జలుబు కేసులు పెరుగుతున్నయ్‌‌..భయంతో టెస్టులకు జనం క్యూ

జలుబు కేసులు పెరుగుతున్నయ్‌‌..భయంతో టెస్టులకు జనం క్యూ

హైదరాబాద్, వెలుగు: వాతావరణ మార్పులతో సీజనల్ ఇన్‌‌ఫ్లుయెంజా కేసులు పెరుగుతున్నయి. దగ్గు, జలుబు, తుమ్ములతో జనాలు ఇబ్బంది పడుతున్నారు. చలికాలంలో ఫ్లూ సహజమే అయినా.. కరోనా ఎఫెక్ట్‌‌తో జనం ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్‌‌ వస్తుందని, మరోసారి విజృంభించే ప్రమాదం ఉందన్న ఆరోగ్యశాఖ హెచ్చరికలతో ప్రజల్లో ఆందోళన మరింత ఎక్కువైంది. ఐఎల్‌‌ఐ (ఇన్‌‌ఫ్లుయెంజా లైక్‌‌ ఇల్‌‌నెస్‌‌) లక్షణాలతో కరోనా టెస్టుల కోసం రోజూ వేల మంది క్యూ కడుతున్నారు. సగటున 40 నుంచి 45 వేల మంది రోజూ టెస్టులు చేయించుకుంటున్నారు. ఇందులో 20 వేల మంది దాకా ఐఎల్‌‌ఐ లక్షణాలతోనే టెస్టుకు వస్తున్నారు. వీటిలో కేవలం వెయ్యి నుంచి 15 వందల మందికి మాత్రమే పాజిటివ్ వస్తోందని అధికారులు చెబుతున్నారు. మిగిలిన వాళ్లు సాధారణ దగ్గు, జలుబుతో ఇబ్బంది పడుతున్నవారే ఉంటున్నారని అంటున్నారు. ప్రైవేట్ డయాగ్నస్టిక్ సెంటర్లలోనూ కరోనా టెస్టులకు డిమాండ్ మళ్లీ పెరుగుతోంది. మొన్నటి వరకు ప్రైవేట్ సెంటర్లలో రోజుకు 2 వేల టెస్టులు జరగ్గా, ఇప్పుడు రోజూ 3 వేల టెస్టులు చేస్తున్నారు.

4.73 లక్షల మందికి సీజన్ జబ్బులు

ఈ ఏడాది అక్టోబర్ చివరి వారానికి రాష్ట్రంలో 4.73 లక్షల మంది సీజనల్ వ్యాధులతో బాధపడుతున్నట్టు ఆరోగ్యశాఖ లెక్కలు చెబుతున్నయి. ఇందులో అత్యధికంగా 2.10 లక్షల ఐఎల్‌‌ఐ కేసులు, 1.22 లక్షల డయేరియా కేసులు ఉన్నాయి. 1.19 లక్షల మంది వైరల్ ఫీవర్ బారిన పడ్డారని హెల్త్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ వెల్లడించింది. వారం రోజులుగా చలి పెరగడంతో ఐఎల్‌‌ఐ కేసులు మరింత పెరిగే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. కరోనా మరోసారి విజృంభించే ప్రమాదమున్న నేపథ్యంలో ఐఎల్ఐ లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా, కచ్చితంగా కరోనా టెస్ట్ చేయించుకోవాలని సూచిస్తున్నారు.

స్వైన్‌‌ఫ్లూ ముప్పు

చలికాలంలో కరోనాతో పాటు, స్వైన్‌‌ఫ్లూ ముప్పు కూడా ఎక్కువగానే ఉంటోంది. ఈ ఏడాది సెప్టెంబర్ చివరి నాటికి రాష్ట్రవ్యాప్తంగా 446 స్వైన్‌‌ఫ్లూ కేసులు నమోదు కాగా, ఐదుగురు మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 5 వందలు దాటింది. హైదరాబాద్‌‌, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. కరోనా తరహాలోనే స్వైన్‌‌ఫ్లూ కూడా రెస్పిరేటరీ సిస్టంపైనే ఎఫెక్ట్‌‌ చూపిస్తుంది. ఈ నేపథ్యంలో రెండు వైరస్‌‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

ఐసీఎంఆర్ సీనియర్ సైంటిస్ట్ వెల్లడి

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇండియన్‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌ ఫర్‌‌‌‌ మెడికల్‌‌‌‌ రీసెర్చ్‌‌‌‌ (ఐసీఎంఆర్), భారత్ బయోటెక్ కంపెనీ తయారు చేస్తున్న కరోనా వ్యాక్సిన్‌‌‌‌ వచ్చే ఏడాది ఫిబ్రవరి కల్లా అందుబాటులోకి వస్తుందని  సీనియర్‌‌‌‌ సైంటిస్టు ఒకరు గురువారం వెల్లడించారు. ‘కొవ్యాగ్జిన్‌‌‌‌’ అని పేరు పెట్టిన ఈ వ్యాక్సిన్ వచ్చే ఏడాది రెండో త్రైమాసికంలో రెడీ అవుతుందని ముందు అనుకున్నామని, కానీ అంతకన్నా ముందే వ్యాక్సిన్ సిద్ధమవుతుందన్నారు. ‘కొవ్యాగ్జిన్‌‌‌‌ మంచి పనితీరు కనబరుస్తోంది. ఫస్ట్‌‌‌‌, సెకండ్‌‌‌‌ ట్రయల్స్‌‌‌‌లో జంతువులపై మంచి ప్రభావం చూపింది. అయితే మూడో ట్రయల్స్‌‌‌‌ పూర్తయ్యే వరకూ వ్యాక్సిన్‌‌‌‌ 100 శాతం సేఫ్‌‌‌‌ అని చెప్పలేం. 2021 ఫిబ్రవరి, మార్చి కల్లా అందుబాటులోకి రావొచ్చు’ అని ఐసీఎంఆర్‌‌‌‌ సీనియర్‌‌‌‌ సైంటిస్టు రజినీకాంత్‌‌‌‌ చెప్పారు. అయితే మూడో స్టేజ్‌‌‌‌ కన్నా ముందే వ్యాక్సిన్‌‌‌‌ను జనాలకు ఇవ్వాలా వద్దా కేంద్ర ఆరోగ్య శాఖ నిర్ణయం తీసుకోవాలన్నారు. ఈ విషయంపై భారత్‌‌‌‌ బయోటెక్‌‌‌‌ ఇంకా స్పందించలేదు. కొవ్యాగ్జిన్‌‌‌‌ రెడీ అయితే దేశంలో అందుబాటులోకి వచ్చిన తొలి వ్యాక్సిన్‌‌‌‌ ఇదే అవుతుంది.