- అనేక చోట్ల 10 డిగ్రీల లోపే
- చలికి ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు, రైతులు
మెదక్/సంగారెడ్డి/సిద్దిపేట, వెలుగు: గత రెండు, మూడు రోజులుగా ఉమ్మడి మెదక్ జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలి తీవ్రత బాగా పెరగడంతో ప్రజలు గజ గజ వణుకుతున్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా కోహిర్ లో 8.1 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు కాగా ఝరాసంగం 8.8, సదాశివపేటలో 9.0, గుమ్మడిదల 9.4, కంగ్టి 9.5, నిజాంపేటలో 9.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం దామరంచలో 9.5 సెల్సియస్, సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం అంగడి కిష్టాపూర్ లో 9.4 సెల్సియస్ డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదయింది. అనేక ప్రాంతాల్లో నాలుగైదు రోజులుగా 10 డిగ్రీల లోపు కనిష్ట ఉష్ణోగ్రత నమోదవుతోంది.
ఉదయం ఎనిమిది దాటినా..
సాయంత్రం 5 గంటల నుంచే చలి ప్రభావం మొదలవుతుండగా పొద్దున 8 గంటలు దాటినా చలి తీవ్రత తగ్గడం లేదు. జన జీవనంపై చలి తీవ్ర ప్రభావం చూపుతోంది. ఉదయం గ్రామల నుంచి పట్టణాలకు బస్సులు, ఆటోల్లో స్కూళ్లకు వెళ్లే స్టూడెంట్స్, గ్రామాల నుంచి పట్టణాలు, మండల కేంద్రాలకు పాలు, కూరగాయలు తీసుకెళ్లే, రైతులు, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రాత్రి వేళ కాపలా ఉంటున్న రైతులు చలికి వణికిపోతున్నారు.
పొగమంచుతో ఇబ్బందులు..
ఉదయం పూట పొగ మంచు కురుస్తుండడంతో ఉమ్మడి మెదక్ జిల్లాలోని 44, 65, 161, 765డీ, 765 డీజీ నేషనల్ హైవేలు, రాజీవ్ రహదారి మీద వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మంచు దట్టంగా కురుస్తుండడంతో ముందున్న వాహనాలు కనిపించక పొద్దుటి పూట లైట్లు వేసుకొని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.
ఆరోగ్య సమస్యలు..
చలి తీవ్రత బాగా పెరుగుతుండడంతో ప్రజలు ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు వణికి పోతున్నారు. చలి కారణంగా జలుబు, దగ్గు, జ్వరం వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. చిన్న పిల్లల ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి.
జాగ్రత్తలు పాటించాలి
చలి తీవ్రత బాగా పెరగడంతో ఉదయం, రాత్రి వేళల్లో పొగమంచు పేరుకు పోయి రహదారులపై ముందు ఉన్న వాహనాలు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. బైక్ ల మీద వెళ్లేవారు హెల్మెట్, చేతులకు గ్లౌవ్స్ తప్పనిసరిగా ధరించాలి. హై బీమ్ కాకుండా లో బీమ్ లైట్లు మాత్రమే ఉపయోగించాలి. రిఫ్లెక్టివ్ జాకెట్లు, స్టిక్కర్లు వాడుకోవాలి. నెమ్మదిగా వెళ్లడంతో పాటు సడన్ బ్రేకులు వేయకుండా జాగ్రత్త పడాలి.
టర్నింగ్ ల వద్ద ఇండికేటర్ ఇవ్వాలి. పొగ మంచు కురుస్తున్న సమయాల్లో ప్రయాణించక పోవడం ఉత్తమం. ఫోర్ వీలర్ వెహికల్ నడిపే డ్రైవర్లు ఫాగ్ ల్యాంప్స్ లేదా లో బీమ్ లైట్లు మాత్రమే వాడాలి. డిఫాగర్ ఉపయోగించాలి, విండోలను కొద్దిగా ఓపెన్ చేసి ఫాగింగ్ నివారించాలి. హాజర్డ్ లైట్లు విజిబిలిటీ తక్కువగా ఉన్నప్పుడు వాడాలి. లైన్ మార్కింగ్‌లు, రోడ్ రిఫ్లెక్టర్లను గమనిస్తూ నడపాలి. వైపర్స్, లైట్లు, బ్రేకులు సరిగా పనిచేస్తున్నాయో లేదో ముందుగానే తనిఖీ చేసుకోవాలి - డీవీ శ్రీనివాస్ రావు, మెదక్ ఎస్పీ
