సీఎంవో.. ఫైల్స్ స్లో!..వివిధ శాఖలు చూస్తున్న సెక్రటరీలపై మంత్రులు, ఎమ్మెల్యేల కంప్లైంట్స్

సీఎంవో.. ఫైల్స్ స్లో!..వివిధ శాఖలు చూస్తున్న సెక్రటరీలపై మంత్రులు, ఎమ్మెల్యేల కంప్లైంట్స్
  •     సీఎం ఆదేశించిన వాటికీ  మళ్లీ  ఆయన గుర్తు చేస్తేనే ముందుకు 
  •     ఉన్న  సెక్రటరీలలో ముగ్గురు ఇతర రాష్ట్రాల వాళ్లే 
  •     మరో స్పెషల్ సెక్రటరీ  డిఫెన్స్ నుంచి డిప్యూటేషన్​పై..!
  •     పట్టింపులేక కొందరు.. అవగాహన లేక ఇంకొందరు..ఫైల్స్​ను ముందుకు పోనిస్తలే! 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర పరిపాలనకు గుండెకాయ లాంటి సెక్రటేరియెట్​లో, అందులోనూ అత్యంత కీలకమైన ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో)లోనే ఫైళ్లు ముందుకు కదలడం లేదు. ప్రభుత్వ యంత్రాంగాన్ని పరుగులు పెట్టించాల్సిన సీఎంవో అధికారులే తాబేలు నడక నడుస్తుండటంతో.. మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం సీఎంవోలోని అధికారులకు శాఖల వారీగా బాధ్యతలను కేటాయించింది. 

ముఖ్య కార్యదర్శి శేషాద్రికి సాధారణ పరిపాలన, శాంతిభద్రతలు, రెవెన్యూ వంటి కీలక శాఖలు ఇవ్వగా.. మరో కార్యదర్శి మాణిక రాజ్ కు మున్సిపల్, వైద్యారోగ్యం.. శ్రీనివాస రాజుకు రోడ్లు భవనాలు, దేవాదాయ శాఖ, అజిత్​ రెడ్డికి విద్యాశాఖ, ఇంధన శాఖలు.. ఓఎస్డీ శ్రీనివాసులుకు సంక్షేమ శాఖలతో పాటు సీఎంఆర్​ఎఫ్​  కేటాయించారు. ఒకరిద్దరు మినహా ఇతర సెక్రటరీల వద్దకు వెళ్తున్న ఫైళ్లు వారాల తరబడి పెండింగ్‌‌‌‌‌‌‌‌లోనే ఉండిపోతున్నాయి. క్షేత్రస్థాయిలో పనులు జరగక, నిధులు విడుదల కాక ప్రజాప్రతినిధులు తలలు పట్టుకుంటున్నారు. 

సీఎంవోలో ఫైల్స్ క్లియరెన్స్ ఇంత మందకొడిగా సాగడంపై మంత్రులు నేరుగా ముఖ్యమంత్రికే ఫిర్యాదులు చేస్తున్నట్లు తెలిసింది. వివిధ శాఖలు చూస్తున్న ఐఏఎస్​లు కూడా సీఎంవో సెక్రటరీల తీరుపై వివిధ సందర్భాలలో అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా మంత్రివర్గ సమావేశంలో తీసుకోవాల్సిన నిర్ణయాలకు సంబంధించిన ఫైల్స్​లో పదే పదే కొర్రీలు పెడుతున్నారని, సబ్జెక్ట్​పై అవగాహన కల్పించినప్పటికీ వినిపించుకోవడం లేదని వాపోతున్నారు. ఈ క్రమంలో మంత్రులతో తాము కూడా గ్యాప్​ను ఎదుర్కొవాల్సి వస్తున్నదని వారు అంటున్నారు.

