బొగ్గు గనిలో భారీ పేలుడు.. 82 మంది మృతి..!

బొగ్గు గనిలో భారీ పేలుడు.. 82 మంది మృతి..!

బీజింగ్: చైనాలో ఘోర ప్రమాదం జరిగింది. చాంగ్జీ నగరంలోని లియుషెన్యు బొగ్గు గనిలో భారీ పేలుడు సంభవించి దాదాపు 82 మంది కార్మికులు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడినట్లు చైనా ప్రభుత్వ అధికారిక మీడియా సంస్థ జిన్హువా నివేదించింది. ఈ ఘటన శుక్రవారం (మే 22) సాయంత్రం జరగ్గా.. మరికొందరు బొగ్గు గనిలోనే చిక్కుకుపోయినట్లు తెలిపింది. ప్రమాద సమయంలో సుమారు 247 మంది కార్మికులు గనిలో ఉన్నట్లు వెల్లడించింది. 

సమాచారం అందిన వెంటనే ఘటన స్థలంలో యుద్ధ ప్రాతిపదికన సహయక చర్యలు చేపట్టినట్లు తెలిపింది. గల్లంతైన వారిని రక్షించేందుకు పూర్తిస్థాయి ప్రయత్నాలు చేయాలని, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఆదేశించినట్లు జిన్హువా పేర్కొంది. 

గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని, సహాయక చర్యల్లో అధికారులు ఎట్టిపరిస్థితుల్లో నిర్లక్ష్యం వహించొద్దని జిన్ పింగ్ ఆదేశించారు. పేలుడుకు గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. లియుషెన్యు గనికి బాధ్యత వహించే కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.