ఢిల్లీలో 7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత

ఢిల్లీలో 7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత

ఉత్తర భారతంలో చలి పంజా విసురుతోంది. ఢిల్లీసహా అనేక రాష్ట్రాల్లో చలి వణికిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీని దట్టమైన పొగమంచు అలుముకుంది. రికార్డు స్థాయిలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. మంగళవారం కనిష్ఠ ఉష్ణోగ్రతలు 7 డిగ్రీలుగా నమోదయ్యాయి. అటు సోమవారం కూడా ఢిల్లీలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. గరిష్ఠ ఉష్ణోగ్రత 15.6 డిగ్రీలు నమోదవ్వగా... కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఏకంగా 5 డిగ్రీలుగా నమోదవడం గమనార్హం. మరోవైపు ఢిల్లీలో  రెండు మూడు రోజుల పాటు చలిగాలులు వీచే అవకాశం ఉందని అక్కడి వాతావరణశాఖ ప్రకటించింది. అటు పొగ మంచు కారణంగా ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

జమ్మూ కశ్మీర్‌లో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సున్నా డిగ్రీలకంటే తక్కువగా నమోదవుతున్నాయి. పర్వతాల నుంచి వీస్తున్న చలిగాలుల కారణంగా ప్రజలు చలితో వణుకుతున్నారు. పంజాబ్, హర్యానా, చండీగఢ్‌లో ఢిల్లీలోని చాలా ప్రాంతాలు, ఉత్తరాఖండ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లోని చాలా చోట్ల చలితీవ్రత భారీగా పెరిగింది. ఉత్తర ప్రదేశ్ లోని బరేలీలో ఉష్ణోగ్రత భారీగా పడిపోయాయి. అక్కడ కనిష్ఠ ఉష్ణోగ్రతలు 5 డిగ్రీలుగా నమోదయ్యాయి. దీంతో చలిని తట్టుకునేందుకు స్థానిక ప్రజలు మంటలు వేసుకున్నారు.

యూపీలోని మొరాదాబాద్‌ ను పొగ మంచు కమ్మేసింది. పొంగ మంచు కారణంగా అనేక ప్రాంతాల్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.