్లకుపైగా ఉందని సీఎం జగన్ చెప్పారు. వైద్యం, ఆరోగ్యం కోసం వైఎస్సార్ ఆరోగ్య శ్రీ సేవలు 95 శాతం అందజేస్తున్నామన్నారు. వెయ్యి రూపాయలు దాటితే ఉచితంగా వైద్యం అందిస్తున్నామన్నారు. ఆపరేషన్ తర్వాత రోగి కోలుకునే వరకు ప్రతి నెలా ఐదువేలు చొప్పున వైఎస్సార్ ఆసరా కింద అందజేస్తున్నామన్నారు. 108, 104 సేవలకు అర్థం చెబుతూ ప్రతి మండలానికి 1,088 వాహనాలను అందజేశామన్నారు. పేద ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు 108,104 వాహనాలను మరింత పెంచేందుకు చర్యలు చేపట్టామన్నారు. 

పేదలకు మెరుగైన వైద్య సేవలు

విలేజ్ క్లినిక్ ల ద్వారా గ్రామాల్లో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కు బీజం పడుతుందని సీఎం జగన్ అన్నారు. గ్రామం నుంచి జిల్లా వరకు ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు, మౌళిక సదుపాయాలను అందించేలా సమూల మార్పులు తీసుకొచ్చామన్నారు. జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్యం అందించేందుకు 16 వేల కోట్ల రూపాయాలతో నాడు, నేడు అమలు చేస్తున్నామన్నారు. గడిచిన మూడేండ్లలో వైద్య రంగంలో 40 వేల కొత్త ఉద్యోగాలు ఇచ్చామన్నారు. 

మూడేండ్లలో 6 లక్షల మందికి ఉద్యోగాలు

మూడేండ్లలో 6 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. లక్షా 88 వేల శాశ్వత ఉద్యోగాలు, 20వేల కాంట్రాక్టు ఉద్యోగాలు, 4లక్షల ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇచ్చామన్నారు. మరో నాలుగు సీ పోర్టు, 9 ఫిష్టింగ్ హార్బర్ లు నిర్మాణంలో ఉన్నాయని చెప్పారు. సువిశాల సముద్రంలో ప్రతి 50 కిలోమీటర్లకు సీ పోర్టు, ఫిషింగ్ హార్టర్ ఉండేలా చర్యలు చేపట్టామన్నారు. ఒక్క ఎంఎస్ఎంఈ రంగంలో 10 లక్షలకుపైగా ఉద్యోగులు పని చేస్తున్నారని తెలిపారు. మహిళా సాధికారత అంశంలో దేశంలో ఏ ప్రభుత్వం వేయని అడుగులు రాష్ట్రంలో మూడేండ్లలో పడ్డాయన్నారు. 

అమ్మబడి పథకం కింద రూ.19, 618 కోట్లు

44 లక్షల 50 వేల మంది తల్లులకు 84 లక్షల మంది పిల్లలకు మంచి జరిగేలా మూడేళ్లలో జగనన్న అమ్మబడి పథకం కింద రూ.19, 618 కోట్లు అందజేశామని సీఎం జగన్ అన్నారు. వైఎస్సార్ ఆసరా ద్వారా 78 లక్షల 74 వేల  పొదుపు సంఘాల మహిళలకు రూ.12, 758 కోట్లు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశామన్నారు. వైఎస్సార్ సున్నా వడ్డీ ద్వారా కోటి 2 లక్షల మహిళలకు రూ.3, 615 కోట్లు అందజేశామని చెప్పారు. వైఎస్సార్ చేయూత ద్వారా 45 నుంచి 60 ఏండ్ల వయస్సులోపు మహిళలకు రూ.9,180 కోట్లు అందించామన్నారు. వైఎస్సార్ కాపు నేస్తం కింద రూ.1,492 కోట్లు, వైఎస్సార్ ఈబీసీ నేస్తం ద్వారా రూ.589 కోట్లు అందజేశామని తెలిపారు. 

సామాజిక న్యాయానికి పెద్ద పీట 

రాష్ట్రంలో మహిళల రక్షణకు పెద్దపీట వేస్తున్నామని సీఎం జగన్ చెప్పారు. దిశ చట్టానికి రూప కల్పన, దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశామన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మహిళలకు ఆర్థికంగా, రాజకీయంగా, విద్య పరంగా, రక్షణపరంగా అండగా ఉంటుందన్నారు. నామినేటెడ్‌ పదవుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ చట్టం చేశామని తెలిపారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ కల్పించిన ప్రభుత్వం వైఎస్ఆర్ సీపీదే అన్నారు. ప్రాంతీయ ఆకాంక్షలకు, ప్రాంతాల ఆత్మ గౌరవానికి అన్ని ప్రాంతాల సమతుల్యత అవసరమని, పటిష్ట బంధానికి ఇదే పునాది అని గట్టిగా నమ్మి అడుగులు వేస్తున్నామన్నారు.