పొలంలో దొరికిన నాణేలు, ఆభరణాలు.. వాటా కోసం అన్నదమ్ముల గొడవ

పొలంలో దొరికిన నాణేలు, ఆభరణాలు.. వాటా కోసం అన్నదమ్ముల గొడవ

యాదాద్రి భువనగిరి జిల్లా: రామన్నపేట మండలం కుంకుడుపాముల గ్రామంలో రైతు పొలంలో దొరికిన నాణేలు, ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కన్నెబోయిన మల్లయ్య అనే రైతు పొలం గట్లు తీస్తుండగా ఓ మట్టిపాత్ర, ఇనుప పెట్టె బయట పడ్డాయి. మట్టిపాత్రలో 38 వెండి నాణేలు, 5 వెండి పట్టీలు, 14 వెండి రింగులు ఉన్నాయి. ఇనుప పెట్టెలో 19 బంగారు బిళ్లలు, ఐదు బంగారు గుండ్లు, వెండి నాణేలు దొరికాయి. మల్లయ్య పొలంలో నాటు వేసేందుకు వచ్చిన కూలీలు మనిషికొకటి తీసుకోవడానికి చేతిలో పట్టుకున్నారు. అదే సమయంలో ఒక మహిళ పూనకం వచ్చినట్టు ఊగి వాటిని ముట్టుకుంటే అరిష్టమని చెప్పింది. దీంతో కూలీలు నాణేలు, ఆభరణాలను తిరిగి ఇచ్చి వేశారు.

పొలంలో దొరికిన నిధిని మల్లయ్య ఇంటి దగ్గర పెంటకుప్పలో దాచి పెట్టాడు.  వరినాట్లు ముగిసిన రెండురోజుల తర్వాత మల్లయ్య  సోదరులిద్దరు గ్రామంలోని ఓ పెద్దమనిషిని ఆశ్రయించారు. ఆభరణాలు సమానంగా పంచుకోవాలని ఆయన సలహా ఇచ్చాడు. నిధి పంచుకునే సమయంలో అన్నదమ్ములిద్దరికీ తేడా వచ్చింది. దీంతో ఇద్దరి మధ్యన గొడవ జరగడంతో.. నిధులను రామన్నపేట పోలీసులకు అప్పగించాడు మల్లయ్య. వీటిని పురావస్తు శాఖకు అప్పగిస్తామన్నారు రెవెన్యూ అధికారులు.