ప్రభుత్వ ఉద్యోగికి 383 ఏళ్ల జైలు శిక్ష..

ప్రభుత్వ ఉద్యోగికి 383 ఏళ్ల జైలు శిక్ష..

ఎవరైనా దోషిగా తేలితే ఎన్నేళ్లు జైలు శిక్ష వేస్తారు? మహా అయితే 20 లేదా 30 ఆపైనా అంటే జీవితఖైదు. అంతేగా. ఓ కేసులో ఉద్యోగికి దాదాపు 400 ఏళ్ల జైలు శిక్ష విధించడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి మోసం చేసిన కేసులో ఓ వ్యక్తికి తమిళనాడులోని కోయంబత్తూర్​ కోర్టు ఈ శిక్ష విధించింది. ఆ రాష్ట్ర  ఆర్టీసీ కోయంబత్తూర్​ డివిజన్లోని బస్సుల వేలంలో అక్రమాలు జరిగాయంటూ 1988 నవంబర్​ 9న పోలీస్​స్టేషన్​లో కేసు నమోదు అయింది. సంస్థకు చెందిన 47 బస్సులను ఫేక్​ డాక్యుమెంట్లతో అమ్మి, రూ.28 లక్షల మోసం చేశారంటూ 8 మంది ప్రభుత్వ ఉద్యోగులపై ఉన్నతాధికారులు కంప్లెంట్​ చేశారు. 

నిందితులు వీళ్లే..

కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణను కొనసాగించారు. ఈ అక్రమాలకు పాల్పడింది 8 మంది ప్రభుత్వ ఉద్యోగులేనంటూ అధికారులు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా కోదండపాణి, రామచంద్రన్, నాగరాజన్, నటరాజన్, మురునాథన్, దురైస్వామి, రంగనాథన్‌, రాజేంద్రన్‌లను అరెస్ట్ చేశారు. 

ఈకేసు గత 35ఏళ్ల సుదీర్ఘ విచారణ తరువాత ఈ తీర్పు వెలువరించడం సంచలనంగా మారింది. విచారణ జరుగుతున్న టైంలోనే నలుగురు నిందితులు మృతి చెందారు.
ఈ చీటింగ్ కేసులో మిగిలిన నలుగురిలో ముగ్గుర్ని న్యాయస్థానం నిర్దోషులుగా నిర్ధారించి వదిలివేసింది. 

మిగిలిన ఒక్క ప్రభుత్వోద్యోగి కోదండపాణి(82)ని దోషిగా గుర్తిస్తూ అతనికి 47 నేరాలు చేసినందుకుగాను ఒక్కొక్క కేసుకు 4 సంవత్సరాల జైలు శిక్ష చొప్పున 188ఏళ్లు శిక్ష విధించింది. దీంతో పాటు 47 ఫోర్జరీ సంతకాలు చేసినందుకు ఒక్కొక్క నేరానికి నాలుగేళ్ల చొప్పున మరో 188 సంవత్సరాల జైలుశిక్ష విధించింది. 

అలాగే ప్రభుత్వ ఆస్తుల్ని దోచుకున్నందుకు మరో ఏడేళ్లు శిక్షను పెంచింది. మొత్తం 95కేసుల్లో 383 సంవత్సరాల జైలుశిక్షను విధిస్తూ కోర్టు తీర్పిచ్చింది. దీంతో పాటు 3.32కోట్ల రూపాయల జరిమానా విధించారు. దోషిని పోలీసులు జైలుకు తరలించారు. రాష్ట్రంలోని అన్ని న్యాయస్థానాల తీర్పుల్లో ఇదే సంచలనంగా భావిస్తున్నారు విశ్లేషకులు.