CPL 2025: సెంచరీతో న్యూజిలాండ్ క్రికెటర్ విధ్వంసం.. సూర్య, గిల్ రికార్డ్స్ సమం

CPL 2025: సెంచరీతో న్యూజిలాండ్ క్రికెటర్ విధ్వంసం.. సూర్య, గిల్ రికార్డ్స్ సమం

న్యూజిలాండ్ వెటరన్ క్రికెటర్ కొలిన్ మున్రో టీ20 క్రికెట్ లో చెలరేగి ఆడుతున్నాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించినా ప్రపంచ టీ20 లీగ్ ల్లో తన ఫామ్ కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న కరీబియన్ ప్రీమియర్ లీగ్ లో తొలి మ్యాచ్ లోనే తన హవా చూపించాడు. టీ20 క్రికెట్ లో తాను ఇంకా ప్రమాదకారి అని నిరూపిస్తూ మెరుపు సెంచరీ బాదాడు. ఓవరాల్ గా 57 బంతుల్లోనే 120 పరుగులు చేసి టీ20 క్రికెట్ లో తన ఆరో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ జట్టు తరపున ఆడుతున్న ఈ కివీస్ బ్యాటర్.. సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్‌పై ఈ ఘనత అందుకున్నాడు. 

మున్రో ఇన్నింగ్స్ లో 14 ఫోర్లతో పాటు, 6 సిక్సర్లు ఉన్నాయి. తొలి వికెట్ కు హేల్స్ తో కలిసి 9 ఓవర్లలోనే 114 పరుగులు చేసి అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. ఈ సెంచరీతో మున్రో టీమిండియా స్టార్ బ్యాటర్లు సూర్య కుమార్ యాదవ్, శుభమాన్ గిల్ సరసన చేరాడు. టీ20 ఫార్మాట్ లో ఆరు సెంచరీలతో ఈ కివీస్ ఓపెనర్ సూర్య, గిల్ ల రికార్డ్ ను సమం చేశాడు. గిల్, సూర్య టీ20 క్రికెట్ లో ఆరు సెంచరీలు చేశారు. అంతేకాదు కరీబియన్ ప్రీమియర్ లీగ్ లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన మూడో బ్యాటర్ గా రికార్డులకెక్కాడు. తొలి రెండు స్థానాల్లో బ్రాండన్ కింగ్ (132*), ఆండ్రీ రస్సెల్ (121*) ఉన్నారు.

►ALSO READ | Asia Cup 2025: అలా చేస్తేనే బాబర్‌కు టీ20 వరల్డ్ కప్‌లో చోటు దక్కుతుంది: పాకిస్థాన్ కోచ్

ఈ మ్యాచ్ విషయానికి వస్తే సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్‌ పైట్రిన్‌బాగో నైట్ రైడర్స్ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. మున్రో 57 బంతుల్లోనే 120 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. హేల్స్ 47 పరుగులు చేసి రాణించాడు. భారీ లక్ష్య ఛేదనలో సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 219 పరుగులకే పరిమితమైంది. ఉస్మాన్ తారిక్ నాలుగు వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.