‘ఆ ఫైల్​ ఏమైంది?’ అని సీఎం గుర్తుచేస్తేనే..!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఆదేశించిన అంశాలకు సంబంధించిన దస్త్రాలు కూడా అధికారుల నిర్లక్ష్యం వల్ల ముందుకు సాగడం లేదని సమాచారం. ఏదైనా ఒక అంశంపై నిర్ణయం తీసుకుని, దానికి సంబంధించిన విధివిధానాలను రూపొందించి నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశిస్తే.. రోజులు గడుస్తున్నా ఆ ఫైల్స్ సిద్ధం కావడం లేదు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా అధికారులను పిలిపించుకుని ‘ఆ ఫైల్ ఏమైంది? జీవో ఎందుకు ఆలస్యం చేస్తున్నారు?’ అని గుర్తుచేస్తే తప్ప అధికారులు స్పందించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. 

సీఎంవోలో అధికారుల మధ్య సమన్వయం లేకపోవడం, ఒకరి బాధ్యతలను మరొకరు చూసుకోవాల్సి రావడం వంటి కారణాలతో సమస్య వస్తున్నది. ముఖ్యంగా కీలకమైన అంశాలపై నోట్ ప్రిపేర్ చేసి ముఖ్యమంత్రికి నివేదించడంలో అధికారులు విఫలమవుతున్నారని, దీనివల్ల ప్రభుత్వ నిర్ణయాలు ప్రజల్లోకి వెళ్లడంలో జాప్యం జరుగుతున్నదని సెక్రటేరియెట్​ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. 

అధికారులు ప్రోయాక్టివ్‌‌‌‌‌‌‌‌గా ఉండకపోవడంపై చాలాసార్లు సీఎం మందలించినా పనితీరులో మార్పు రాలేదని తెలుస్తున్నది. సీఎం బిజీగా ఉండే సమయాల్లో సాధారణ అంశాలలోనూ నిర్ణయాలు తీసుకోవడంలో అధికారులు చేస్తున్న జాప్యం వల్ల సంక్షేమ పథకాల అమలులో ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ‘‘ఫైల్ సీఎంకు పెట్టి సైన్​ చేయించాలంటే  రోజుల తరబడి సాగదీస్తున్నారు.. వీరివల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తున్నది’’ అని స్వయంగా ఓ సీనియర్ మంత్రి తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం.

సరైన అవగాహన లేక..!

సీఎంవోలో ఉన్న అధికారుల నేపథ్యంపై కూడా మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం సీఎంవోలో కీలక బాధ్యతల్లో ఉన్న ఇద్దరు ఐఏఎస్, ఒకరు రిటైర్డ్​ ఐఏఎస్​ అధికారి ఇతర రాష్ట్రాలకు చెందినవారు. వీరికి తెలంగాణ ప్రాంత పరిస్థితులు, ఇక్కడి ప్రజాప్రతినిధుల అవసరాలపై సరైన అవగాహన లేకపోవడం, లేదా పట్టింపు లేకపోవడం వల్లే పనులు జరగడం లేదన్న వాదన వినిపిస్తున్నది. 

తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు, స్థానిక రాజకీయ సమీకరణాలను అర్థం చేసుకోకుండా, కేవలం నిబంధనల పేరుతో ఫైళ్లకు కొర్రీలు పెడుతూ పక్కన పెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. స్థానికతపై అవగాహన ఉన్న అధికారులకు బాధ్యతలు ఇవ్వడం, లేదంటే సీనియర్​ ఐఏఎస్​లకు అప్పగిస్తే కాస్త కుదుట పడే అవకాశం ఉందనే అభిప్రాయం ప్రభుత్వవర్గాల్లో వినిపిస్తున్నది. 

మరోవైపు, డిఫెన్స్​ నుంచి డిప్యూటేషన్​పై పనిచేస్తున్న సీఎం ప్రత్యేక కార్యదర్శి వ్యవహారశైలిపై కూడా పలువురు పెదవి విరుస్తున్నారు. డిఫెన్స్​బ్యాక్‌‌‌‌‌‌‌‌గ్రౌండ్ నుంచి వచ్చిన అధికారి కావడంతో, సివిల్ అడ్మినిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌లో ఉండాల్సిన సానుకూలత ఆ ఆఫీసర్​లో లోపించడంతో పాటు సివిల్​ సర్వెంట్​ కాకపోవడంతో ఆయన ఆదేశాలను  ఐఏఎస్​లు పెద్దగా పట్టించుకోవడం లేదని ప్రచారం జరుగుతున్నది.