టెన్నిస్ కొత్త తార..చరిత్ర సృష్టించిన కోకో గాఫ్

టెన్నిస్  కొత్త తార..చరిత్ర సృష్టించిన కోకో గాఫ్

అమెరికా టెన్నిస్‌లో కొత్త తార అవతరించింది.  ఫ్లోరిడాకు చెందిన యువ సంచలనం కోకో గాఫ్ యూఎస్ ఓపెన్ - 2023 ఛాంపియన్గా మారింది. యూఎస్ ఓపెన్  మహిళల సింగిల్స్ ఫైనల్లో కోకో గాఫ్.. 2-6, 6-3, 6-2 తేడాతో  రెండో సీడ్ అరీనా సబలెంకను ఓడించి టైటిల్ను కైవసం చేసుకుంది.

హోరా హోరీ..

సెప్టెంబర్ 10వ తేదీ ఆదివారం తెల్లవారుజామున న్యూయార్క్‌లోని ఆర్థర్ ఆషే స్టేడియంలో జరిగిన యూఎస్ ఓపెన్ ఉమెన్స్  సింగిల్స్ ఫైనల్లో   ఆరో సీడ్  కోకో గాఫ్ తొలి గేమ్‌  2--6తో ఫస్ట్ సెట్ను కోల్పోయింది. అయితే రెండో సెట్లో  కోకో గాఫ్ శివంగిలా రెచ్చిపోయింది. అద్భుతమైన షాట్లు..స్మాష్ లతో సబలెంకను పరిగెత్తించింది. ఇదే ఊపులో  రెండో సెట్లో సబలెంకను ఓడించింది. నిర్ణయాత్మక మూడో సెట్లోనూ ఇదే ఆటతీరును కనభర్చిన కోకో గాఫ్.. మూడో గేమ్‌‌లోనూ గెలిచి..యూఎస్ ఓపెన్ టైటిల్ను సొంతం చేసుకుంది. 


కోకో కొత్త చరిత్ర..

యూఎస్ ఓపెన్ 2023 ఉమెన్స్ ఛాంపియన్గా నిలిచిన  గాఫ్  కొత్త చరిత్ర సృష్టించింది.  19 ఏండ్ల నల్లకలువకు ఇదే మేజర్ టైటిల్ కావడం విశేషం. 2022లో  ఫ్రెంచ్ ఓపెన్‌ రన్నరప్‌గా నిలిచిన గాఫ్....1999లో సెరెనా విలియమ్స్ తర్వాత యూఎస్ ఓపెన్ గెలిచిన  తొలి అమెరికన్ టీనేజర్. అంతేకాదు అతి తక్కువ వయసులోనే  యూఎస్ ఓపెన్ గెలిచిన అమెరికన్ ఆటగాళ్లలో ట్రాసీ ఆస్టిన్, సెరెనా విలియమ్స్ తర్వాత కోకో గాఫ్ ఆ ఘనత దక్కించుకుంది.