డీజే పాటలకు డ్యాన్స్ చేస్తూ కుప్పకూలాడు.. మెదడులో రక్తం గడ్డ కట్టినట్లు నిర్ధారణ !

డీజే పాటలకు డ్యాన్స్ చేస్తూ కుప్పకూలాడు.. మెదడులో రక్తం గడ్డ కట్టినట్లు నిర్ధారణ !

ఖమ్మం: ఖమ్మం జిల్లా తల్లాడ మండలం నారాయణపురం ఎస్సీ కాలనీలో బంధువుల ఇంట పెళ్లి వేడుకలో డీజే పాటలకు డ్యాన్స్ చేస్తూ యువకుడు కుప్పకూలి పడిపోయాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల్లో మెదడులో రక్తం గడ్డ కట్టినట్లు నిర్ధారణ అయింది. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. ఇప్పటివరకు సుమారు రూ.50 వేల వరకు ఖర్చు అయినట్లు కుటుంబ సభ్యుల వెల్లడించారు. 

చికిత్సకు మరో రూ.6 లక్షలు అవసరమని వైద్యులు తెలిపారు. వ్యవసాయ కూలీ పనులు చేస్తూ  జీవనం కొనసాగిస్తున్న యువకుడి తల్లిదండ్రులు ఇంత మొత్తం తమ దగ్గర లేదని కొడుకు దీన స్థితి చూసి కన్నీరుమున్నీరవుతున్నారు. చికిత్స కోసం దాతలు చేయూత ఇవ్వాలని వేడుకుంటున్నారు. డీజే శబ్దం తీవ్రతే అనారోగ్యానికి కారణమై ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.

ఈ డీజేల కారణంగా గుండెపోటుతో చనిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి. 2025లో బతుకమ్మ ఆడుతుండగా గుండెపోటు రావడంతో 30 ఏండ్ల మహిళ ప్రాణాలు కోల్పోయింది. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఎంచగూడంలో ఈ ఘటన జరిగింది. ఎంచగూడంలో బతుకమ్మ వేడుకల సందర్భంగా డీజే ఏర్పాటు చేశారు. 

ఈ క్రమంలో జర్నలిస్ట్ శెట్టి పరశురాం భార్య మౌనిక(30) డీజే పాటలకు బతుకమ్మ ఆడుతుండగా ఉన్నట్టుండి కిందపడిపోయారు. తోటి మహిళల సమాచారంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మౌనిక చనిపోయారు. గుండెపోటుతో మరణించినట్టు డాక్టర్లు నిర్ధారించారు.