కాలేజీ పర్మిషన్ల కోసం కందిపప్పు, పచ్చళ్ల రాజకీయం.. ఏపీ మాజీ ఎమ్మెల్యేపై సీఎంఓ ఆరా.. వెలుగు కథనానికి స్పందన!

కాలేజీ పర్మిషన్ల కోసం కందిపప్పు, పచ్చళ్ల రాజకీయం.. ఏపీ మాజీ ఎమ్మెల్యేపై సీఎంఓ ఆరా.. వెలుగు కథనానికి స్పందన!
  • ‘వెలుగు’ కథనానికి సర్కారు స్పందన.. 
  • ఆఫీసర్లను మచ్చిక చేసుకునేందుకు పచ్చళ్ల జాడీలు, కందిపప్పు పంపిణీ!

హైదరాబాద్, వెలుగు: అనుమతులు లేకపోయినా అడ్మిషన్లు, ఆన్‌‌లైన్ క్లాసులు నిర్వహిస్తున్న డిగ్రీ కాలేజీల వ్యవహారం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ‘అనుమతి లేకుండానే.. అడ్మిషన్లు నడుస్తున్నయ్’ పేరుతో ‘వెలుగు’ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి స్పందించి సీఎంవో సీరియస్ అయింది. ఈ వ్యవహారంపై సీఎంఓ కార్యదర్శి అజిత్ రెడ్డి.. హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డిని ఆరా తీశారు. 

జాడీల లంచం.. తిరస్కరించిన అధికారులు

ఆంధ్రాకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే ఆదిత్య సొసైటీ పేరుతో పది కాలేజీల ఏర్పాటుకు అప్లై చేయగా, నిబంధనలకు విరుద్ధంగా ఉండడంతో కౌన్సిల్ అధికారులు నిరాకరించారు. దీంతో సదరు నేత అధికారులను మచ్చిక చేసుకునేందుకు వారికి ఆంధ్రా నుంచి తెప్పించిన పచ్చళ్ల జాడీలు, కందిపప్పు ప్యాకెట్లు పంపినట్టు సమాచారం. అధికారులు వాటిని తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఇది కూడా లంచం కిందికే వస్తుందని, దీనిపై విచారణ జరిపించాలని విద్యార్థి సంఘాలు 
డిమాండ్ చేస్తున్నాయి. 

అడ్మిషన్లు.. ఆన్‌‌లైన్ క్లాసులు

కనీసం మూడు, నాలుగు కాలేజీలకైనా పర్మిషన్ ఇవ్వాలని సదరు మాజీ ఎమ్మెల్యే ఓయూ, కౌన్సిల్, సెక్రటేరియట్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మరోవైపు పర్మిషన్ రాకముందే అడ్మిషన్లు తీసుకుని, ఆన్‌‌లైన్ క్లాసులు నిర్వహిస్తుండటం గమనార్హం. ఏపీలో రిజిస్ట్రేషన్ ఉన్న సంస్థను.. తెలంగాణలో రిజిస్టర్ చేయించి పర్మిషన్ తెచ్చుకోవాలని పావులు కదుపుతున్నారు. డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ చివరి దశకు చేరుకోవడంతో కొత్త కాలేజీలకు అనుమతులు ఇవ్వడం అసాధ్యమని అధికారులు స్పష్టంచేస్తున్నారు. నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకోకపోవడంతోనే అనుమతులు నిలిపివేశామని కౌన్సిల్ చైర్మన్ బాలకిష్టారెడ్డి వెల్లడించారు.