సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి.. 5.86 కోట్ల టన్నులు

సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి.. 5.86 కోట్ల టన్నులు

హైదరాబాద్‌‌, వెలుగు: సింగరేణిలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో(2021–22) అన్ని అంశాల్లోనూ వృద్ధి సాధించినట్లు సీఎండీ శ్రీధర్ వెల్లడించారు. పోయినేడుతో పోలిస్తే బొగ్గు ఉత్పత్తి, రవాణా, ఓవర్‌‌ బర్డెన్‌‌, కరెంటు తయారీ పెరిగిందని చెప్పారు. ఫిబ్రవరి అఖరు వరకు సాధించిన లక్ష్యాలను మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సింగరేణి పోయినేడు ఫిబ్రవరి నాటికి 4.42  కోట్ల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయగా, ఈసారి 33% అధికంగా 5.86 కోట్ల టన్నులు ఉత్పత్తి చేసింది. పోయినేడు 4.25 కోట్ల టన్నుల బొగ్గు రవాణా చేయగా, ఈసారి 40% అధికంగా 5.95 కోట్ల టన్నులు రవాణా చేసింది. నిరుడు 2.88 కోట్ల క్యూబిక్‌‌ మీటర్ల ఓవర్ బర్డెన్ ను తొలగించగా, ఈసారి 20% అధికంగా 3.46 కోట్ల క్యూబిక్‌‌ మీటర్లు తొలగించింది. 

కరెంట్ ఉత్పత్తి, అమ్మకాల్లోనూ... 

థర్మల్ విద్యుత్ ఉత్పత్తి, అమ్మకాల్లోనూ సింగరేణి వృద్ధి సాధించింది. జైపూర్​లో ఉన్న థర్మల్‌‌ విద్యుత్‌‌ కేంద్రం ద్వారా పోయినేడు ఫిబ్రవరి నాటికి 6,703 మిలియన్‌‌ యూనిట్ల కరెంట్ ఉత్పత్తి చేయగా, ఈసారి 26% అధికంగా 8,459 మిలియన్‌‌ యూనిట్లు ఉత్పత్తి చేసింది. నిరుడు ఫిబ్రవరి నాటికి రూ.2,964 కోట్ల కరెంటు అమ్మిన సింగరేణి, ఈసారి 19% అధికంగా రూ.3,523 కోట్ల కరెంటు అమ్మింది. సింగరేణి వ్యాప్తంగా 8 చోట్ల ఏర్పాటు చేసిన సోలార్‌‌ పవర్ ప్లాంట్ల ద్వారా ఇప్పటి వరకు 239 మిలియన్‌‌ యూనిట్ల కరెంట్​ను ఉత్పత్తి చేసినట్లు శ్రీధర్‌‌ వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకో నెల రోజులు ఉండటంతో, టార్గెట్ చేరుకోవడానికి కృషి చేయాలని అధికారులు, కార్మికులకు సూచించారు.